మీ పాపం పండెను నేడు
- Prasad Satyam
- Nov 13, 2025
- 3 min read
నరసన్నపేట నకిలీ రుణాల కేసులో సీఐడీ అదుపులో పాత బీఎం
గార బ్రాంచి కుంభకోణంలో శ్రీకాకుళం డీఎస్పీ ఇంటరాగేషన్
కొద్ది రోజుల్లో అరెస్టు చేసే అవకాశం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
శ్రీకాకుళం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటేనే కుంభకోణాలమయమని తేలిపోయింది. ఎన్ని బ్రాంచిల్లో ఎన్ని అక్రమాలు పత్రికలు వెలికితీస్తున్నా సంబంధిత మేనేజ్‌మెంట్‌కు చీమ కుట్టినట్టయినా లేదని, ‘సత్యం’ పేపరు మాత్రం చింపుకొని రాస్తుందని భావించినవారూ ఉన్నారు. అయితే దేనికైనా ఒక సమయం రావాలంటారు పెద్దలు. ఇన్నాళ్లకు ప్రజల సొమ్మును అప్పనంగా సొంతానికి వాడుకున్నవారి పాపం పండిరది. వారి భరతం పట్టడానికి ఒకవైపు సీఐడీ, మరోవైపు శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద ఒకేసారి రంగంలోకి దిగారు. నరసన్నపేట బజారు బ్రాంచిలో నకిలీ పత్రాలు సృష్టించి ఎంఎస్‌ఎంఈ, పర్సనల్ లోన్లు చేయించుకొని తమ సొంతానికి అక్కడి సిబ్బంది వాడుకున్నారని ‘సత్యం’ మొట్టమొదట ఫ్లాష్ చేసింది. ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాల్లో అప్పుడు బ్రాంచి మేనేజర్‌గా పని చేస్తున్న శ్రీకర్‌ను ఉద్యోగం నుంచి తొలగించి ఈ కేసును సీఐడీకి అప్పగించారు. దీంతో బజారుబ్రాంచిలో నకిలీల పేరిట రుణాలు వాడేసింది రూ.3 కోట్లు కాదని, రూ.7.25 కోట్ల వరకు ఉందని సీఐడీ దర్యాప్తులో ప్రాథమికంగా తేలినట్టు తెలుస్తుంది. దీంతో అప్పటి బ్రాంచి మేనేజర్ శ్రీకర్‌ను సీఐడీ అదుపులోకి తీసుకున్నట్టు బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. శ్రీకర్‌ను బజారుబ్రాంచికి తీసుకువెళ్లి రికార్డులు పరిశీలించిన అనంతరం గురువారం నగరంలో ఉన్న రీజనల్ ఆఫీసుకు తీసుకువచ్చారని తెలుస్తుంది. ఎందుకంటే.. బ్రాంచి మేనేజర్‌గా లోన్ ఇచ్చే అధికారం రీజనల్ మేనేజర్‌దని, ఇందులో తన పాత్ర పరిమితమని శ్రీకర్ చెప్పడంతో రీజనల్ ఆఫీస్‌లో రికార్డులు పరిశీలించడం మొదలుపెట్టారు. వాస్తవానికి ఎవరైనా రుణానికి అప్లై చేయాలంటే ముందుగా ఫీల్డ్ ఆఫీసర్‌కు దరఖాస్తు చేస్తారు. ఆయన సమర్పించిన కాగితాలన్నీ సక్రమమైనవేనని భావిస్తే బ్రాంచి మేనేజర్‌కు రిఫర్ చేస్తారు. అక్కడి నుంచి చెకర్ అండ్ మేకర్ పద్ధతిలో ఆన్‌లైన్‌లో సంబంధిత పత్రాలను రీజనల్ ఆఫీసుకు పంపిస్తారు. అందులో ఓకే అయిన తర్వాత హార్డ్ కాపీని రీజనల్ ఆఫీసుకు సబ్మిట్ చేస్తారు. ఇక్కడ చీఫ్ మేనేజర్‌గా ఉన్న అధికారి మరోసారి పరిశీలించి సక్రమమనిపిస్తే రీజనల్ మేనేజర్ అప్రూవల్‌కు పంపుతారు. అయితే బజారుబ్రాంచిలో ఏడుకోట్ల రూపాయలు పైచిలుకు సొమ్ము రకరకాల పేర్లతో తినేస్తే ఎంతమంది పాత్ర ఉందో తెలుసుకోవాలని రీజనల్ ఆఫీసులో గురువారం సోదాలు చేశారు. ఆ సమయంలో చీఫ్ మేనేజర్‌గా ఉన్న శ్రీనివాసరావు జరిగిన విషయాన్ని సీఐడీ ముందు ఏకరువు పెట్టినట్టు తెలుస్తుంది. వాస్తవానికి రీజనల్ మేనేజర్ సంతకం పెట్టేముందు అన్నీ పరిశీలించాల్సింది తానేనని, కానీ శ్రీకర్ బ్రాంచి మేనేజర్ హోదాలో నిత్యం అప్పటి రీజనల్ మేనేజర్ టీఆర్‌ఎం రాజు ఛాంబర్‌లోనే రాత్రి 8 నుంచి 11 గంటల వరకు ఉండేవారని, నేరుగా ఈ రుణాలకు సంబంధించి ఆర్‌ఎంతోనే మాట్లాడుకోవడం వల్ల రాజు ఆదేశాల మేరకే తాను సంతకాలు పెట్టానని, అందులో ఎవరు ఎవరికి బినామీలో తనకు తెలియదని శ్రీనివాసరావు తేల్చేయడంతో కథ క్లైమాక్స్‌కు చేరిపోయింది. ప్రస్తుతం సీఐడీ అదుపులో శ్రీకర్ ఉండగా, దాదాపు అనధికారిక అదుపులో పాత ఆర్‌ఎం కూడా ఉన్నట్టే లెక్క. ఎందుకంటే ఇందుకు సంబంధించిన రికార్డు లెక్క తేల్చేందుకు టీఆర్‌ఎం రాజును కూడా సీఐడీ వెంట తిప్పుతోంది.
