top of page

మావోయిస్టు హిడ్మా హతం

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 4d
  • 3 min read
  • ఆయన భార్య హేమ అలియాస్‌ రాజే సైతం మృతి

  • వారితోపాటు మరో నలుగురి మరణం

  • మారేడుమిల్లి టైగర్‌ జోన్‌లో తెల్లవారుజామున ఎన్‌కౌంటర్‌

  • ధ్రువీకరించిన ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా

  • ఉద్యమం అంతు చూస్తున్న ఆపరేషన్‌ కగార్‌

ree
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

మావోయిస్టు పార్టీ మరో అగ్రనేతను కోల్పోయింది. వరుస ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లు, అరెస్టులతో ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడిన ఆ పార్టీకి మిగిలిన అతికొద్దిమంది అగ్రనేతల్లో ఒకరైన మాడ్వి హిడ్మా అలియాస్‌ సంతోష్‌ మంగళవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. మన రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో హిడ్మా, ఆయన భార్య హేమ సహా ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ విషయాన్ని రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా కూడా ధ్రువీకరించారు. మారేడుమిలి అటవీ ప్రాంతంలోకి మావోయిస్టు దళం కదలికిలు ఉన్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం సాయుధ బలాగాలు ఆ అడవుల్లో గాలింపు తీవ్రతరం చేశాయి. అదే తరుణంలో గాలింపు దళాలకు మావోయిస్టుల బృందం తారసపడిరది. పోలీసులను చూసిన వెంటనే మావోయిస్టులు కాల్పులు ప్రారంభించడంతో పోలీసులు కూడా ఎదురుదాడికి దిగారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని, ఇప్పటికే ఈ ఘటనలో ఆరుగురు మరణించగా వారిలో ఒకరిద్దరు అగ్రనేతలు ఉండవచ్చని పోలీసులు తొలుత ప్రకటించారు. ఆ అగ్రనేతలను మాడ్వి హిడ్మా, ఆయన భార్య హేమగా గుర్తించినట్లు డీజీపీ గుప్తా ప్రకటించారు. హిడ్మా తలపై రూ.కోటి రివార్డు ఉండగా, హేమ తలపై రూ.50 లక్షల రివార్డు ఉంది. ఉదయం ఆరుగంటల ప్రాంతంలో మారేడుమిల్లి లోతట్టు ప్రాంతమైన టైగర్‌ జోన్‌లో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. మిగతా మృతులను ఇంకా గుర్తించాల్సి ఉంది.

షెల్టర్‌ కోసం వచ్చి హతం

మావోయిస్టుల పార్టీని నామరూపాల్లేకుండా చేసి వచ్చే ఏడాది మార్చి నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మించాలన్న లక్ష్యంతో కేంద్ర హోంశాఖ చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌ కారణంగా మావోయిస్టులుగా కొన్నాళ్లుగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీ క్రమంగా పలుచబడిపోతోంది. పార్టీ ప్రధాన నంబాళ్ల కేశవరావుతో పాటు చలపతి, చంద్రన్న, సుధాకర్‌, గాజర్ల రవి, మోడం బాలక్రిష్ణ, కట్టా రామచంద్రారెడ్డి, కాదరి సత్యనారాయణ తదితర అగ్రనేతలు ఎన్‌కౌంటర్లలో హతమయ్యారు. మరోవైపు అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్‌ అలియాస్‌ అభయ్‌, తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్‌ ఆశన్నతో పాటు వందల మంది దళ సభ్యులు అజ్ఞాతం వీడి జనారణ్యంలోకి వచ్చేశారు. ఆపరేషన్‌ కగార్‌ పేరుతో కేంద్ర, రాష్ట్రాల సాయుధ బలగాలు చుట్టుముట్టి అడవులను జల్లెడ పడుతుండటంతో గత 22 నెలల్లో సుమారు 2100 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ సరిహద్దుల్లోని దండకారణ్యం, అబూజ్‌మడ్‌ వంటి దుర్గమారణ్య ప్రాంతాల్లో ఉన్న మావోయిస్టు స్థావరాలను ధ్వంసం చేస్తుండటంతో సురక్షితంగా ఉండే షెల్టర్‌ జోన్లను వెతుక్కుంటూ మావోయిస్టులు ఏపీ, తెలంగాణ సరిహద్దు అడవుల్లోకి ప్రవేశిస్తున్నారు. కాగా పార్టీ అత్యున్నత నాయకుల్లో సిద్ధాంతకర్త ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతి, పార్టీ ప్రస్తుత ప్రధాన కార్యదర్శిగా భావిస్తున్న తిప్పరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ, జార్ఖండ్‌కు చెందిన నేత మిసిర్‌ బేస్రా అలియాస్‌ భాస్కర్‌, పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ మాడ్వి హిడ్మా అలియాస్‌ హిడ్మన్న అలియాస్‌ సంతోష్‌ మాత్రమే మిగిలారని అంటున్నారు. వృద్ధాప్యంలో ఉన్న గణపతితోపాటు మిగిలిన ఇద్దరిని, పీఎల్‌జీఏ బెటాలియన్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత హిడ్మాపై పడిరది. దాంతో ఆయన షెల్టర్‌ కోసం తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టలు ప్రాంతానికి వెళ్లినట్లు కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. కానీ అటునుంచి మళ్లీ ఇటు వచ్చారో లేక కర్రెగుట్టలుకు కాకుండా నేరుగా ఇటే వచ్చారో తెలియదుగానీ మారేడుమిల్లి టైగర్‌ జోన్‌లో హిడ్మా దళం కదలికలను సాయుధ పోలీసు బలగాలు కొనుగొనగలగడంతో హిడ్మా చరిత్ర ముగిసిపోయింది.

