top of page

మిర్తిబట్టీ.. నీకో దండం పెట్టి!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Aug 29, 2025
  • 3 min read
  • ఆక్రమణలు తొలగించలేకపోతున్న అధికారులు

  • రూ.37.5 కోట్లతో కొత్త అంచనాలు

  • ఆత్మహత్య చేసుకున్న పాత కాంట్రాక్టర్‌

  • రెండు బిట్‌లుగా విడగొట్టినా ఫలితం శూన్యం

  • ముంపునకు మూలం అనధికార లేఅవుట్లే

  • ఇంకా బురదలోనే కాలనీలు

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)
నగరంలో మొన్న ఓ పద్ధతిలో వర్షం కురిసింది... వర్షం వెలిసిన వెంటనే సగం ప్రాంతంలో నీరు వెళ్లిపోయింది. కానీ నేటికీ కొన్నిచోట్ల నీరు నిల్వ ఉండిపోయింది. వాటిని మోటార్లు పెట్టి దగ్గర్లో ఉన్న కాలువలకు తోడుతున్నారు. ఈ దుస్థితికి కారణం ఏమిటో సమీక్షించే కథనమే ఇది.

ఒకరోజు వర్షానికే రోడ్లన్నీ జలమయం కావడానికి మిర్తిబట్టి పనులు పూర్తి కాకపోవడమే కారణమని ఇప్పటి వరకు పాలించిన నాయకులకు తెలిసినా, ఆ పనులు పూర్తిచేయడానికి మాత్రం ఏ ప్రభుత్వమూ పూర్తిస్థాయిలో ముందుకు రావడంలేదు. మొన్న కురిసిన వర్షానికి నగరంలో ఉన్న కాలువల నుంచి నీరు పల్లం వైపు ప్రవహించినా, కార్పొరేషన్‌కు ఆనుకొని ఉన్న పంచాయతీల్లోని కాలనీల్లో మాత్రం ఇప్పటికీ నీరు నిలిచేవుందంటే.. అందుకు కారణం మిర్తిబట్టీయేనని అందరికీ తెలుసు. కానీ ఆ పనులు మాత్రం ఇప్పటికీ పూర్తి చేయలేకపోతున్నారు. వాస్తవానికి నగరం ముంపునకు గురి కావడానికి మిర్తిబట్టితో పాటు రామిగెడ్డ కూడా ఒక కారణం. కానీ, మిర్తిబట్టీ మాత్రమే సర్వరోగ నివారిణి మాదిరిగా ఇప్పటి వరకు ఉన్న పాలకులు చూడటం వల్ల ఇది పెద్ద భూతంలా కనిపిస్తుంది. ప్రస్తుతం విలీన పంచాయతీలు అని చెప్పుకుంటున్న ప్రాంతాల్లో 40 సెంట్ల భూమి ఉంటే ఒక అనధికార లేఅవుట్‌ను వేసి, కనీసం ఎత్తు పల్లాలు, దిక్కులు కూడా చూడకుండా అప్పట్లో ఉన్న పంచాయతీ సర్పంచ్‌లకు రిజర్వ్‌ సైట్‌లు, సొమ్ము ముట్టజెప్పి పంచాయతీ అనుమతులు తెచ్చుకొని ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపట్టడం వల్ల ఆ తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వం కూడా కాలువను ఎటునుంచి ఎటు తిప్పాలో తెలియక తికమకపడుతున్నాయి. మిర్తిబట్టి, రామిగెడ్డ ఎగువ ప్రాంతంలోనే ప్రధాన కాలువకు అడ్డంగా నిర్మాణాలు చేపట్టడం వల్ల దారిపొడవునా అదే పద్ధతిని అందరూ పాటించారు. ఇప్పుడు వాటిని తొలగించలేక నగరంలో మురుగునీటిని మళ్లించలేక నానా తిప్పలూ పడుతున్నారు. చివరకు మిర్తిబట్టి పనులు కొంతమేరకు చేసి, ఆ తర్వాత బిల్లులు రాకపోవడంతో సాక్ష్యాత్తూ ఆ కాంట్రాక్టర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.

