మా బిడ్డను బతికించండి!
- DV RAMANA

- Oct 8, 2025
- 3 min read
నడక రాదు.. మాట లేదు.. నాలుగేళ్లయినా నిస్తేజమే!
పుట్టుకతోనే చిన్నారి నిహాల్‌కు జాండీస్
అది కాస్త ముదిరి చచ్చుబడిన నరాలు
ఎదుగుదల లేక మంచానికి పరిమితమైన బాలుడు
పరీక్షలెన్ని చేసినా లోపమేమిటో చెప్పలేకపోతున్న వైద్యులు
నిస్సహాయ స్థితిలో బేలగా పేద తల్లిదండ్రులు
ప్రభుత్వ, ప్రైవేటు సహాయం కోసం ఎదురుచూపులు

ఎప్పటిలాగే.. మొన్న సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్ జరుగుతోంది. జిల్లా నలుమూలల నుంచీ చాలామంది చేతిలో అర్జీలు పట్టుకుని జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులను కలిసేందుకు హాలులో నిరీక్షిస్తున్నారు. వారందరిలోనూ ఒక మహిళ చాలామంది దృష్టిని ఆకర్షించింది. ఆమె చేతిలో ఉన్న బిడ్డ దాదాపు అచేతనావస్థలో ఉండటం దానికి మించిన ఆందోళన, ఆసక్తి రేకెత్తించింది. అందరిలానే ఆమె కలెక్టర్‌ను కలిసింది. కష్టాలు చెప్పుకొని స్వగ్రామానికి వెళ్లిపోయింది. కానీ ఆమె చేతిలోని బిడ్డ ఉన్న స్థితిని గమనించిన ‘సత్యం’ ప్రతినిధి ఏం జరిగిందో.. బిడ్డ పరిస్థితి ఏమిటో.. తెలుసుకోవాలన్న వృత్తిపరమైన ఆసక్తితో ఆ కుటుంబ ఫోన్ నెంబర్ కనుక్కొని ఆరా తీస్తే.. అంతవరకు గుండెల్లో దాచుకున్న బాధను ఆ తల్లి ఒక్కసారిగా బయటకు వెళ్లగక్కింది. బిగపట్టుకున్న కన్నీళ్లను ఇక దిగమింగుకోలేక కన్నీటి ప్రవాహంతో పోటీ పడుతూ తన బిడ్డ దయనీయ స్థితి గురించి ఆమె వాక్ప్రవాహం బయటపెట్టింది. ఆప్పుడు తెలిసింది.. పుట్టుకతో ఆ బిడ్డ ఎదుర్కొంటున్న అంతుచిక్కని ఆనారోగ్య సమస్య.. దాని పర్యవసానంగా ఆ కుటుంబం పడుతున్న పాట్లు ఏమిటో!.. హృదయాలను మెలిపెట్టే వారి కన్నీటి గాధే.. ఈ కథనం.
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
సాధారణంగా ఎవరికైనా మగపిల్లాడు పుడితే ఇంటికి వారసుడొచ్చాడని ఆనందపడతారు. కానీ ఆ ఇంట్లో వారసుడు పుట్టినా.. ఆ ఆనందం వారిలో కనిపించడంలేదు. పైగా పుట్టెడు దు:ఖంతో ఏళ్ల తరబడి కుమిలిపోతున్నారు. ఏం చేయాలో తెలియక అల్లాడిపోతున్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం కనుగులవానిపేటకు చెందిన మోహనరావు, సోనియాలది పేద కుటుంబం. ఒక్క చిన్న ఇల్లు తప్ప వేరే ఏమీ ఆస్తిపాస్తులు లేవు. కాయకష్టమే జీవనాధారం. మోహనరావు రోజువారీ కూలీగా పని చేస్తుండగా.. సోనియా గృహిణి. ఆ దంపతులకు నాలుగేళ్ల క్రితం మగబిడ్డ నిహాల్ పుట్టాడు. పుట్టుకతోనే బిడ్డకు జాండీస్(పచ్చకామెర్లు) ఉండటంతో కొద్దిరోజులు డాకర్లు ట్రీట్‌మెంట్ ఇచ్చి రికవరీ అయ్యిందని చెప్పి పంపేశారు. పురిటి గుడ్లలో కాస్తో కూస్తో జాండీస్ ఉండటం ఈ రోజుల్లో కామన్ అని చెప్పడంతో తల్లిదండ్రులు కూడా పెద్దగా ఆందోళన చెందలేదు. కానీ దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో.. తమ బతుకులను ఎలా కుంగదీస్తుందో వారికి అనుభవపూర్వకంగా తెలిసి వచ్చింది. సుమారు రెండు నెలల వయసున్నప్పుడు నిహాల్‌కు ఫిట్స్ వచ్చాయి. అప్పటినుంచీ ఆ కుటుంబానికి కష్టాలు రెట్టింపయ్యాయి. బిడ్డను బతికించుకునేందుకు ఎక్కే గడప, దిగే గడప అన్నట్లు ఆస్పత్రులకు తిప్పుతున్నారు. మొదట శ్రీకాకుళం రిమ్స్‌కు, తర్వాత కిమ్స్‌కు, విజయహర్షకు.. అనంతరం వైజాగ్‌కు తీసుకెళ్లి చూపించారు. డాక్టర్లు చెప్పిన టెస్టులన్నీ చేయించారు. కానీ లోపమేమిటో తెలియలేదు. డాక్టర్లూ ఏమీ చెప్పలేక దాదాపు చేతులెత్తేశారు. వెనకాముందూ ఏమీ లేని ఆ తల్లిదండ్రులు కొడుకును దక్కించుకునేందుకు ఉన్న కొద్దిపాటి వస్తువులు తాకట్టు పెట్టి, చేబదుళ్ల రూపంలో అప్పులు చేసి సుమారు ఏడెనిమిది లక్షలు ఖర్చు చేసినా.. కుమారుడికి స్వస్థత చేకూరలేదు. కనీసం ఏమైందో కూడా తెలియకపోవడంతో వారు ఆర్థికంగానూ మానసికంగానూ కుంగిపోతున్నారు.
