top of page

మేం వేసిందే రోడ్డు.. చెప్పొద్దు అడ్డు!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Jun 23, 2025
  • 2 min read
  • ఆదుకున్నవారే అలుసయ్యారు

  • ఆమదాలవలస-శ్రీకాకుళం రోడ్డు కంట్రాక్టర్‌ తీరుపై విమర్శలు

  • పెండింగ్ బిల్లులు క్లియర్‌ చేయించిన ఎమ్మెల్యేలు

  • పనులు జరగాలన్న లక్ష్యంగా సొంత డబ్బు కూడా సమర్పణ

  • వారినే ఖాతరు చేయని, ప్రమాణాలు పాటించని నిర్మాణ సంస్థ

  • విడ్డూరంగా ముందు రోడ్డు పనులు.. తీరిగ్గా ఇప్పుడు కల్వర్టులు నిర్మాణం

ఈ ఫొటోలు చూడండి.. రూ.40 కోట్ల సెంట్రల్‌ రోడ్‌ ఫండ్‌ నిధులతో శ్రీకాకుళం డే అండ్‌ నైట్‌ జంక్షన్‌ నుంచి ఆమదాలవలస బ్రిడ్జి వరకు పది కిలోమీటర్ల మేర జరుగుతున్న 80 అడుగుల రోడ్డు నిర్మాణ దృశ్యాలివి.

ఇంకా సూటిగా చెప్పాలంటే శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ పుట్టినరోజు సందర్భంగా ‘సత్యం టీవీ శ్రీకాకుళం’ చేసిన ఇంటర్వ్యూలో ఆయన తీవ్ర అసంతృప్తి ప్రకటించిన రోడ్డు నిర్మాణం ఇదే.

ఈ పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌కు గత ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదనే సానుభూతిని అటు ఆమదాలవలస ఎమ్మెల్యే, ఇటు శ్రీకాకుళం ఎమ్మెల్యే చూపిస్తుంటే.. దాన్నే సదరు కాంట్రాక్టర్‌ అలుసుగా తీసుకున్నట్టు కనిపిస్తోంది.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ఈ రోడ్డు వెడల్పు పనులకు 2023లోనే టెండర్ల ప్రక్రియ పూర్తయినా ఇంతవరకు నిర్మాణం పూర్తికాలేదు. ఈ పాపాన్ని గత ప్రభుత్వం మీదకు ఇన్నాళ్లూ నెట్టేశారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌, అటు ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌లు చెరో చెయ్యి వేసినా కూడా ఈ పనులు అనుకున్న రీతిలో సాగడంలేదు. 2023 నుంచి 2025 మధ్యలోకి వచ్చేసినా ఇప్పటికీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఈ రోడ్డుకు సంబంధించి నగర పరిధిలో ఉన్న భాగం విస్తరణ పూర్తయ్యే నాటికి మరో ఏడాది పట్టేట్టుంది. వాస్తవానికి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఈ రోడ్డును అందుబాటులోకి తెస్తామని ఇద్దరు ఎమ్మెల్యేలు మాటిచ్చారు. అయితే అప్పటి వరకు జరిగిన పనులకు బిల్లులు చెల్లించలేదు కాబట్టి తాము ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేమని సంబంధిత భవానీ కన్‌స్ట్రక్షన్స్‌ చేతులెత్తేసింది. దీంతో పెండిరగ్‌ బిల్లుల ఫైల్‌ పట్టుకుని ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ఒకవైపు, గొండు శంకర్‌ మరోవైపు అమరావతికి షటిల్‌ సర్వీస్‌ చేసి రూ.15 కోట్లు విడుదలయ్యేటట్లు చేశారు. అయినా రోడ్డు పనులు ముందుకు కదలకపోవడంతో రోడ్డు రోలర్లు, హాట్‌మిక్సర్లు, పొక్లెయిన్లు, జేసీబీలు తిరగడానికి వీలుగా ఎమ్మెల్యే గొండు శంకర్‌ తన ఖాతాలో డీజిల్‌ ఇప్పించారు. కూన రవికుమార్‌ అయితే అప్పు చేసి మరీ రోడ్డు పనులు చేయడానికి కాంట్రాక్టర్‌కు డబ్బు సర్దుబాటు చేశారు. అయినా కూడా పనులు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి.

