top of page

మీరు దోచుకోండి.. మేం చూసుకుంటాం!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Oct 24, 2025
  • 2 min read
  • లంచం డిమాండ్‌ కేసులో సీడీపీవోను వెనకేసుకొస్తున్న అధికారులు

  • ఫిర్యాదును వెనక్కు తీసుకోవాలంటూ బాధితుడిపై ఒత్తిడి

  • సమస్య పరిష్కారమైందంటూ జేసీకి తప్పుదోవ

  • బదిలీతో సరిపెట్టడానికి బేరం

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ఎచ్చెర్ల, జి.సిగడాం మండలాల్లో ఉన్న 116 అంగన్వాడీ కేంద్రాలకు బాలామృతం ప్యాకెట్లను సరఫరా చేసే రవాణా కాంట్రాక్టర్‌ పైడి వెంకటరమణ రూ.40వేలు ఇవ్వకపోతే 14 నెలల రవాణా ఛార్జి (ఎరియర్‌) రూ.2.75 లక్షలు ఇవ్వమని ఫోన్‌లో బెదిరించిన కేసులో నిందితులను తప్పించడానికి ఐసీడీఎస్‌ అధికారులు తప్పు మీద తప్పు చేసుకుపోతున్నారు. స్వయంగా దీనికి బాసైన జేసీనే తప్పుదోవ పట్టిస్తున్నారు.

రూ.40వేలు లంచం డిమాండ్‌ చేసినట్టు ఆడియో రికార్డింగ్‌ ద్వారా దొరికిపోయిన కాంట్రాక్ట్‌ ఉద్యోగి, ఎచ్చెర్ల సీడీపీవో డోల పాపినాయుడును, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి కంప్యూటర్‌ ఆపరేటర్‌ శ్రీనివాసరావును ఐసీడీఎస్‌ పీడీ కార్యాలయ అధికారులు కాపాడే ప్రయత్నం మరింత బలోపేతం చేశారు. ఇద్దరిని విధుల నుంచి తొలగించాలని నెల రోజుల క్రితం జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఆదేశాలు జారీచేసినా ఐసీడీఎస్‌ పీడీ విచారణ పేరుతో కాలయాపన చేస్తూ వచ్చారు. విచారణలో బాధితుడు పైడి వెంకటరమణ తనపై ఇచ్చిన ఫిర్యాదు వాస్తవమేనని అంగీకరించాల్సి వచ్చింది. ఎందుకంటే.. ఆడియో రికార్డింగ్‌ స్పష్టంగా ఈ విషయాన్ని పట్టించింది. పాపినాయుడు, శ్రీనివాసరావులు సంజాయిషీ ఇచ్చిన తర్వాత బాధితుడు వెంకటరమణపై రాజకీయంగా ఒత్తిడి తీసుకువచ్చి ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని స్వయంగా ఐసీడీఎస్‌ అధికారులే కోరినట్లు ఆరోపణలున్నాయి. ఫిర్యాదు వెనక్కి తీసుకుంటే కొంత నగదు ఇస్తామని ఆశ చూపించారని కూడా భోగట్టా. అయినా ఫిర్యాదుదారుడు వెనక్కి తగ్గలేదు. దీంతో ఫిర్యాదును నీరుగార్చేందుకు ఐసీడీఎస్‌ పీడీ కార్యాలయం అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పుడు బాధితుడే ఉద్దేశపూర్వకంగా ఫిర్యాదు చేశాడని ఎదురుదాడి ప్రారంభించారట. ఈ వ్యవహారం నుంచి సీడీపీవో పాపినాయుడు, కంప్యూటర్‌ ఆపరేటర్‌ శ్రీనివాసరావులను తప్పించడానికి రూ.50వేలు బేరం కుదిరినట్లు చెప్పుకుంటున్నారు. వీరిద్దరినీ కాశీబుగ్గకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు సిద్ధం చేశారని, బేరం కుదిరిందనడానికి ఇదే నిదర్శనమని కార్యాలయం బయట గుసగుసలు వినిపిస్తున్నాయి.

పాపినాయుడు ఆమదాలవలసలో పనిచేస్తూ డబ్బులు డిమాండ్‌ చేసినట్టు విచారణలో తేలడంతో 2012లో సస్పెండయ్యారు. పనిష్మెంట్‌ కింద జిల్లా కార్యాలయంలో విధులు అప్పగించారు. మళ్లీ 2014లో సస్పెండయ్యారు. సుమారు ఏడేళ్లు విధులకు హాజరు కాలేదు. ఆతర్వాత వైకాపా హయాంలో తిరిగి సీడీపీవోగా 2023లో విధుల్లో చేరారు. ఇప్పుడు కూడా ఆధారాలన్నీ సస్పెన్షన్‌ వైపే వేలెత్తి చూపిస్తున్నా అధికారులు మాత్రం ఆయన్ని రక్షించే పనిలో భాగంగా బదిలీ చేయాలని దస్త్రాలు సిద్ధం చేశారట. విషయం తెలుసుకున్న బాధితుడు వెంకటరమణ ఐసీడీఎస్‌ కార్యాలయంను సంప్రదించగా గ్రీవెన్స్‌లో ఇచ్చిన ఫిర్యాదు పరిష్కారం అయిపోయిందని పేర్కొంటూ తామిచ్చే ఎండార్స్‌మెంట్‌ మీద సంతకం చేయాలని ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తుంది. ఇందుకు వెంకటరమణ అంగీకరించకపోవడంతో గ్రీవెన్స్‌ ఎండార్స్‌మెంట్‌ను పొందూరు మండలం మద్దిలపేటలోని బాధితుడు ఇంటికి రిజిస్టర్‌ పోస్టు ద్వారా పంపించి సమస్యకు పరిష్కారం చూపించినట్టు తెలిపి ఫిర్యాదును క్లోజ్‌ చేశారు. సమస్యను పరిష్కరించకుండా బాధ్యులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారని బాధితుడు జేసీని కలిసి ఫిర్యాదు చేయాలని ప్రయత్నించినా వీలుకాలేదు. బాధితుడు జేసీని కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుసుకున్న ఐసీడీఎస్‌ పీడీ కార్యాలయం అధికారులు బాధితుడ్ని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకుందామని పిలిచినట్టు తెలిసింది. దీనికి బాధితుడు వెంకటరమణ నిరాకరించడంతో బాధ్యులిద్దరీని బదిలీ చేస్తే సరిపోతుందని జేసికి విన్నవించడానికి ఐసీడీఎస్‌ కార్యాలయం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page