నిరంతరం నిస్తేజంగా బెడ్‌పైనే..
నిహాల్‌కు ఇప్పుడు నాలుగో యేడు నడుస్తోంది. కానీ పెద్ద ఎదుగుదల లేదు. నడక లేదు. మాట రాదు. ఇరవై నాలుగ్గంటలూ నిస్తేజమే ఆవహించి ఉంటుంది. కూర్చునే పరిస్థితి కూడా లేకపోవడంతో బెడ్‌పైనే పడుకోబెట్టి ఉంచుతున్నారు. నిత్యం ఎవరో ఒకరు చెంతనే ఉండాల్సి వస్తోంది. అన్నం వంటి ఘన ఆహారం కూడా తినే స్థితిలో లేకపోవడంతో పాలు, దాంతోపాటు అందులో బిస్కెట్ కలిపి తినిపిస్తే.. ఏదో కాస్త కడుపులోకి వెళుతోంది. మరోవైపు నిహాల్ నిరంతర గుక్కపెట్టి ఏడుస్తూనే ఉంటాడు. దీనివల్ల బిడ్డతోపాటు తల్లిదండ్రులకు రాత్రిళ్లు సరైన నిద్ర కూడా ఉండటం లేదు. ఫలితంగా బిడ్డతోపాటు తల్లిదండ్రులు కూడా శుష్కించిపోతున్నారు. చేతిలో చిల్లిగవ్వలేక.. ఇంక అప్పులు పుట్టే పరిస్థితి లేక ఆ తల్లిదండ్రులు ఎంత నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయారంటే.. ఇప్పటివరకు పిల్లాడికి చేయించిన వైద్య పరీక్షల రిపోర్టులన్నింటినీ చెత్తబుట్ట పాల్జేశారు. జిల్లా అధికారుల మీద, దేవుడి మీద భారం వేసి భారంగా కాలం గడుపుతున్నారు. కరువులో అధికమాసం అన్నట్లు.. ఇప్పటికే కష్టాల్లో ఉన్న ఆ కుటుంబాన్ని మరో సమస్య కూడా ఇబ్బంది పెడుతోంది. కూలి పనులు చేసి కుటుంబాన్న పోషించుకుంటున్న ఇంటిపెద్ద మోహనరావు కాలికి ఏదో కుట్టడంతో కాలు వాచిపోయి నడవలేని స్థితిలో ఉన్నాడు. దాదాపు రెండు నెలలుగా పనులకు వెళ్లలేక ఇంటి పట్టునే ఉంటున్నాడు. ఫలితంగా రోజువారీ ఆదాయం కూడా లేక ఆ కుటుంబం అల్లాడిపోతోంది.
కలెక్టర్ చొరవతో సదరం పరీక్షలు
చివరి ఆశగా సోమవారం గ్రీవెన్స్‌కు తన బిడ్డను తీసుకెళ్లిన సోనియా జిల్లా కలెక్టర్‌ను కలిసి తన గోడు విన్నవించుకుంది. ఎదుగుదల లేక మంచానికి పరిమితమైన తమ కుమారుడికి దివ్యాంగ ధ్రువీకరణ పత్రం మంజూరు చేయించడంతోపాటు, రూ.15 వేల నెలవారీ పింఛను ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అక్కడికక్కడే రిమ్స్ వైద్యాకారులతో ఫోనులో మాట్లాడారు. బిడ్డకు వైద్య పరీక్షలు జరిపి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. నెల రోజుల్లో వీలైనంత సహాయం చేస్తానని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. కలెక్టర్ సూచన మేరకు మంగళవారం రిమ్స్‌కు వెళ్లగా అక్కడ సదరం పరీక్షలు నిర్వహించారు. వారిచ్చే సర్టిఫికెట్ ఆధారంగా ప్రభుత్వ సహాయం అందే అవకాశం ఉందని ఆ కుటుంబం ఆశాభావంతో ఉంది. కాగా గ్రామీణ ప్రాంతానికి చెందిన ఈ కుటుంబం తమ కుమారుడి దుస్థితి చూసి తల్లడిల్లుతోందే తప్ప వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం పొందవచ్చన్నదానిపై అవగాహన లేనట్లు కనిపిస్తోంది. జిల్లా కలెక్టర్‌ను కలిసిన ఆ తల్లి సదరం ధ్రువపత్రం, పెన్షన్ ఇవ్వమని కోరడమే తప్ప కుమారుడికి ప్రభుత్వపరంగానే పూర్తిస్థాయి వైద్యచికిత్సలు చేయించి సంపూర్ణ ఆరోగ్యవంతుడిని చేయాలని కోరాలన్న ఆలోచన రాకపోవడం గమనార్హం. అలాగే వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకోవాలన్న అవగాహన కూడా లేదని వారి మాటలను బట్టి అర్థమవుతోంది. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్న ఈ కుటుంబానికి ఉదార హృదయులైన దాతలు కూడా స్పందించి తగిన చేయూతనివ్వాలని వారి తరఫున ‘సత్యం’ అభ్యర్థిస్తోంది. సహాయం చేయదలచినవారు సెల్ నెం. 6304263106లో ఆ తల్లిదండ్రులను సంప్రదించవచ్చు.










Comments