మట్టిరోడ్లతో మహాయాతన
- BAGADI NARAYANARAO
- May 23
- 1 min read

సప్త గ్రామాల సుదీర్ఘకాల సమస్య
2017లో పక్కారోడ్డుకు శంకుస్థాపన
ఇప్పటికీ నిర్మాణానికి నోచుకోని వైనం
ఉద్యమాలకు సిద్ధమవుతున్న స్థానికులు
(సత్యంన్యూస్, ఇచ్చాపురం)
సాధారణంగా ఎక్కడైనా రోడ్డు ఉన్నంతకాలం ఆ సౌకర్యం ఆ ప్రాంతవాసులకు అందుబాటులో ఉన్నట్లే. కానీ ఆ ఏడు గ్రామాల పరిస్థితి దీనికి విరుద్ధం. వారికి ఏడాదిలో ఆరు నెలలు రోడ్డు అందుబాటులో ఉంటే.. మిగతా ఆరు నెలలు పొలాల గట్లే శరణ్యం. ఈ విచిత్రమైన సమస్యను కంచిలి మండలం జలంత్రకోట పంచాయతీ పరిధిలో ఉన్న ఆరు గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం సమీపిస్తుందంటేనే వారు హడలిపోతున్నారు. ఈ గ్రామాలకు ఉన్న మట్టి రోడ్లపై వర్షాకాలంలో వాహనాలతో రాకపోకలు సాగించలేక అష్టకష్టాలు పడుతున్నారు. కనీసం నడిచి వెళ్లడానికి కూడా ఇబ్బంది పడాల్సి ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామాల చుట్టూ ఉన్న పంట పొలాల మధ్యలో వేసిన ఈ మట్టిరోడ్లు వర్షాకాలంలో నీటిలో మునిగిపోయే ఉంటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో రుతుపవనాలు గాడి తప్పి.. జూన్ నుంచి దాదాపు డిసెంబర్ వరకు వర్షాలు పడుతుండటం చూస్తున్నాం. దాంతో ఈ ఆరు నెలలూ బురద, నీటితో నిండిపోయే మట్టిరోడ్లపై నరకం చూస్తున్నామంటున్నారు. వృద్ధులు, గర్భిణులు, విద్యార్ధులు, కూలీలు, రోగులు సమీప పట్టణ ప్రాంతాలకు వెళ్లడానికి అష్టకష్టాలు పడాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు. జూన్ మొదటి వారంలోగా ఈ సమస్యకు పరిష్కారం చూపించకపోతే రాజకీయాలకు అతీతంగా నిరహార దీక్షలు చేపట్టి నేషనల్ హైవేపై రాస్తారోకో చేస్తామని జలంత్రకోట పంచాయతీ ప్రజలు హెచ్చరిస్తున్నారు.
2017లో శంకుస్థాపన జరిగినా..
ఈ గ్రామాలకు పక్కారోడ్డు నిర్మాణానికి టీడీపీ హయాంలో ఎమ్మెల్యే శంకుస్థాపన చేసినా, నేటికీ అది కార్యరూపం దాల్చలేదు. వైకాపా హయాంలోనూ పట్టించుకోలేదు. పంచాయతీకి వచ్చే ఆర్ధిక సంఘం నిధులు వెచ్చించి ప్రతి ఏటా మరమ్మతులు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదయినా మార్పు లేదంటున్నారు. పల్లె పండగలో రోడ్డు దశ మారుతుందని ఆశించినా ప్రతిపాదనలు కూడా పంపకుండా నిర్లక్ష్యం చేశారు. జలంత్రకోట పంచాయతీ హెడ్ క్వార్టర్ నుంచి మిగతా ఆరు గ్రామాలు మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి. జె.మాణిక్యపురం, చోట్రాయిపురం, పోటిగుడ్డి, ఉప్పరిపేట, చిలకలమెట్ట, మధుపురం గ్రామాలుగా రూపొందిన నాటి నుంచి రవాణా సౌకర్యం కొరవడిరది. 2024 ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే టీడీపీ నుంచే గెలిచారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గంలో మొట్టమొదట కొబ్బరికాయ కొట్టి ఇక్కడ నుంచే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చి ఏడాది పూర్తి అయింది. అయినా ఇప్పటి వరకు ఆ హామీకి అతీగతీ లేదని గ్రామస్తులు విమర్శలు గుప్పిస్తున్నారు.
Comments