మన చమురు బిల్లుకు జనాభా మంట
- DV RAMANA

- Sep 27, 2025
- 2 min read

జనాభాపరంగా ఇప్పటికే చైనాను అధిగమించి భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా కొనసాగుతోంది. ఇప్పుడు ఈ అంశమే దేశంలోని మరో ప్రధాన రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జనాభా వృద్ధికి అనుగుణంగా దేశీయ ఇంధన రంగంలో పెరుగుదల చోటుచేసుకుంటోంది. దేశీయంగా క్రూడ్ ఉత్పత్తి జరుగుతున్నా అది మన దేశ అవసరాలను 20 శాతం కూడా తీర్చలేకపోతోంది. దాంతో దిగుమతులపైనే ప్రధానంగా ఆధారపడాల్సి వస్తోంది. అయితే రష్యా`ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ చమురు ఉత్పత్తిదారుల్లో ఒకటైన రష్యా నుంచి క్రూడ్ కొనుగోళ్లపై అమెరికా సహా నాటో దేశాలు ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షలను అధిగమించి తన చమురు అమ్మకాలు, ఆర్థిక లావాదేవీలు దెబ్బతినకుండా రష్యా డిస్కౌంట్లు ప్రకటించి మరీ క్రూడ్ అమ్మకాలు పెంచుకుంటోంది. ఇదే అవకాశంగా భారత్, చైనాతో సహా మరికొన్ని దేశాలు రష్యా నుంచి రాయితీ రేట్లకు చమురు కొనుగోలు చేస్తున్నాయి. దీనివల్ల చమురు కొరత తీరుతుందన్న ఆశలపై మనదేశంలో పెరుగుతున్న చమురు వినియోగం నీళ్లు చల్లుతోంది. దీనికి కారణం జనాభా పెరుగుదలేనని నిపుణులు చెబుతున్నారు. పరిస్థితి చూస్తుంటే ఈ ఏడాది భారతదేశంలో చమురు వినియోగం చైనాను మించిపోవచ్చని ట్రాఫిగురా గ్రూప్ అంచనా వేసింది. ఏపీపీఈసీ సమావేశంలో ఎస్ Ê పి గ్లోబల్ కమోడిటీ ఇన్‌సైట్స్ నిర్వహించిన కార్యక్రమంలో ట్రాఫిగురా చీఫ్ ఎకనామిస్ట్ సాద్ రహీమ్ మాట్లాడుతూ భారతదేశ చమురు డిమాండ్ వేగంగా పెరుగుతోందన్నారు. వ్యూహాత్మక నిల్వ(స్ట్రాటజిక్ రిజర్వ్స్)ను మినహాయిస్తేతే ఈ సంవత్సరం భారతదేశ చమురు డిమాండ్ చైనాను మించిపోతుందని పేర్కొన్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం దేశంలో చమురు వినియోగం పెరగడానికి ప్రధాన కారణం పెరుగుతున్న జనాభా, ఆదాయం పెరగడం, జీవన ప్రమాణాలు మెరుగుపడటం వంటివని చెప్పవచ్చు. జనాభాతోపాటే వాణిజ్య, ప్రైవేట్ వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దేశంలో ప్యాసింజర్ రవాణా, సరుకుల రవాణా, వ్యాపార కార్యకలాపాలు శరవేగంగా పెరుగుతున్నాయి. వీటన్నింటి వల్ల ఆయిల్ వినియోగం సుదీర్ఘ స్థాయిలో కూడా వృద్ధి చెందుతుందని నిపుణులు భావిస్తున్నారు. అదే సమయంలో చైనాలో ముడి చమురు వినియోగం నెమ్మదిగా పెరుగుతోంది. చైనా చమురు వినియోగంలో పెట్రోకెమికల్స్ రంగం మాత్రమే కొంతమేర వృద్ధి సాధిస్తోంది. గత కొన్ని నెలల్లో చైనా వ్యూహాత్మక చమురు నిల్వలను (ఎస్‌పీఆర్) పెంచుకుంటూపోయి రోజుకు సుమారు రెండు లక్షల బ్యారెళ్ల