top of page

మూలపేట.. ప్రగతికి ‘రాచబాట’

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Jul 15, 2025
  • 2 min read
  • కోస్టల్‌ హైవే మంజూరు చేసిన కేంద్రం

  • మూలపేట-భీమిలి మధ్య 200 కి.మీ. నిర్మాణం

  • సీ పోర్టుకు, ఎయిర్‌పోర్టుకు పెరగనున్న కనెక్టివిటీ

  • ఆక్వా, టూరిజం రంగాల అభివృద్ధికి ఊతం

  • ఆర్థికంగా ఎదగనున్న శ్రీకాకుళం జిల్లా

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటిగా.. రాష్ట్రానికి ఈ చివరన ఉంటూ అభివృద్ధికి ఆమడదూరంలో మగ్గిపోతున్న శ్రీకాకుళం జిల్లా దశ తిరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆలస్యమైనా పారిశ్రామికాభివృద్ధికి రాచబాట పడుతున్న శుభ సంకేతాలు వెలువడ్డాయి. తాజాగా రాష్ట్రానికి మరో జాతీయ రహదారిని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం, దాన్ని శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట నుంచి విశాఖ జిల్లా భీమిలి వరకు ఆరు లైన్లుగా నిర్మించనుండటం జిల్లాకు నిజంగా శుభ సంకేతమే. ఇటు పర్యావరణ పరిరక్షణ, అటు తీరప్రాంత అభివృద్ధి, పర్యాటకాభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి అనే బహుళ ప్రయోజనాలే లక్ష్యంగా ఈ గ్రీన్‌ఫీల్డ్‌ కోస్టల్‌ హైవేను రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంజూరు చేసింది. ఇప్పటికే జిల్లా మీదుగా 16వ నెంబరు జాతీయ రహదారి వెళుతోంది. దానికి సమాంతరం తీరప్రాంతాలను అనుసంధానం చేస్తూ ఈ కొత్త జాతీయ రహదారిని 200 కిలోమీటర్ల నిడివిన నిర్మించనున్నారు. జిల్లాలోని సంతబొమ్మాళి మండలం మూలపేటలో ప్రస్తుతం పోర్టు నిర్మాణం జరుగుతోంది. దీన్ని వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. అక్కడి నుంచి నేరుగా విశాఖ జిల్లా భీమిలి వరకు సాగర తీరం వెంబడి జాతీయ రహదారి నిర్మించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత మార్చిలో కేంద్ర రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి ప్రతిపాదనలు అందజేశారు. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం, విజయనగరం జిల్లా భోగాపురం, పూసపాటిరేగ మీదుగా భీమిలి వరకు దీన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. దీన్ని పరిశీలించిన కేంద్ర ఉపరితల రవాణా శాఖ పరిపాలన ఆమోదం మంజూరు చేసింది. దాంతో డీపీఆర్‌(డీటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు) తయారు చేసి కేంద్రానికి సమర్పించనున్నారు. ఈ రహదారి నిర్మాణం వల్ల ఉత్తరాంధ్ర మూడు ఉమ్మడి జిల్లాలకు ప్రయోజనం చేకూరుతుందని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.

అటు పోర్టు, ఇటు ఎయిర్‌పోర్టుతో అనుసంధానం

ఉత్తరాంధ్ర మీదుగా ఇప్పటికే చెన్నై-కోలకతా జాతీయ రహదారి(ఎన్‌హెచ్‌ 16) వెళుతోంది. దీన్ని అటు నిర్మాణంలో ఉన్న భోగాపురం ఎయిర్‌పోర్టుకు, ఇటు మూలపేట సీ పోర్టుకు అనుసంధానం చేసేలా లింకు రోడ్లు ఇప్పటికే నిర్మిస్తున్నారు. దాంతో ఆ రెండిరటికీ రోడ్డు కనెక్టివిటీ పెరుగుతుంది. అదే సమయంలో మూలపేట వద్ద నిర్మిస్తున్న నౌకాశ్రయం(పోర్టు) నుంచి భీమిలి వరకు తీరం వెంబడి మరో జాతీయ రహదారి నిర్మిస్తే మూడు జిల్లాల్లోని తీరప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి. ఎయిర్‌పోర్టు, సీ పోర్టు మధ్య నేరుగా కనెక్టివిటీ కూడా ఏర్పడుతుంది. దానికితోడు ఇప్పటికే విశాఖ జిల్లాలో భీమిలి వరకు బీచ్‌ కారిడార్‌ పేరుతో తీరప్రాంత రహదారి నిర్మిస్తున్నారు. ఇప్పుడు భీమలి`మూలపేట మధ్య కోస్టల్‌ హైవే నిర్మిస్తే ఆ రెండూ అనుసంధానమవుతాయి. దీని నిర్మాణానికి రూ.8500 కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. డీపీఆర్‌ తయారీ బాధ్యతను ఎస్‌.ఏ.ఇన్‌ఫ్రాకు అప్పగించినట్లు తెలిసింది. దీనివల్ల మూడు జిల్లాల తీరప్రాంతాల్లో ఆక్వా పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందుతాయి. టూరిజం ప్రాజెక్టుల ఏర్పాటుకు అవకాశాలు పెరుగుతాయి. ఈ కోస్టల్‌ రహదారి వెంబడి ఎగుమతి, దిగుమతుల యూనిట్లు, ఇతర పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. ముఖ్యంగా మూలపేట పోర్టుకు అనుబంధంగా ఏర్పాటయ్యే పారిశ్రామిక క్లస్టర్‌కు ఈ రహదారి వల్ల చాలా ప్రయోజనం చేకూరుతుంది. రవాణా సౌకర్యాలు బాగా పెరగడం వల్ల పోర్టుకు అనుబంధంగా ఎగుమతి, దిగుమతుల కార్యకలాపాలు విస్తృతంగా ఏర్పాటవుతాయి. వీటివల్ల జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు పెరిగి ఏళ్లతరబడి కొనసాగుతున్న వలసల సంస్కృతికి చరమగీతం పాడినట్లు అవుతుంది. జిల్లా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది.

కేంద్రమంత్రి రాము చొరవ

కోస్టల్‌ హైవే మంజూరు విషయంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు కూడా చొరవ తీసుకుని విశేష కృషి చేశారు. కేంద్ర కేబినెట్‌లో పౌర విమానయాన శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన తన పరిధిలోనే ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాన్ని శరవేగంగా పూర్తికానిచ్చేందుకు ఇప్పటికే తీవ్రంగా కృషి చేస్తున్నారు. దానికితోడు తన సొంత జిల్లా, సొంత పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో నిర్మిస్తున్న మూలపేట సీ పోర్టు నిర్మాణం విషయంలోనూ అదే చొరవ చూపిస్తున్నారు. ఈ రెండిరటితోపాటు, తీరప్రాంతాలను అనుసంధానం చేసేలా ప్రతిపాదించిన కోస్టల్‌ హైవే మంజూరుకు కూడా ప్రత్యేక చొరవ తీసుకుని విజయం సాధించారు. ఇప్పుడు దీని సాకారం చేయాల్సిన బాధ్యత కూడా ఆయనపైనే ఉంటుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page