top of page

మాంసాహారంలో మనది వెనుకంజే!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Nov 10, 2025
  • 2 min read

‘ముక్క లేనిదే ముద్ద దిగదు’.. మాంసాహార ప్రియుల విషయంలో ఈ నానుడి మనదేశంలో బాగా వాడుకలో ఉంది. కొందరికి రోజులో మూడుపూటలూ, మరికొందరికి రోజుకొక్కసారైనా ముక్క లేకపోతే తిండి సహించదు. ఈ ట్రెండ్‌ చూసి ప్రపంచంలో మనదేశంలోనే మాంసాహార వినియోగం అధికంగా ఉందని అనుకోవచ్చు. కానీ వాస్తవం కాదు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో మాంసం సంప్రదాయ ఆహారంలో ఓ ప్రధాన భాగంగా ఉంటూ వస్తోంది. ఇదే విషయాన్ని ‘స్టాటిస్టా రీసెర్చ్‌ డిపార్ట్‌మెంట్‌’ అనే సంస్థ రూపొందించిన సర్వే నివేదికలో పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో)కు ఇచ్చిన ఈ రిపోర్ట్‌లో పలు కీలక విషయాలు వెల్లడిరచారు. ఈ నివేదిక ప్రకారం ప్రపంచ జనాభాలో 91`92 శాతం ప్రజలు మాంసాహారం స్వీకరిస్తున్నారని తేలింది. అయితే చేపలు, రొయ్యలు, కోడి, మేక, గొర్రె వంటి మాంసాలతోపాటు బీఫ్‌ వంటి రకాలను కూడా చాలామంది వినియోగిస్తున్నారు. అత్యధిక జనాభా కలిగిన భారతదేశంలో నాన్‌వెజ్‌ వినియోగం చాలా ఎక్కువగా ఉండవచ్చని అనుకోవచ్చు. కానీ ఆ అభిప్రాయం తప్పని, ప్రపంచంలో అత్యధిక మాంసం వినియోగించే టాప్‌`10 దేశాల్లో భారత్‌ లేకపోవడం బట్టే అర్థమవుతుంది. స్టాటిస్టా`2024 నివేదిక ప్రకారం తొలి పది దేశాలను పరిశీలిస్తే.. మాంసాహార వినియోగంలో హాంకాంగ్‌ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. ఈ చిన్న దేశంలో ప్రతి వ్యక్తి ఏడాదికి సగటున 170 కిలోలకు పైగా మాంసం తీసుకుంటారు. బీఫ్‌, పోర్క్‌, చికెన్‌, సీఫుడ్‌ వంటకాలు హాంకాంగ్‌ ప్రజల రోజువారీ ఆహారంలో కచ్చితంగా ఉండాల్సిందే. దాని తర్వాత మంచు దేశమైన ఐస్లాండ్‌ నిలుస్తుంది. ఇక్కడి శీతల వాతావరణం కారణంగా ప్రోటీన్ల అవసరం ఎక్కువగా ఉండటంతో అవి పుష్కలంగా లభించే మాంసం పదర్థాలు ఇక్కడి ప్రజల ఆహారంలో ప్రధాన భాగంగా మారాయి. గొర్రె మాంసం, చేపలు, చికెన్‌ వంటి వంటకాలు ఎక్కువగా ఆస్వాదిస్తారు. మరో చిన్నదేశం మకావో మాంసాహార వినియోగంలో తృతీయ స్థానంలో ఉంది. ఈ దేశ ప్రజలు చికెన్‌ సంబంధిత వంటకాలతోపాటు పంది మాంసంతో చేసే రకరకాల డిషెస్‌ను అమితంగా ఇష్టపడతారు. ఈ జాబితాలో లిథువేనియా నాలుగోస్థానంలో నిలిచింది. ఈ దేశ ప్రజల్లో దాదాపు 96 శాతం మంది రోజూ మాంసాహారం తీసుకుంటారని నివేదికలో పేర్కొన్నారు. పోర్క్‌, బీఫ్‌, చికెన్‌ వంటివి వీరి రోజువారీ భోజనంలో భాగంగా ఎంటాయి. ఐదో స్థానంలో నిలిచిన అర్జెంటీనా ప్రజలు గో మాంసాన్ని అత్యధికంగా వినియోగిస్తారు. ప్రతి వ్యక్తి ఏడాదికి సగటున 110 కిలోలకుపైగా మాంసం తీసుకుంటారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఆరో స్థానంలో ఉంది. ఇక్కడి ప్రజలు బీఫ్‌, లాంబ్‌, చికెన్‌, ఫిష్‌ వంటి మాంసాహారం విస్తృతంగా వినియోగిస్తారు. అధిక ఆదాయం, జీవనశైలి కారణంగా