చమురును నిల్వ చేసింది. ఈ నిల్వలు ప్రపంచ చమురు ధరలను స్థిరీకరించడంలో కీలక పాత్ర పోషించాయి. అయితే దీర్ఘకాలంలో ఈ రకమైన నిల్వలు కొనసాగించడం సవాలుగా మారుతోంది. గ్లోబల్ రీసెర్చ్ హెడ్ ఫ్రెడెరిక్ లాస్సేర్ పేర్కొన్నట్లు రాబోయే కాలంలో మార్కెట్‌లో అదనపు చమురును సర్దుబాటు చేయడం కష్టతరం అవుతుందని చెబుతున్నారు. వచ్చే ఏడాది ప్రపంచ చమురు డిమాండ్ పెద్దగా పెరగకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఆయన లెక్కల ప్రకారం 2026లో రోజుకు సుమారు ఒక మిలియన్ బ్యారెళ్ల వరకు మాత్రమే డిమాండ్ పెరుగుతుంది. ఈ స్థాయి డిమాండ్ ఉన్నప్పుడు మాత్రమే మార్కెట్లో ఉత్పత్తిదారులు అధిక చమురును విక్రయించగలుగుతారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశం చమురు డిమాండ్ వృద్ధిలో కీలక భూమిక వహిస్తోంది. పెట్టుబడిదారులు, ఉత్పత్తిదారులు భారతదేశంలో పెరుగుతున్న వినియోగం, చైనాలో నిల్వ పెరగడం, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావాలను నిశితంగా విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది ప్రపంచ చమురు ధరల దిశను భారతదేశ డిమాండ్ ప్రభావితం చేస్తుందని అంచనా వేస్తున్నారు. చైనా వినియోగంలో నెమ్మదితనం మార్కెట్ సర్దుబాటు చేసేందుకు కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్థిక నిపుణుల విశ్లేషణలు, భారతదేశ చమురు వినియోగం, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావిత అంశాల మధ్య పరస్పర సంబంధాన్ని స్పష్టంగా చూపుతున్నాయి. ఏదేమైనా 2025లో భారతదేశం చమురు వినియోగంలో ప్రపంచంలో ప్రముఖ స్థానంలో ఉండే అవకాశం కలిగినప్పటికీ.. మార్కెట్ పెరుగుదల దిశ, నిల్వలు, అంతర్జాతీయ ముడి చమురు సరఫరాలపై ఆధారపడే అవాంతరాలు కూడా ఉన్నాయి. 2021 నాటికి మనదేశం ముడిచమురు ఉత్పత్తి రేటు 5.2 శాతం మాత్రమే. దాంతో 82 శాతానికిపైగా ముడిచమురును రష్యా, అమెరికా సహా పలు అరబ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. అయితే జనాభాతోపాటు పెరుగుతున్న అవసరాలను సర్దుబాటు చేసుకునేందుకు ఎప్పటికప్పుడు ఉత్పత్తి పెంచుకోవడంతోపాటు దిగుమతుల పరిమితి పెరుగుతోంది. దీనివల్ల భారీ మొత్తంలో విదేశీమారక ద్రవ్యాన్ని వెచ్చించాల్సి వస్తోంది. ఇది చాలదన్నట్లు రష్యా`ఉక్రెయిన్ యుద్ధం, అరబ్ దేశాలపై ఇజ్రాయెల్ దాడులు వంటి పరిణామాలు అంతర్జాతీయ ముడిచమురు ధరలను స్థిరంగా ఉంచకపోగా తరచూ పెరిగిపోతున్నాయి. అదే మన ఆర్థిక వ్యవస్థకు పెనుభారంగా మారుతోంది. దీన్ని సాధ్యమైనంతగా తగ్గించుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను జనాభా పెరుగుదల డామినేట్ చేస్తోంది.










Comments