బ్యాంకుకు సంబంధం లేదు
గార బ్రాంచిలో తాకట్టు బంగారం మాయమైన కేసులో అప్పటి బ్రాంచి మేనేజర్ రాధాకృష్ణ, రీజనల్ మేనేజర్ టీఆర్‌ఎం రాజులు మేనేజ్‌మెంట్‌ను తప్పుదోవ పట్టించారని, దానికి వారే బాధ్యులని, బ్యాంకు యాజమాన్యానికి ఎటువంటి పూచీ లేదంటూ వీరిద్దరికీ తాజాగా ఎస్‌బీఐ ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేసిటనట్టు తెలుస్తుంది. ఈ వ్యవహారాలన్నింటిపైన మాట్లాడేందుకు ఎప్పటిలానే ఎస్‌బీఐ అధికారులు నిరాకరించారు. సీఐడీ విచారణ దగ్గర్నుంచి ఏ విషయం మీద ప్రశ్నించాలన్నా బ్యాంకు అధికారులు ఫోన్ ఎత్తడంలేదు. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు టీఆర్‌ఎం రాజు కొద్ది రోజుల క్రితం శ్రీకాకుళం డీఎస్పీ కార్యాలయానికి విచారణ నిమిత్తం వచ్చి నరసన్నపేట వెళ్లి నకిలీ రుణాలు ఎవరి పేరిట తీసుకున్నారో వారితో రాజీ కుదుర్చుకునేందుకు మాట్లాడినట్లు, అది బెడిసికొట్టడంతో సీఐడీ విచారణ వేగవంతం చేసినట్లు తెలుస్తుంది. ఇదే విషయం సీఐడీ అధికారులు టీఆర్‌ఎం రాజును ప్రశ్నిస్తే.. అసలు ఏం జరిగిందో తెలుసుకోడానికి వెళ్లినట్లు బుకాయించినట్లు బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. బజారు బ్రాంచిలో రూ.7.25 కోట్లు ప్రజల సొమ్ము అధికారులు తినేయడం వెనుక ఫీల్డ్ ఆఫీసర్ల పాత్ర కూడా ఉంది. ఇప్పుడు సీఐడీ అదుపులో వీరు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవైపు బజారు బ్రాంచి, మరోవైపు గార అంశం బ్యాంకు ప్రతిష్ఠను మసకబారుస్తుండటంతో మేనేజ్‌మెంట్ డ్యామేజ్ కంట్రోల్ పని మొదలుపెట్టింది. గార బ్రాంచిలో ఇంత పెద్ద కుంభకోణం జరిగినా, ఒక ప్రాణం పోయినా పట్టించుకోని మేనేజ్‌మెంట్ అక్కడి సిబ్బందిలో అధిక భాగాన్ని నరసన్నపేట ట్రాన్స్‌ఫర్ చేసింది. అక్కడ నకిలీ రుణాల కుంభకోణం వెలుగుచూసింది. గార బ్రాంచి మేనేజర్‌గా పని చేసిన రాధాకృష్ణ ఆ తర్వాత పలాస బ్రాంచి మేనేజర్‌గా బదిలీ అయ్యారు. అంటే చిన్న బ్రాంచి నుంచి పెద్ద బ్రాంచికి ప్రమోషన్ పొందినట్టు లెక్క. గార బంగారం నగలు మాయం వెనుక కేవలం ఒక్క పేరు చేర్చి, ఆమె ఆత్మహత్య చేసుకునేలా చేసి, ఆమె కుటుంబ సభ్యులను రిమాండ్‌కు పంపి, మిగిలిన అందర్నీ రక్షించి చేతులు దులుపుకొన్న టీఆర్‌ఎం రాజును ఇప్పుడు డీఎస్పీ వివేకానంద ఒక్కో ఆధారం చూపించి విచారిస్తున్నారు. ఇప్పుడు బజారు బ్రాంచిలో సీఐడీ ముందుగా అరెస్టు చేస్తుందా? గార బ్రాంచిలో శ్రీకాకుళం పోలీసులు ముందు అరెస్టు చేస్తారా? అనే దానిమీదే ఊహాగానాలు మొదలయ్యాయి.










Comments