బలగ ఏసీబీ కార్యాలయం దగ్గర్నుంచి కలెక్టరాఫీస్‌ వద్దనున్న సాయిగిరి వరకు 7.5 కిలోమీటర్ల మేర మిర్తిబట్టి ఉంటుంది. ఈ బట్టిని గెడ్డగా అలా వదిలేసుంటే ఇప్పటికే అందుకు ప్రత్యామ్నాయం వచ్చివుండేది. అలా కాకుండా దీనికింద ఆయకట్టు లేదు కాబట్టి ఈ పంటకాలువను మురుగు కాలువగా మార్చి నగరంలో సగం నీటిని బయటకు తీసుకుపోవచ్చని భావించడమే పాలకులు, అధికారులు చేసిన పెద్ద తప్పు. 2017లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఏడీబీ నుంచి రూ.40 కోట్లు రుణం తెచ్చి మిర్తిబట్టి పనులకు శంకుస్థాపన చేశారు. ఇవి 2018లో ప్రారంభమయ్యాయి. 2019లో కొత్త ప్రభుత్వం వచ్చేనాటికి 10 శాతం పనులు సంబంధిత కాంట్రాక్టర్‌ పూర్తిచేశారు. జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే అంతకు ముందు ప్రభుత్వంలో చేపట్టిన పనుల్లో 25 శాతం లోపు పూర్తికాని వాటిని రద్దు చేయాలని జీవో ఇచ్చారు. దీంతో మిర్తిబట్టి పనులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. అప్పటికే నాలుగు కోట్ల రూపాయల మేరకు పనులు చేసిన కాంట్రాక్టర్‌కు రూపాయి కూడా చెల్లించలేదు. లండన్‌ నుంచి ఎన్‌ఆర్‌ఐగా ఆంధ్రాలో అడుగు పెట్టిన ఈ కాంట్రాక్టర్‌ అప్పటి ప్రభుత్వంలో ఇటువంటి పనులే ఓ పది వరకు చేపట్టి బిల్లులు రాక ఆత్మహత్య చేసుకున్నారు. అప్పట్నుంచీ మిర్తిగెడ్డ జోలికి ఎవరూ పోలేదు. మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తరచూ కురుస్తున్న వర్షాలకు నీరు నిల్వ ఉండిపోతుందని, మిర్తిబట్టి పనులు పూర్తయితే ఈ సమస్య తీరుతుందని ఎమ్మెల్యే శంకర్‌కు అధికారులు చెప్పడంతో, మళ్లీ పెరిగిన రేట్లతో అంచనాలు తయారుచేయించి రూ.37.5 కోట్లతో మిగిలిన పనులకు టెండర్లు పిలిచారు. కానీ, ఇంతవరకు ఈ టెండర్లు వేయడానికి ఒక్కరు కూడా రాలేదు. అసలు ఏసీబీ ఆఫీసు నుంచి సాయిగిరి వరకు మిర్తిబట్టి ఆక్రమణలు తొలగించాలంటే కుదిరే పని కాదని భావించిన అధికారులు ప్రస్తుతానికి ఎస్‌వీడీ హోటల్‌ వరకు కాలువను నిర్మించి, అక్కడికి వస్తున్న రామిగెడ్డతో దీన్ని లింక్‌ చేసి, వెట్‌వెల్‌కు కలపాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం ఈ వెట్‌వెల్‌ పనులు స్థానిక వాంబే కాలనీ వద్ద జరగాల్సివున్నా ఎప్పట్నుంచో నిలిచిపోయాయి. గతంలో నాగావళి నదిలో కలుషిత జలాల్ని విడిచిపెడుతున్నారని, దాన్నే పంపింగ్‌ చేసి రక్షిత మంచినీటిగా కార్పొరేషన్‌ సరఫరా చేస్తుందంటూ కొందరు పర్యావరణ ప్రేమికులు గ్రీన్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీంతో కార్పొరేషన్‌కు మొట్టికాయలు పడటంతో వెట్‌వెల్‌ నిర్మాణానికి పూనుకొన్నారు. ఇక్కడ వాటర్‌ ట్రీట్మెంట్‌ జరిగిన తర్వాత నాగావళిలో మురికినీటిని కలపాలి. అయితే ఈ పనులు కూడా అర్థాంతరంగానే నిలిచిపోయాయి. రెండు బిట్‌ల కింద మిర్తిబట్టి పనులను విభజించి మొదటిది ఎస్‌వీడీ హోటల్‌ వరకు, రెండో బిట్‌లో వెట్‌వెల్‌ వరకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇక్కడ చిక్కంతా మొదటి బిట్‌లోనే ఉంది. పీఎస్‌ఎన్‌ఎం హైస్కూల్‌ మొదలుకొని