top of page

మణి విప్పిన కంఠంలో ఎవరున్నారు?

  • Writer: SATYAM DAILY
    SATYAM DAILY
  • 2 days ago
  • 3 min read
  • రేపు పోలీసు విచారణకు వెళ్లనున్న ఈవో

  • విక్రమ్ ప్రింటర్స్‌లో అనుమతుల మేరకే ముద్రణ

  • కలర్ జిరాక్స్ మెషిన్లు విప్పిన నకిలీ పాస్‌ల గుట్టు

  • డేటా రిట్రీవ్ చేస్తున్న పోలీసులు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

వెయ్యి గొడ్లు తిన్న రాబందు ఒక్క గాలివానకు రాలిపోతుందనే సామెత ఉంది. ఇన్నాళ్లూ టూటౌన్ పోలీస్‌స్టేషన్ వెనుకే ఉంటూ ఎన్నో సర్టిఫికెట్లకు, పుస్తకాలకు, చివరకు ఆధార్ కార్డులో కూడా ఫొటోలు, డేటాఫ్ బర్త్‌లు మార్చేసి డూప్లికేట్‌లు తయారుచేసి పబ్బం గడుపుకున్న మణికంఠ జిరాక్స్ వ్యవహారం ఇప్ప్పుడు అనేకమందిని స్టేషన్ల చుట్టూ తిప్పిస్తోంది. కొందరైతే ఏకంగా కాపాడండంటూ నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. వివరాల్లోకి వెళితే..

అరసవల్లి రథసప్తమి ఉత్సవాలకు సంబంధించి వేలాది నకిలీ వీఐపీ, వీవీఐపీ పాస్‌ల సష్టికర్తల్లో ఒకరైన మణికంఠ కలర్ ప్రింటింగ్ జిరాక్స్ నిర్వాహకులు తమ వీడియో స్టేట్‌మెంట్ ద్వారా పోలీసులకు ఏం చెప్పారు? ఎవరిపై చెప్పారనేదే ఈ కేసులో కీలకంగా మారింది. ప్రస్తుతం బయటే ఉన్న ఈ నిర్వాహకులు నాలుగు రోజుల క్రితం పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్ మేరకు జిల్లాలో రాజకీయ నాయకుల చుట్టూ కొందరు ప్రదక్షణలు చేసి పోలీసుల మీద ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఈ కేసు ప్రాధాన్యత పెరిగింది. రథసప్తమి ఏదో ఒక మాదిరిగా పూర్తయిపోయింది కాబట్టి మరి కేసుల జోలికి వెళ్లకుండా వదిలేస్తారో? లేదూ అంటే ప్రభుత్వం చివరి రోజు దర్శనాలు చేయించలేక అప్రదిష్టపాలైంది కాబట్టి ఈ కేసును ప్రతిష్టగా భావిస్తారో కాలమే నిర్ణయించాలి. కేవలం సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లే కాకుండా ఇంకెవరో దీని వెనుక ఉన్నారు. ఈ విషయం పోలీసులకు తెలుసు. కాకపోతే మీడియాతో మాట్లాడటంలేదు. ఏ ఒక్కరో దీని వెనుక ఉంటే ఇన్ని వేల పాస్‌లు అవసరంలేదు. అంతకు మించి ఇంకేదో జరిగింది. కేవలం మణికంఠ జిరాక్స్ యాజమాన్యం అమ్ముకోవాలనుకున్నా ఇంత పెద్ద మొత్తంలో పాస్‌లు ముద్రించలేరు. ఎందుకంటే.. ఇది ఓపెన్‌గా అమ్మవి కావు కాబట్టి, దీని వెనుక ఇంకేదో కుట్ర ఉంది. ఆదివారం రథసప్తమి కావడంతో జనాలు ఎలాగూ ఎక్కువ వస్తారని ముందుగానే అంచనా వేసే మాస్టర్ మైండ్ అందులో భాగంగా తన పరపతిని పెంచుకోడానికి, తన అనుంగులు చేయి దాటిపోకుండా ఉండటం కోసం పప్ప్పుబెల్లాల్లా దీన్ని పంచేసుంటారని, తద్వారా ప్రభుత్వ ప్రతిష్టను మంటగలిపే కుట్ర కూడా ఉండుంటుందని భావిస్తున్నారు.