ఇక్కడ మాంసం ప్రధాన ఆహారంగా ఉంది. మాంసాహార వినియోగంలో న్యూజీలాండ్‌ ఏడో స్థానంలో ఉంది. పశువుల పెంపకం, వ్యవసాయం ప్రధాన వృత్తులుగా ఉండటం దీనికి ఒక కారణం కావచ్చని అంటున్నారు. మటన్‌, బీఫ్‌, ఫిష్‌లతో చేసే వంటకాలను ఈ దేశ ప్రజలు ఇష్టపడతారు. ప్రపంచంలో అగ్రదేశంగా ఉన్న అమెరికా మంసాహార దేశాల జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉంది. మాంసాహారం లేకుండా ఇక్కడి ప్రజలకు రోజు గడవదు. బర్గర్లు, స్టేక్స్‌, బేకన్‌ వంటి రకరకాల వంటకాల్లో మాంసం వినియోగించడం అమెరికా ఆహార సంస్కృతిలో అంతర్భాగమైంది. ఈ దేశంలో వ్యక్తి సగటున ఏడాదికి 110 కిలోలకు పైగా మాంసం తింటారు. యూరోపియన్‌ దేశాల్లో స్పెయిన్‌ కూడా మాంసాహార వినియోగంలో ప్రపంచ స్థాయిలో తొమ్మిదో స్థానంలో ఉంది. పోర్క్‌, చికెన్‌, సీఫుడ్‌ వంటకాలంటే స్పానిష్‌ ప్రజలకు ప్రాణం. ఈ విషయంలో ఇజ్రాయెల్‌ పదో స్థానంలో ఉంది. ఈ దేశంలో జాతీయ సంప్రదాయ వంటకాలతో పాటు నాన్‌వెజ్‌ ఆహారం విస్తృతంగా వినియోగిస్తారు. చికెన్‌, టర్కీ, బీఫ్‌ వంటకాలు ఆ దేశ ప్రజల్లో ప్రాచుర్యం పొందాయి. నాన్‌వెజ్‌ ఊసెత్తితే చాలు లొట్టలు వేసే మనదేశంలో మాంసాహారం చాలా ఎక్కుగా ఉన్నట్లు కనిపించినా వాస్తవ పరిస్థితి అలా లేదు. ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో మాంసాహార వినియోగం తక్కువేనని చెప్పాలి. మతపరమైన, సాంస్కృతిక, ఆర్థిక అంశాలు దీనికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. అనేక మతాల సమ్మేళనమైన మన దేశంలో జనాభాతోపాటు భిన్నమతాలు, వాటి సంప్రదాయాలు మాంసాహార వినియోగంపై ప్రభావం చూపుతున్నాయి. ప్రధాన మతంగా ఉన్న హిందూ సంప్రదాయాలతోపాటు జైన మతం, బౌద్ధమతం వంటి పలు మతాలు శాకాహారానికి ప్రాధాన్యత ఇస్తాయి. ఫలితంగా మనదేశంలో మాంసాహార వినియోగం తక్కువగానే ఉంటోంది. భారతీయులు ఎక్కువగా ఇష్టపడే చికెన్‌, మటన్‌, చేపల ధరలు బాగా పెరిగిపోవడం కూడా వినియోగంపై ప్రభావం చూపుతోంది. అంత పెద్ద ధరలు పెట్టి కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత లేని గ్రామీణ, పట్టణ ప్రాంత పేదలు వారానికో నెలకో ఒకసారి లేదా పండుగలు, ఫంక్షన్ల సమయాల్లో మాత్రమే నాన్‌వెజ్‌ వినియోగిస్తున్నారు. దీని వల్ల మన దేశంలో దాదాపు 60 శాతం మంది మాత్రమే మాంసం తింటారు. మిగిలిన వారు పూర్తిగా శాకాహారం లేదా వీగన్‌ జీవనశైలి పాటిస్తున్నారు. దక్షిణాదిలో కేరళ, తూర్పు, ఈశాన్య రాష్ట్రాలైన పశ్చిమబెంగాల్‌, నాగాలాండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లలో నాన్‌వెజ్‌ వినియోగం చాలా ఎక్కువగా ఉంది. ఆఫ్రికా, దక్షిణాసియా, డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో, బంగ్లాదేశ్‌లలో కూడా ధరలు, ఆర్థిక పరిస్థితులు, సాంస్కృతికి కారణాల వల్ల మాంసాహార వినియోగం చాలా తక్కువగా ఉన్నట్లు స్టాటిస్తా నివేదిక అంచనా వేసింది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page