ఎస్‌వీడీ హోటల్‌కు వెళ్లేవరకు ఉన్న అనేక కాలనీలను దాటుకుని వెళ్లాల్సిన మిర్తిబట్టి ఎక్కడికక్కడ ఆక్రమణలతో నిండిపోయింది. బట్టిలో నీరు పారాలంటే కనీసం పాతిక భవనాలను తొలగించాలి. గొండు శంకర్‌ ఎమ్మెల్యే అయిన కొత్తలో కొన్ని కాలనీల్లో ఆక్రమణలను కొంతమేరకు తొలగించారు. ఆ తర్వాత రొటీన్‌గానే రాజకీయం అడ్డొచ్చింది. ఇదే పరిస్థితి రామిగెడ్డది కూడా. ఎప్పుడైతే విలీన పంచాయతీల్లో కాలువలు నిర్మించి, దాన్ని మిర్తిబట్టి, రామిగెడ్డకు అనుసంధానం చేయగలుగుతారో అప్పుడు మాత్రమే నగరం ముంపునకు దూరంగా ఉంటుంది. కానీ ఇది జరిగే పని కాదు. ఇప్పుడు ఈ పంచాయతీలు కార్పొరేషన్‌లో కలిసినా కూడా లేఅవుట్‌లు వేయడానికి అప్రూవల్స్‌ అన్నీ పాత డేట్లలో పంచాయతీలే ఇస్తుండటం గమనార్హం. ఇక్కడ రోడ్డు కోసం, కాలువ కోసం ఓ పద్ధతి మేరకు స్థలాన్ని విడిచిపెట్టలేదు. ఒక కాలనీలో బట్టీకి కనెక్టివిటీగా కాలువ నిర్మించాలంటే ఎన్ని మలుపులు తిరగాలో ఎవరికీ తెలియదు. ఎటువైపు వాటం ఉందో కూడా చెప్పడం ఏ ఇంజినీర్‌కూ సాధ్యంకాదు. ఒక్కో ఇల్లూ ఒక్కో ఎత్తులో ఉంది. దీనికి ఆనుకొని రోడ్డు వేయాలంటే ఎన్ని అప్‌ అండ్‌ డౌన్‌లు చూడాలో తెలియదు. ఆ తర్వాతే కాలువలు. ఇంతా చేస్తే ఇది బట్టీల వరకు నీరు తెస్తుందన్న గ్యారెంటీ లేదు. వాస్తవానికి శ్రీకాకుళం నగరం మొత్తాన్ని మూడు భాగాలుగా విభజించి, నాగావళిలో మురుగునీటిని కలుపుతున్నారు. ఇందులో మిర్తిబట్టి, రామిగెడ్డ రెండు వరుసల్లో ఉంటే, మరొకటి ఎప్పుడో నిర్మించిన మున్సిపల్‌ కాలువలు. ఇవి సూర్యమహల్‌ దగ్గర్నుంచి నగరంలో అన్ని ప్రాంతాలనూ కలుపుకొని నాగావళిలో కలుస్తున్నాయి. వీటికి కూడా కెపాసిటీ ఇప్పుడు తగ్గిపోయింది. ఒకప్పుడు తక్కువ గృహ సముదాయాలు ఉన్నప్పుడు ఈ కాలువలు సరిపోయేవి. కానీ ఇప్పుడంతా పెరిగింది కాబట్టి కాలువలను కూడా వెడల్పు చేయాల్సిన పరిస్థితి ఉంది. గతంలో వీటన్నిటికీ శాశ్వత పరిష్కారంగా అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీని నిర్మించాలని మంత్రిగా ఉన్నప్పుడు ధర్మాన ప్రసాదరావు ఓ కన్సల్టెన్సీని నగరానికి రప్పించారు. సుదీర్ఘ పరిశోధనల తర్వాత వీరు చేతులెత్తేసి వెళ్లిపోయారు. అటు పంచాయతీలు, ఇటు నగరంలో ఎటువైపూ వాటం సరిగా లేదని, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మిస్తే సగం ఊరు రోడ్డు లెవల్‌ కంటే పూర్తిగా కిందకు దిగిపోతుందని వీరు తేల్చేశారు. దీంతో ఈ ప్రతిపాదన ఆగిపోయి, మళ్లీ మిర్తిబట్టి, రామిగెడ్డ వైపే అధికారులు చూడటం మొదలుపెట్టారు. అయితే ఈ పనులు చేయడానికి మాత్రం ఎవరూ ముందుకు రావడంలేదు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే గొండు శంకర్‌ మున్సిపల్‌ శాఖామంత్రి నారాయణ దృష్టికి ఆమధ్య తీసుకువెళ్లారు. దీంతో ఆయన వందల కోట్లు విలువైన రాజధాని అమరావతి పనులు చేస్తున్న ఒక కాంట్రాక్టర్‌కు శ్రీకాకుళంలో మిర్తిబట్టి పనులు చేపట్టాలని ఆదేశించారు. బహుశా ఈ అసెంబ్లీ సమావేశాల సమయంలో బట్టీ పనులు పట్టాలెక్కొచ్చు.


Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page