రథసప్తమినాడు కనీస దర్శనాలు కాకపోవడానికి పోలీసుల వైఫý్యమే కారణమన్నట్లు మిగిలిన యంత్రాంగం ప్రచారం చేయడంతో ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఇందులో భాగంగానే నాలుగు రోజుల క్రితం టూటౌన్ పోలీస్‌స్టేషన్ వెనుక ఉన్న మణికంఠ మల్టీ కలర్‌ప్రింటింగ్ జెరాక్స్ సెంటర్ నిర్వాహకులను విచారించారు. వారు ఇచ్చిన వీడియో స్టేట్‌మెంటే ఇప్ప్పుడు కీలకమైంది. ఎందుకంటే.. నకిలీ పాస్‌లు సష్టించలేదని వీరు పోలీసులకు చెప్పలేదు. కలర్ జిరాక్స్‌లు తీశామని, కొత్త పాస్‌లు తయారుచేశామని, కాకపోతే ఒకరు చెప్పడం వల్లే ఇదంతా చేశామని స్టేట్‌మెంట్ ఇవ్వడం ఇప్ప్పుడు నగరంలో విస్తత చర్చకు దారితీసింది. ఆ ఒకరూ అనేది వ్యక్తా? సంస్థా? లేదూ అంటే రెండూ కలగలిసిన వ్యవస్థా అనేది తేలాల్సి ఉంది.

నాలుగు రోజుల క్రితం నగరంలోని పలువురు ప్రింటర్లు, కలర్ జెరాక్స్ సెంటర్ల నిర్వాహకులను విచారించారు. ఈ విచారణలో ప్రధానంగా మణికంఠ జెరాక్స్ యాజమాన్యం పాత్రే బయటపడింది. అయితే వీరి వద్ద ఎవరు ఇన్ని వీవీఐపీ పాస్‌లు ముద్రించారన్న దానిపై పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు.

