మార్వాడీ గోబ్యాక్.. కొత్త తెలం‘గానం’!
- DV RAMANA

- Aug 18, 2025
- 2 min read

సాటి తెలుగువారినే ‘ఆంధ్రోళ్లు’ అని చిన్నచూపు చూడటం.. మా నిధులు, వనరులు దోచుకుంటూ మాపై పెత్తనం చెలాయిస్తున్న ఆంధ్రోళ్లు వెనక్కి వెళ్లిపోవాలని తెలంగాణవాసులు హటం చేయడం కొత్త కాదు. అదే చివరికి తెలుగువారి ఉమ్మడి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రెండుముక్కలవ్వడానికి కారణమైంది. అయినా ఇప్పటికీ తెలంగాణలో సెటిలైన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారిని అక్కడి ప్రజలతోపాటు రాజ కీయ నాయకులు వేరుగా చూస్తుంటారు.. పరుష వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇప్పుడు వారు మరో నినాదం అందుకున్నారు. అదే ‘మార్వాడీ గో బ్యాక్’. ప్రస్తుతం ఆ రాష్ట్రమంతటా ఇదే ట్రెండిరగులో ఉంది. వ్యాపా రాల పేరుతో ఇక్కడికి వచ్చి తమ జీవనోపాధి, వ్యాపారావకాశాలను తన్నుకుపోతున్నారని.. అందుకే మార్వాడీలు తెలంగాణ నుంచి వెళ్లిపోవాలని నినదిస్తుండటంతో అదో ఉద్యమంగా మారుతోంది. తాజా గా అది రాజకీయ రంగు కూడా పులుముకుంటోంది. పార్కింగ్ విషయంలో వివాదం నేపథ్యంలో ఓ యువకుడిపై మార్వాడీలు దాడి చేయటం.. గోరేటి రమేష్ అనే వ్యక్తి మార్వాడీల వ్యాపార ఆధిపత్యాన్ని, దోపిడీని విమర్శిస్తూ రూపొందించి, పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారి మార్వాడీలకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. అయితే మార్వాడీ గో బ్యాక్ అని హెచ్చరించడం తప్పుడు చర్య అని చెప్పాలి. పరిపాలన, భాషాపరంగా రాష్ట్రాలు ఏర్పడిన.. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు తమకు నచ్చిన, అను కూలంగా ఉన్న పట్టణాలు, ప్రాంతాల్లో నివసించే హక్కు కలిగి ఉన్నారు. దానికి విరుద్ధంగా రాజస్తాన్ నుంచి దశాబ్దాల క్రితమే తరలివచ్చి వ్యాపారాలు చేసుకుంటూ నివసిస్తున్న వారిని పరాయి ప్రజలుగా పరిగణించడం, వెళ్లిపొమ్మని చెప్పడం ఏమాత్రం సమంజసం కాదు. తెలంగాణలో మార్వాడీల ఉనికి ఇప్పటిది కాదు. నిజాం కాలం నుంచే వారు తెలంగాణలో స్థిరపడి వ్యాపార రంగంలో రాణించడం మొదలుపెట్టారు. రాజస్థాన్‌లోని మార్వార్ ప్రాంతం.. అంటే జోధ్‌పూర్, బికనీర్, జైసల్మేర్, బార్మర్ వంటి ఎడారి చుట్టుపక్కల ప్రాంతాల్లో వీరు నివసిస్తుంటారు. మారు (థార్ ఎడారి ప్రాంతం), వాడి (నివాసం).. రెండు పదాల కలయికతో మార్వాడీ అనే పదం వచ్చింది. వీరు నివసించే ప్రాంతమంతా ఎడారి భూము లే కావడంతో వ్యవసాయం ఉండదు. దాంతో వారంతా ప్రధానంగా వ్యాపారంపై దృష్టి పెట్టారు. 16వ శతాబ్దంలో మొఘల్ పాలన కాలంలో రాజస్తాన్, గుజరాత్ నుంచి దేశవ్యాప్తంగా వలసలు వెళ్లి వ్యాపా రాలను విస్తరించారు. బ్రిటీష్ హయాంలో వారికే ఆర్థిక సేవలు అందించటంతో పాటు దూర ప్రాంతా లకు డబ్బు బదిలీ చేసే వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇదే ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థకు బాటలు వేసింది. ఇక తెలంగాణ విషయానికొస్తే.. నిజాం కాలంలోనే హైదరాబాద్ ప్రముఖ వాణిజ్య కేంద్రంగా మారడంతో మార్వాడీలు ఇక్కడికి వలస రావడం ప్రారంభించారు. బంగారం, వస్త్రాలు, కిరాణా, ఆయిల్ మిల్లు వంటి రంగాల్లో వ్యాపారాలు చేపట్టి ఆధిపత్యం సాధించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని బేగం బజార్, సుల్తాన్‌బజార్, కిషన్‌బాగ్.. ఆ చుట్టుపక్కల ప్రాంతాలను తమ వ్యాపార కేంద్రాలుగా మార్చుకున్నారు. 1948లో హైదరాబాద్ సంస్థానం స్వతంత్ర భారతదేశంలో విలీనమైన తర్వాత మార్వాడీలు తమ వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించారు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వంటి నగరాల్లో కూడా పాగా వేసి స్వీట్ షాపులు, పానీపూరీ స్టాల్స్, బంగారం దుకాణాలు, రియల్ ఎస్టేట్ వంటి వ్యాపారాలను స్థాపించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మార్వాడీల వ్యాపార ఆధిపత్యం వివాదాస్పదంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా వ్యాపారాల్లో ఎక్కువగా మార్వాడీలే ఉంటున్నారని, స్థానికు లకు అవకాశం లేకుండా చేస్తున్నారని తెలంగాణవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్వాడీ వ్యాపారులు తక్కువ ధరలకు అమ్మకాలు చేస్తుండటం వల్ల స్థానిక స్థానిక వ్యాపారులకు గిరాకీ తగ్గుతోం దని ఆరోపిస్తున్నారు. వాచ్‌మెన్ దగ్గర నుంచి సర్వెంట్ల వరకు అన్ని ఉద్యోగాలను రాజస్తాన్ నుంచే తమ బంధువులను, తెలిసినవారిని రప్పించి నియమిస్తున్నారన్న మరో ఆరోపణ ఉంది. దీనివల్ల స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించడంలేదని అంటున్నారు. ఇలాగే కొనసాగితే తమ మనుగడ కష్ట మని ఆందోళన నుంచి మార్వాడీ గోబ్యాక్ అన్న నినాదం పుట్టుకొచ్చింది. మార్వాడీలను లక్ష్యంగా చేసు కోవడం రాజ్యాంగ హక్కును హరించడమేనని బీజేపీ, కాంగ్రెస్ నేతలు అంటున్నారు. బీఆర్‌ఎస్ మాత్రం దీనిపై ఇప్పటివరకు స్పందించలేదు. మార్వాడీ వ్యతిరేక ఉద్యమం గతంలో చెన్నైలోనూ మొదలైనా కొద్ది కాలానికే సద్దుమణిగింది. మరీ తెలంగాణలో ఏమవుతుందో?










Comments