మన నిఘా కన్నుకు ఏమైంది?
- DV RAMANA

- 5 days ago
- 2 min read

రాష్ట్రంలో మళ్లీ మావోయిస్టుల కలకలం. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టు కార్యకలాపాలు గానీ, వారి ఉనికి గానీ దాదాపు కనిపించలేదు. అల్లూరి జిల్లాలో అడపాదడపా సానుభూతిపరులు, మిలీషియా సభ్యుల లొంగుబాట్లు, అరెస్టులు వంటివి జరిగాయే తప్ప.. పోలీసు కాల్పులు, పేలుళ్లు వంటి విధ్వంసక ఘటనలు చోటుచేసుకోవడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో గుండెల మీద చేతులు వేసుకుని నిశ్చింతగా ఉంటూ వచ్చాయి. మావోయిస్టు కార్యకలాపాల ప్రభావంతో ఆయా ప్రాంతాల్లో స్తంభించిన ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సైతం మారుమూల గ్రామాలకు చేరుకోగలుగుతున్నాయి. దాంతో రాష్ట్రం మావోయిస్టు ఉద్యమం కనుమరుగైనట్లేనని అనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా ఉలికిపాటు.. తీవ్ర కలకలం.. ఏపీ పరిధిలోని మారేడుమిల్లి టైగర్ జోన్‌లోనే మావోయిస్టు అగ్రనేత, పీఎల్‌జీఏ కమాండర్ హిడ్మా, ఆయన భార్య హేమ అలియాస్ రాజీతో సహా ఆరుగురు మావోయిస్టులు హతం కాగా అదేరోజు రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో 50 మావోయిస్టులు పట్టుబడటం తీవ్ర సంచలనం రేపింది. దానికితోడు జీఎంవలస సమీప అడవుల్లో జరిగిన తాజా ఎన్‌కౌంటర్‌లో మరో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో ప్రస్తుత మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా భావిస్తున్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, పార్టీ అధికార ప్రతినిధి అజాద్‌లు ఉన్నారు. హిడ్మా ఎన్‌కౌంటర్ అనంతరం ఘటన స్థలంలో లభించిన హిడ్మాకు చెందిన డైరీలోని వివరాల ఆధారంగా విజయవాడ, ఏలూరు, కాకినాడ తదితర ప్రాంతాల్లో సాయుధ పోలీసు బలగాలు దాడులు జరిగిన 50 మంది మావోయిస్టు కార్యకర్తలను అరెస్టు చేయడం చూస్తే సహజంగా ఎవరైనా అది పోలీసులు విజయంగానే పరిగణిస్తారు. కానీ ఈ సంఘటనల లోతుల్లోకి వెళితే రాష్ట్రంలోకి మళ్లీ మావోయిస్టులు.. అది కూడా టాప్ లీడర్స్‌తో సహా పెద్దసంఖ్యలో ఎలా రాగలిగారన్న ప్రశ్నలు, సందేహాలు తలెత్తక మానవు. ఇందులోనే పోలీసుల నిఘా వైఫల్యం కూడా కనిపిస్తుంది. మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్ తర్వాతే హిడ్మా డైరీ లభించడం వల్లే ఛత్తీస్‌గఢ్ అడవుల నుంచి పెద్దసంఖ్యలో మావోయిస్టు లీడర్లు, కార్యకర్తలు రాష్ట్రంలోకి చొరబడినట్లు బయటపడిరది. ఆ వివరాల ఆధారంగానే భారీ సంఖ్యలో అరెస్టులు, మరో ఎన్‌కౌంటర్, ఇద్దరు అగ్రనేతల మృతి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ లెక్కన చూస్తే మారేడుమిల్లి అడవుల్లో ఎన్‌కౌంటర్ జరిగి ఉండకపోతే రాష్ట్రంలోకి చొరబడిన మావోయిస్టుల జాడ లభించకపోవడమో.. జాడ కనుగొనడంలో జాప్యమో జరిగి ఉండేవనడంలో సందేహం లేదు. హిడ్మా డైరీలోని వివరాల ఆధారంగా విజయవాడ కానూరు ఆటోనగర్‌లో 27 మందిని, ఏలూరులో 15 మందిని, కాకినాడలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలో పట్టుబడిన 27 మందిలో 21 మంది మహిళలే ఉండటం విశేషం. ప్రాథమిక విచారణలో వీరంతా కొన్నిరోజుల క్రితమే నగరంలోకి ప్రవేశించారని, నిర్మాణ రంగ కూలీలుగా చెప్పుకొని భవనాన్ని అద్దెకు తీసుకున్నారని అంటున్నారు. మిగతా ప్రాంతాల్లో కూడా ఇలాగే తప్పుడు వివరాలతో ఇళ్లు అద్దెకు తీసుకున్నట్లు తెలిసింది. వీరి వద్ద భారీగా ఆయుధాలు కూడా లభించాయి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే వీరంతా ఎన్‌కౌంటర్లలో మరణించిన టాప్ లీడర్లు హిడ్మా, దేవ్‌జీల రక్షకదళం సభ్యులు. ఇంతమంది ఆయుధాలతో సహా రాష్ట్ర సరిహద్దులు దాటి ఎలా వచ్చారన్నది ఆలోచించాల్సిన విషయం. మావోయిస్టుల అంతమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని నెలలుగా ఆపరేషన్ కగార్ నిర్వహిస్తోంది. డ్రోన్లు, జీపీఆర్‌ఎస్ వంటి అత్యాధునిక సాంకేతికత సాయంతో ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లోని అడవులు, దుర్గమమైన దండకారణ్య ప్రాంతాలను కూంబింగ్ పేరుతో సాయుధ పోలీసు బలగాలు జల్లెడ పడుతున్నారు. మావోయిస్టు శిబిరాలతోపాటు వారికి అండగా నిలుస్తున్న ఆదివాసీ గ్రామాల్లోకి చొచ్చుకుపోతున్న బలగాలు క్రమంగా వాటన్నింటినీ తమ ఆధీనంలోకి తచ్చుకుని క్యాంపులు ఏర్పాటు చేసుకున్నాయి. ఎన్‌కౌంటర్లు, అరెస్టులు, లొంగుబాట్ల రూపంలో టాప్ నుంచి కిందిస్థాయి వరకు మావోయిస్టు క్యాడర్ బేస్‌ను ఛిన్నాభిన్నం చేసేశారు. ఫలితంగా మిగిలిన కొద్దిపాటి మావోయిస్టు నేతలు, క్యాడర్ నిలువ నీడ కోసం, బలగాల నుంచి కాపాడే ఆశ్రయం కోసం ప్రత్యామ్నాయాల వైపు పరుగులు తీయడం ప్రారంభించారు. ఆ క్రమంలోనే హిడ్మా తమ అంగరక్షక దళాలతో సరిహద్దులు దాటి ఆంధ్రప్రదేశ్‌లోకి చొరబడినట్లు భావిస్తున్నారు. ఆపరేషన్ కగార్ కారణంగా మావోయిస్టులు చెదిరిపోతున్న పరిస్థితుల్లో మన రాష్ట్ర పరిధిలో వారికి అనుకూలంగా ఉండే సరిహద్దు ఏజెన్సీ ప్రాంతాలపై నిఘా తీవ్రతరం చేయడం పోలీసు శాఖ బాధ్యత. దీన్ని ఎవరూ ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. మన నిఘా ఏ స్థాయిలో ఉందో గానీ.. ఆ కంటిని తప్పించుకుని షెల్టర్‌ను వెతుక్కుంటూ మావోయిస్టు లీడర్లు, వారిని అనుసరించి క్యాడర్ రాష్ట్రంలోకి వచ్చేయగలగడం నిజంగా ఆందోళన చెందాల్సిన విషయమే. అది కూడా రాష్ట్ర రాజధాని అమరావతికి సమీపంలో ఉన్న.. ప్రస్తుతం తాత్కాలిక రాజధాని అనదగ్గ విజయవాడతోపాటు ఏలూరు, కాకినాడ వంటి జనారణ్యాల్లోకి రాగలగడం నిఘా విభాగం సమర్థతనే ప్రశ్నార్థకం చేస్తోంది. హిడ్మా అనుపానులు కనుగొనగలగడం వల్లే అరెస్టులు, ఎన్‌కౌంటర్లు జరిగాయని అది తమ నిఘా ఫలితమేనని చెప్పవచ్చు. కానీ హిడ్మా మన రాష్ట్ర అడవుల్లోకి చొరబడగలగడం, కొన్ని రోజులుగా ఇక్కడే మకాం వేయడం కూడా నిఘా లోపమే కదా!










Comments