మన జనాభా తగ్గుతోందట!
- DV RAMANA

- Oct 24
- 2 min read

మనదేశ జనాభా 145 కోట్లు దాటినట్లు అంచనా. ఇది అంచనాయే. ఎందుకంటే.. దేశంలో పదేళ్లకోసారి జరగాల్సిన జనాభా లెక్కల సేకరణ గత 14 ఏళ్లుగా జరగలేదు. చివరిసారి 2011లో సెన్సస్ కార్యక్రమం నిర్వహించారు. ఆ లెక్కన మళ్లీ 2021లో జరగాల్సి ఉండేది. కానీ అప్పట్లో కోవిడ్ సంక్షోభం కారణంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని వాయిదా వేసింది. అప్పుడు వాయిదా పడిన సెన్సస్ కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించేందుకు కేంద్ర హోంశాఖ పరిధిలోని రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం సన్నాహాలు చేస్తోంది. అయితే ఇతర మార్గాల్లో సేకరిస్తున్న సమాచారం ప్రకారం.. జనసంఖ్యలో మనదేశం చైనాను అధిగమించి 145 కోట్లకుపైగా జనాభాతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది. దీనికి కారణం ఏమిటంటే.. జనసంఖ్యను పరిమితం చేసేందుకు చైనా అనేక నిర్బంధ జనాభా నియంత్రణ చర్యలు అమలు చేస్తుంటే.. మన దేశంలో ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో నియంత్రణ కార్యక్రమాలు పక్కాగా అమలుకాకపోవడమే. అయితే ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కొంత మార్పు కనిపిస్తున్నట్లు కొన్ని నివేదికల ద్వారా తెలుస్తోంది. మరణాల కంటే జననాలు ఎక్కువగా ఉంటే జనసంఖ్య పెరుగుతుంది. జననాల కంటే మరణాలు అధికంగా ఉంటే జనసంఖ్యలో తగ్గుదల నమోదవుతుంది. ఇప్పుడు మనదేశంలో ఇదే జరుగుతోందని హోంశాఖ ఏడాదికోసారి ప్రకటించే సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేదిక ద్వారా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఏడాది కాలంలో నమోదైన జనన, మరణాల వివరాలనే సీఆర్‌ఎస్ నివేదిక అంటారు. 2023 సంవత్సరానికి సంబంధించిన ఈ నివేదికను ఈమధ్యే రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయం విడుదల చేసింది. దీని ప్రకారం 2022లో జననాల సంఖ్యతో పోలిస్తే 2023లో జననాల సంఖ్య తగ్గింది. అదే సమయంలో మరణాల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గత ఐదేళ్లలో జననాలు తగ్గడం ఇది మూడోసారి కావడం విశేషం. సీఆర్‌ఎస్ నివేదిక ప్రకారం దేశం మొత్తం మీద 2023లో 25.2 మిలియన్లు అంటే 2.52 కోట్ల జననాలు నమోదయ్యాయి. అంతకుముందు సంవత్సరం(2022)తో పోల్చుకుంటే ఈ సంఖ్య 2,32,094 తక్కువ. దేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గుముఖం పట్టిందనడానికి దీన్ని ఒక సంకేతంగా భావిస్తున్నారు. కాగా 2023లో దేశవ్యాప్తంగా 87 లక్షల మరణాలు నమోదయ్యాయి. అంతకుముందు ఏడాది దీని కంటే 9749 మరణాలు అధికంగా నమోదయ్యాయి. 