  • నాసిరకంగా నాణ్యత

ఇప్పటి వరకు జరిగిన పనులైనా నాణ్యంగా ఉన్నాయా? అంటే.. అదీ లేదు. పాత రోడ్డుకు ఇరువైపులా 80 అడుగుల మేర వెడల్పు చేస్తున్నప్పుడు పాత రోడ్డుకు ప్యాచ్‌వర్క్‌, కొత్తరోడ్డుకు బ్లాక్‌ టాప్‌ వేయాల్సి ఉంది. ఈ రెండూ కలిసే చోట ఎత్తుపల్లాలు లేకుండా కొత్తగా ఒక లేయర్‌ వేయాలి. కానీ పాత, కొత్త రోడ్డు కలిసిన చోట ఎగుడుదిగుడులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక ప్రొఫెషనల్‌ కాంట్రాక్ట్‌ సంస్థ చేపడుతున్న పనులుగా ఏమాత్రం కనిపించడంలేదు. గత కొన్నాళ్లుగా శ్రీకాకుళం రూరల్‌ మండలం రాయిపాడు వద్ద కల్వర్టును నిర్మిస్తున్నారు. ఇది ఎప్పుడు పూర్తవుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. దీంతో నిత్యం ట్రాఫిక్‌ సమస్యలు ఎదురవుతున్నాయి. డబ్బులిచ్చి మరీ ఎమ్మెల్యేలు జనంతో తిట్టించుకుంటున్నారు. ఈ కల్వర్టు పనులు చూస్తుంటే ప్రజాప్రతినిధుల మీద బిల్లుల చెల్లింపునకు ఒత్తిడి తేవడం కోసమే ఆలస్యం చేస్తున్నట్టు కనిపిస్తోంది. బాక్స్‌ కల్వర్టు పద్ధతిలో నిర్మిస్తున్న దీన్ని త్వరితగతిన పూర్తిచేయాల్సి ఉన్నా కాంట్రాక్టర్‌ అటువైపు దృష్టి సారించడంలేదు. బహుశా రాష్ట్రంలో ఎక్కడా ఇటువంటి పనులు జరిగి ఉండవు. సాధారణంగా ఒక రోడ్డు వెడల్పు చేసేటప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న స్ట్రక్చర్లు అంటే.. కల్వర్టులు, ఖానాలు, బ్రిడ్జిల పనులు ముందు పూర్తిచేసి, ఆ తర్వాత రోడ్డు వేస్తారు. కానీ ఇక్కడ మాత్రం రోడ్డు వేసేసిన తర్వాత స్ట్రక్చర్‌ వర్క్‌ చేస్తున్నారు. అలా అని ఈ పనులు చేపడుతున్న సంస్థ చిన్నదేమీ కాదు. అనుభవం లేనిది అంతకంటే కాదు. కానీ ఇలా ఎందుకు చేస్తున్నారనే దానిపై అందరికీ సందేహాలున్నాయి. ఇప్పటి వరకు రూ.15 కోట్ల పెండిరగ్‌ బిల్లులు ప్రభుత్వం చెల్లించినట్టు భోగట్టా. ఇంకో రూ.8 కోట్ల పనులు ఇటీవల జరిగాయి. అయితే మొత్తం పనుల్లో ఎక్కడా నాణ్యత మాత్రం కనిపించడంలేదు. శ్రీకాకుళం డే అండ్‌ నైట్‌ జంక్షన్‌ నుంచి ఆమదాలవలస బ్రిడ్జి వరకు రోడ్డు మొత్తం అందుబాటులోకి వచ్చే సమయానికి ఆమదాలవలస వైపు ఇప్పటికే నిర్మించిన రోడ్డు మెయింటెనెన్స్‌కు వచ్చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. గతంలో ఈ పనుల కోసం ఎన్‌ఎన్‌ఆర్‌, జీఆర్‌ వంటి సంస్థలు బిడ్డింగ్‌కు వచ్చినా, ఆ తర్వాత వెనక్కు వెళ్లిపోయాయి. ఎవరూ దిక్కు లేకపోతే తాము చేస్తున్నాం కాబట్టి మేం వేసిందే రోడ్డు అన్న చందంగా సంబంధిత కాంట్రాక్టర్‌ వ్యవహరించడంపై ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు.


Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page