వాస్తవానికి రథసప్తమికి సంబంధించి డ్యూటీ పాస్‌లు, మీడియా పాస్‌లు, పోలీస్ పాస్‌లు, వాహనాలకు సంబంధించిన ఎంట్రీ పాస్‌లు, వలంటీర్ల పాస్‌లు ముద్రించడానికి ముందుగా మణికంఠ జెరాక్స్ సెంటర్‌నే అరసవల్లి ఆలయ ఈవో తన వద్ద పని చేస్తున్న సిబ్బంది ద్వారా సంప్రదించారు. ఈమేరకు పోలీసులు ఆలయంలో పని చేస్తున్న నలుగుర్ని మణికంఠ జెరాక్స్ యాజమాన్యంతో ఏం మాట్లాడారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈవో చెప్పిన ధరకు తాము ప్రింట్ చేయలేమని మణికంఠ జెరాక్స్ యజమాన్యం చెప్పడంతో ఆ కాంట్రాక్ట్‌ను నగరంలోని విక్రమ్ ప్రింటర్స్‌కు ఇవ్వగా, వారు పాస్‌లు ముద్రించి ఈవోకు అప్పగించారు. లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం కలర్ ప్రింటింగ్ మిషన్‌లో ఏ రోజు ఎంత ప్రింట్ అయిందన్న డేటా ఒక్క బటన్ నొక్కితే తెలిసిపోతుంది. ఆ మేరకు విక్రమ్ ప్రింటర్స్‌లో అధిక పాస్‌లు ముద్రించలేదని తేలిపోయింది. అయితే విక్రమ్ ప్రింటర్స్‌లో వచ్చిన అంకె, ఈవో మంగళవారం పోలీసులకు చెప్పబోతున్న అంకె మధ్య తేడా ఉన్నదీ లేనిదీ తేలాల్సి ఉంది. మణికంఠ కలర్ జెరాక్స్‌కు పాస్‌లు ప్రింట్ చేసే కాంట్రాక్ట్ లేకపోయినా వేల సంఖ్యలో ఇక్కడ అసలు పాస్‌లకు కలర్ జెరాక్స్‌లు తీశారని, మరి కొన్నింటిని నేరుగా డీటీపీ చేసి కూడా ప్రింట్ తీశారని పోలీసులు గుర్తించారు. ఈమేరకు హార్డ్‌డిస్క్‌ను పరిశీలించారు. విచిత్రమేమిటంటే.. నగరంలో అనేక డీటీపీ సెంటర్లు, ప్రింటింగ్ ప్రెస్‌లలో ఉన్న కంప్యూటర్లలోని డేటాను వెలికితీయడానికి ఈ మణికంఠ జిరాక్స్‌కు చెందినవాడినే పోలీసులు అన్నిచోట్లకూ తిప్పి డేటా కలెక్ట్ చేశారు. ముఖ్యంగా మణికంఠ జిరాక్స్‌లోనే హార్డ్‌డిస్క్‌లో డేటా డిలీట్ చేయడంతో, దాన్ని రిస్టోర్ చేయించారు. అలాగే మిగిలినవారి దగ్గర్నుంచి రిస్టోర్ కోసం మణికంఠ జిరాక్స్ యాజమాన్యం ముగ్గురిలో ఒకర్ని పోలీసులు వాడుకున్నారు. టెక్నాలజీ పరంగా ఇటువంటి పనులు చేయడంలో మణికంఠ జిరాక్స్ ఆరితేరిపోయింది. ఇలాంటి ఇల్లీగల్ పనులకు ఎప్పట్నుంచో చాలామంది మద్దతు వీరికి ఉంది. డోనర్, వీఐపీ, వీవీఐపీ పాస్‌లను విజయవాడ గవర్నమెంట్ ప్రెస్‌లో ముద్రించారని భోగట్టా. కానీ అవి కూడా స్వామివారి హుండీలో పది పైసలు కూడా జీవితంలో ఎప్ప్పుడూ వేయని కొందరి చేతుల్లో నాలుగైదు కనిపించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అయితే రథసప్తమి రోజు ఏది అసలు? ఏది నకిలీ? అని గుర్తించే పరిస్థితి లేదు. దీంతో జనాన్ని కంట్రోల్ చేయలేక చేతులెత్తేశారు. ఇప్ప్పుడు విచారిస్తున్నకొద్దీ అనేక అంశాలు బయటపడుతున్నాయి. నగరంలో కలర్ జిరాక్స్ తీసే మిషిన్లు చాలా ఉన్నాయి. కానీ గూగుల్ రేటింగ్ మేరకు టాప్ పొజిషన్‌లో ఉన్న కొందర్ని మాత్రమే పోలీసులు విచారణకు పిలిచారు. వాస్తవానికి నరసన్నపేట, పాలకొండ వంటి ప్రాంతాల్లో కూడా కలర్ జిరాక్స్ మిషిన్లు ఉన్నాయి. నగరంలో పోలీసులు విచారణకు తీసుకువచ్చినవారు కాకుండా మరో పది మంది వరకు ఉన్నారు. అయినా వారిని విచారణకు పిలవలేదు. మణికంఠ కలర్ జిరాక్స్‌లో ఇటువంటి పనులు జరుగుతాయన్న విషయం పోలీసులకు కూడా తెలుసు. కాకపోతే ఈసారి రసాభసా కావడంతో దష్టి సారించాల్సి వచ్చింది. రథసప్తమి ముందురోజు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రొగ్రాం కోసం ఒక్క వీఐపీ పాస్ కావాలంటే తలకిందులుగా తపస్సు చేసినా దొరకలేదు. తీరా ప్రోగ్రామ్ దగ్గర మాత్రం వేలకొద్దీ వీఐపీలు కనిపించారు. టెక్కలి ఆర్డీవో కనుసన్నల్లో జరిగిన ఈ పంపిణీలో 1250 పాస్‌లు ముద్రించినట్టు లెక్క. కానీ అంతకు మూడింతలు వీఐపీ పాస్‌లతో ఈ కార్యక్రమానికి వచ్చారు. అయితే ఇది సినీ సంగీత విభావరి కాబట్టి, ఆ క్రేజ్ ఉంటుందని పోలీసులు లైట్‌గా తీసుకున్నారు. మరుసటి రోజు రథసప్తమికి కూడా నకిలీ పాస్‌ల ట్రెండ్ అలాగే కొనసాగడంతో దర్శనాలు సవ్యంగా జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి అందిన నివేదిక మేరకు రథసప్తమి రోజు ప్రభుత్వం విఫలమైందనే తేలింది. అందుకే ఎస్పీ దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. అయితే సూత్రధారులు, పాత్రధారులు జిల్లా కేంద్రంలో ఉన్నవారే కావడంతో రాజకీయ నాయకుల అండదండలతో తప్పించుకోవాలని చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆలయ ఈవోను మంగళవారం పోలీసులు విచారణకు రమ్మన్నట్టు భోగట్టా.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page