top of page

మీరెలాగైనా పొండి... మా ఉద్యోగాలు కాపాడండి!!

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • Sep 29, 2025
  • 2 min read
  • బార్లలో వైన్‌షాపు లిక్కర్‌ అమ్ముకోవచ్చట

  • ఎమ్మార్పీ ఎంత పెంచినా ఫర్వాలేదనే సంకేతాలు

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

రాష్ట్రంలో కొత్త బార్లకు దరఖాస్తులు పడకపోవడంతో ప్రస్తుతం వైన్‌షాపులు నడుపుతున్న లైసెన్సీలకే ఏదో ఒకటి చేసి బార్లు నెలకొల్పాలని ఎక్సైజ్‌ శాఖ ఒత్తిడి తెస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అప్పటికీ ఎవరూ ముందుకు రాకపోవడంతో బార్లు ఏర్పాటు చేసేవారిపై ఎక్సైజ్‌ అధికారులు వరాల జల్లు కురిపిస్తున్నారు. ఏ నిబంధనల వలన బార్‌కు టెండర్‌ వేస్తే నష్టపోతామని భావిస్తున్నారో వాటినే కాలరాసుకోవచ్చని అభయం ఇస్తున్నారు. వైన్‌షాపులకు ఎమ్మార్పీ కంటే తక్కువకు ప్రభుత్వం మద్యం సరఫరా చేస్తోంది. అదే బార్లకు అయితే ఎమ్మార్పీకే అమ్ముతుంది. అయితే ఇప్పుడు కొత్తగా బార్‌ ఏర్పాటు చేసుకుని అప్పటికే ఉన్న వైన్‌షాప్‌లో ఉన్న స్టాకును బార్లులో అమ్ముకోమని ఎక్సైజ్‌ అధికారులు సలహా ఇస్తున్నారు. అయినా రాష్ట్రంలో 880 బార్లకు గానూ 450లోపు బార్లే ఖరారయ్యాయి. శ్రీకాకుళం నగరం విషయానికి వస్తే 12 బార్లకు గానూ 7 బార్లకు ఎలాగోలా టెండర్లు వేయించగలిగారు. మొదటిదశలో ఒక్క అప్లికేషన్‌ కూడా రాకపోవడంతో తమ ఉద్యోగాలో పోతాయని ఇప్పటికే రెండు సిండికేట్లకు నాయకులుగా ఉన్న జీవీ కృష్ణ, అలుగుబిల్లి నాగభూషణంలతో ఐదు బార్లకు టెండర్లు వేయించి ఓకే చేశారు. బార్ల వలన తీవ్రంగా నష్టపోతామని వీరు ఈ ప్రక్రియకు దూరంగా ఉన్నా అనేక ఏళ్లుగా వీరు మద్యం వ్యాపారం చేస్తుండడం వలన ఎక్సైజ్‌ అధికారులతో ఉన్న మొహమాటాలకు ఐదు బార్లు దక్కించుకున్నారు. ఎలాగోలా మరో ఇద్దరికి ఒప్పించి మరో రెండు బార్లు ఓపెన్‌ చేయించగలిగారు. ఇంకా ఐదు బార్లకు నగరంలో టెండర్లు పడాలి. కానీ ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో ప్రస్తుతం ఉన్న వైన్‌షాపులు సక్రమంగా నడవాలంటే బార్లకు టెండర్లు వేయాల్సిందేనని ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నారట. మీరు ఎలా పోయినా మాకు అనవసరం.. మా ఉద్యోగాలు మాత్రం కాపాడాల్సిన బాధ్యత వైన్‌షాపుల లైసెన్స్‌ల మీదే ఉందని ఒత్తిడి తెస్తున్నారని భోగట్టా. మిగిలిన ఐదు బార్లు తెరుచుకోవడం కోసం లిక్కర్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బార్లు ఏం చేసినా పట్టించుకోమని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. లూజ్‌ అమ్మకాలు, వైన్‌షాపు నుంచి తెచ్చి బార్‌కౌంటర్‌లో అమ్మడం, బెల్ట్‌షాపులకు సరఫరా చేసుకోవడం వంటి వెసులుబాట్లు ఇస్తున్నారట. ఇలాగైనా మిగిలిన ఐదు షాపులు తెరిపించాలని, లేదంటే తమ ఉద్యోగాలు పోతాయని ఎక్సైజ్‌ అధికారులు గగ్గోలు పెడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కొత్త మద్యం షాపులు ప్రారంభమై ఏడాది పూర్తవడంతో నిబంధనల మేరకు పది శాతం లైసెన్స్‌ ఫీజు పెరిగింది. దీనిని చెల్లించేందుకు కూడా వైన్‌షాప్‌ యాజమాన్యాల వద్ద సొమ్ములు లేవు. ఇదే సమయంలో దసరా మామూళ్లంటూ ఎక్సైజ్‌ శాఖ హడావుడి చేస్తోంది. లిక్కర్‌ వ్యాపారంతో పాత పరిచయాలు లేని కొందరు గుడ్‌విల్‌ పేరిట షాపులు కొనేసి ఇప్పుడు రెన్యువల్‌ ఫీజు కూడా కట్టలేక నానా తిప్పలు పడుతున్నారు. అయినా దసరా మామూళ్లు ఇవ్వాల్సిందేనని ఎక్సైజ్‌ ఉద్యోగులు షాపుల చుట్టూ తిరగడం విడ్డూరం. వైన్‌షాపులే లాభదాయకంగా లేవని జిల్లాలో ఎక్కువ మంది వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. జిల్లా కేం ద్రానికి దూరంగా కొన్నిచోట్ల నకిలీ లిక్కర్‌ అమ్మకాలు జరుగుతున్నా హెడ్‌క్వార్టర్‌లో మాత్రం కొందరు మాత్ర మే కల్తీలకు తెర లేపారు. మిగిలినవారు ఇలా చేయ లేకపోవడంతో ప్రభుత్వం ఇస్తున్న మార్జిన్‌ చాలక ఎంత వేగం ఈ టర్మ్‌ పూర్తవుతుందా అని చూస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page