2022లో ప్రసవాల శాతం 75.5 శాతం ఉండగా 2023లో 74.7 శాతానికి తగ్గింది. కోవిడ్‌కు ముందు ఇది 80 శాతంపైనే ఉండేది. ఇదే సమయంలో కోవిడ్‌కు 40 శాతంలోపే ఉన్న మరణాల రేటు 2023 నాటికి 53.4 శాతానికి పెరిగింది. సీఆర్‌ఎస్ నివేదిక ప్రకారం.. జాతీయస్థాయి జనన మరణాల లెక్కలతో పోలిస్తే మన రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితి చాలావరకు భిన్నంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 2023లో మొత్తం 7,62,093 జననాలు నమోదు కాగా 4,42,218 మరణాలు నమోదయ్యాయి. అదే తెలంగాణలో చూస్తే జననాలు 6,52,688, మరణాలు 2,40,058 రికార్డయ్యాయి. ఏపీ మరణాల రేటు కంటే జననాలు దాదాపు ఒకటిన్నర రెట్లు అధికంగా ఉండగా.. తెలంగాణలో మాత్రం మరణాల కంటే జననాలు దాదాపు రెండున్నర రెట్టు ఎక్కువగా ఉన్నాయి. రెండు రాష్ట్రాల గణాంకాలు కేవలం జనాభా పెరుగుదలకే కాకుండా వైద్య సేవల లభ్యత, పట్టణీకరణ, మౌలిక ఆరోగ్య వసతుల స్థాయికి సూచికలుగా కూడా నిలుస్తున్నాయి. జిల్లాల్లో పరిస్థితి చూస్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలు జననాల్లో ముందువరుసలో ఉన్నాయి. రాయలసీమ రీజియన్‌లోని ఈ జిల్లాల్లో సంప్రదాయ కుటుంబ వ్యవస్థలు, గ్రామీణ జనాభా శాతం అధికంగా ఉండడం వల్ల జననాల రేటు సహజంగానే ఎక్కువగా ఉంటుంది. మరోవైపు విశాఖపట్నం, గుంటూరు వంటి అర్బన్ జిల్లాలో జననాలు తక్కువగా ఉండటం పట్టణ జీవితశైలిలో మార్పులు, కుటుంబ పరిమాణంపై పెరిగిన చైతన్యానికి సూచికలుగా భావించవచ్చు. తెలంగాణలో ఈ గణాంకాలు విభిన్న పరిస్థితికి దర్పణం పడుతున్నాయి. హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు జననాల పరంగా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ మూడు జిల్లాలు మౌలిక వైద్య సౌకర్యాలు, ప్రైవేట్ హెల్త్‌కేర్ ఎక్కువగా అందుబాటులో ఉన్న ప్రాంతాలు. కానీ మిగతా జిల్లాల్లో జననాల సంఖ్య తక్కువగా ఉండడం, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య వసతుల లేమి, లోపాలు ఉన్నాయనడానికి సంకేతాలు. మరణాల లెక్కల్లోనూ రెండు రాష్ట్రాల మధ్య వ్యత్యాసం ఉంది. ఈ గణాంకాల్లో మరో కీలక విశేషం ఏమిటంటే.. రెండు రాష్ట్రాల్లోనూ లక్షకు పైగా జననాలు అధికారికంగా నమోదు కాలేదు. సివిల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఉద్దేశం ప్రతి శిశువు రికార్డు కావడం. పుట్టుక, మరణం రెండూ దేశ జనాభా పాలసీలకు, ఆర్థిక ప్రణాళికలకు బలమైన ఆధారంగా నిలుస్తాయి. ఈ లెక్కలు వాస్తవానికి దగ్గరగా ఉంటేనే.. ప్రభుత్వ విధానాలు, పథకాల అమలులో కచ్చితత్వం సాధించవచ్చు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో జరిగే జననాలు నమోదు కాకపోవడం వెనుక అవగాహన లోపం, సిబ్బంది కొరత, కొన్ని చోట్ల ఇంకా పాత సామాజిక ఆచారాలు కారణమవుతున్నాయి. జననాల నమోదును ఒక్క ఆరోగ్య శాఖ బాధ్యతగానే కాకుండా.. పంచాయతీ స్థాయిలో పౌర బాధ్యతగా నిర్దేశించాలి. ఆస్పత్రుల్లో పుట్టిన పిల్లలతో పాటు గృహ ప్రసవాల ద్వారా జన్మించే శిశువుల నమోదు ప్రక్రియను సులభతరం చేయాలి. ఈ రికార్డులు సరైనవిగా ఉంటేనే జనాభా గణాంకాలు కూడా వాస్తవానికి దగ్గరగా వస్తాయి. తద్వారా ప్రభుత్వ విధానాలు రూపకల్పన సవ్యంగా సాగేందుకు ప్రతి ఒక్కరూ దీన్ని బాధ్యతగా గుర్తించాల్సి ఉంది.










Comments