హిడ్మాయే ప్రధాన టార్గెట్‌

మిగిలిన నలుగురు అగ్రనేతలతోపాటు పీఎల్‌జీఏ దళాన్ని అంతమొందిస్తేనే ఆపరేషన్‌ కగార్‌ పరిపూర్ణమవుతుందని ఇటీవలే కేంద్ర హోంశాఖ వర్గాలు ప్రకటించాయి. అందులోనూ నాయకత్వంలో అత్యంత చురుగ్గా ఉన్న హిడ్మా పట్టుకుంటే మిగతావారిని లొంగదీసుకోవడం పెద్దకష్టం కాదని అంటూ వచ్చారు. దానికోసం గాలింపు తీవ్రతరం చేశారు. భద్రతా బలగాలకు మోస్‌ వాంటెడ్‌గా ఉన్న మాడ్వి హిడ్మా ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందినవాడు. 1981లో జన్మించిన హిడ్మా పదో తరగతి వరకు చదువుకున్నాడు. సుమారు 50 ఏళ్ల వయసుండే ఆయన పాతికేళ్ల క్రితమే 2000 సంవత్సరంలో అడవిబాట పట్టి.. ఆయుధం చేపట్టి అజ్ఞాతంలో ఉంటూ మావోయిస్టు కార్యకలాపాల్లో అత్యంత క్రియాశీలంగా వ్యవహరించాడు. హిందీ, గోండు, కోయ, తెలుగు, బెంగాలీ భాషల్లో ప్రవేశం ఉన్న ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. గెరిల్లా దాడుల వ్యూహ నిపుణుడిగా పేరొందిన ఆయన ఎన్నోసార్లు ఎన్‌కౌంటర్ల నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. అలాగే 26కుపైగా విధ్వంసక దాడులకు పాల్పడ్డాడు. 2017లో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేసి 25 మంది మృతికి కారణమయ్యాడు. 2010లో దంతెవాడలో 76 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్ల మరణానికి కారణమైన చింతల్‌నార్‌ దాడి మొదలు మహేంద్ర కర్మ సహా పలువురు కాంగ్రెస్‌ నేతలను, పెద్ద సంఖ్యలో పోలీసులను పొట్టన పెట్టుకున్న జీరంఘాటీ ఆంబుష్‌ వంటి పలు భారీ దాడులకు నేతృత్వం వహించింది హిడ్మాయేనని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌ బీజేపీ ఎమ్మెల్యే మాండలే హత్యకేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) హిడ్మాపై ఛార్జిషీటు కూడా దాఖలు చేసింది. ఇక హిడ్మా భార్య షీలామరండి అలియాస్‌ హేమలత అలియాస్‌ రాజే అలియాస్‌ రాజక్క కూడా చాలా కాలంగా మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించింది. సెంట్రల్‌ కమిటీ సభ్యురాలిగా అనేక కీలక నిర్ణయాల్లో భాగస్వామ్యం వహించింది. హిడ్మాతో కలిసి అనేక దాడుల్లో పాల్గొంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page