మన నెత్తిన నాన్‌వెజ్ పాలు పోసే ఎత్తుగడ
- DV RAMANA

- Jul 17, 2025
- 2 min read

తన మాట వినని, తమ దేశంతో వాణిజ్య, అణు, ఇతరత్రా ఒప్పందాలు చేసుకోవడానికి ముందుకురాని దేశాలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రతీకార చర్యలకు అడ్డూఅదుపూ లేకుండాపోతోంది. సుమారు మూడు నెలల క్రితమే ప్రపంచంలోని సగానికిపైగా దేశాలపై భారీ ఎత్తున ప్రతీకార సుంకాలు విధించి ఆయా దేశాల ఆర్థిక, వాణిజ్య వ్యవస్థలను దెబ్బతీయడానికి పూనుకున్నారు. ఈ చర్యపై విమర్శలు వెల్లువెత్తడంతో వీటి అమలును మూడు నెలలు వాయిదా వేశారు. ఈ నెలాఖరుతో ఆ గడువు ముగిసిపోతుండటంతో ట్రంప్ మహాశయుడు మళ్లీ పంజా విసరడానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే 34 దేశాలకు సుంకాలకు సిద్ధంగా ఉండాలంటూ లేఖలు రాశారు. వీటిలో అమెరికా మిత్ర దేశాలు కూడా ఉండటం విశేషం. ఇక బ్రిక్స్ దేశాలైన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా తదితర దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా పని చేస్తున్నాయని ఆరోపిస్తున్న ట్రంప్ వాటిపైనా కక్ష సాధింపు చర్యలకు దిగారు. ముఖ్యంగా ఉక్రెయిన్‌తో యుద్ధంలో ఉన్న రష్యా తన మాట లెక్కచేయకుండా, శాంతి చర్చలకు రాకుండా యుద్ధం కొనసాగిస్తుండటం ట్రంప్ అహాన్ని దెబ్బతీస్తోంది. ఇప్పటికే రష్యాపై అనేక ఆంక్షలు విధించినా.. వాటిని కాదని ఆ దేశం నుంచి ముడి చమురు ఇతర దిగుమతులు చేసుకుంటున్న భారత్, చైనా, బ్రెజిల్, టర్కీ వంటి దేశాలపై ఏకంగా 500 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ హుంకరించారు. మరోవైపు తన అదుపాజ్ఞల్లో పని చేస్తున్న నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రియటీ ఆర్గనైజేషన్) కూటమి ప్రధాన కార్యదర్శి ద్వారా కూడా తాజాగా ఇదే తరహా హెచ్చరికలు జారీ చేయించారు. ఒకవైపు భారత్ తమకు సన్నిహిత మిత్రదేశమని చెబుతూనే మరోవైపు తన మాట వినని ఆ దేశంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుండటం ట్రంప్ సర్కార్ ద్వంద్వ వైఖరిని తేటతెల్లం చేస్తుంది. తాజాగా ఇవే సంకాలు, ద్వైపాక్షిక వాణిజ్య అంశాలపై ఇరుదేశాల మధ్య జరుగుతున్న చర్చల సందర్భంగా నాన్‌వెజ్ పాలను భారత్‌పై బలవంతంగా రుద్దేందుకు అమెరికా అధికారులు ప్రయత్నించారు. అమెరికాకు ఎగుమతి అయ్యే భారత ఉత్పత్తులపై పది శాతం, భారత్ దిగుమతి చేసుకునే అమెరికా ఉత్పత్తులపై 5 నుంచి 8 శాతం వరకు సుంకాల విధింపునకు అంగీకారం కుదిరింది. మరికొన్నింటిపై అధిక టారిఫ్‌లు ఉండవచ్చని అంటున్నారు. చర్చలు కొలిక్కి వచ్చినా నాన్‌వెజ్ పాలు, దాని ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు మాత్రం భారత్ అంగీకరించలేదు. దాంతో అమెరికా పాడి ఉత్పత్తులకు సంబంధించి ఇంకా ఎటువంటి ఒప్పందం కుదరలేదు. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా తమ పాడి ఉత్పత్తులు దిగుమతి చేసుకోవాలని అమెరికా తీవ్రమైన ఒత్తిడే తెచ్చి ఎలాగైనా వాటిని అంటగట్టాలని చూసినా భారత్ గట్టిగా నిలబడిరది. తన వైఖరిని నిర్మొహమాటంగా చెప్పేసింది. అమెరికా పాడి ఉత్పత్తులను ముఖ్యంగా నాన్‌వెజ్ పాలు దిగుమతి చేసుకుంటే తమ దేశం సంస్కృతి సంప్రదాయాలతో పాటు ఈ రంగాలపై ఆధారపడిన కోట్లాది భారతీయుల ప్రయోజనాలు దెబ్బతింటాయని స్పష్టం చేసి అమెరికా ప్రతిపాదనను తిరస్కరించింది. అయితే దేశం ఏదైనా పాలు ఒకే రకంగా ఉంటాయి కదా? ఈ నాన్‌వెజ్ పాలు ఏమిటి?? అన్న సందేహాలు కలగడం సహజం. ఎక్కడైనా ఆవులు, గేదెలు, ఇతర పశువులు ఇచ్చే పాలను నాన్‌వెజ్‌గా ఎలా ట్రీట్ చేస్తారు అన్న సందేహం కూడా కలగవచ్చు. అమెరికాలో పాడి పశువుల పోషణ విధానం కాస్త భిన్నగా ఉంటుంది. మన దేశంలో పాడి పశువులకు గడ్డి, కుడితి, కూరగాయల వ్యర్థాలు వంటి శాకాహారాలను పెట్టి పోషిస్తుంటారు. అవి ఇచ్చే పాలను నిరభ్యంతరంగా అందరూ వాడుతున్నారు. కానీ అమెరికాలో పాడి పశువులకు గడ్డితో పాటు కోళ్లు, చేపలు, ఇతర పశువులకు సంబంధించిన మాంస వ్యర్థాలు, వాటి కొవ్వులతో తయారు చేసిన పదార్థాలను ఆహారంగా వేస్తుంటారు. ఇటువంటి ఆహారం తినే పశువులు మరింత ఎక్కువగా పాలు ఇస్తాయని అంటారు. ఈ పశువులు ఇచ్చే పాలనే నాన్‌వెజ్ పాలుగా వ్యవహరిస్తున్నారు. అందుకే అమెరికా పాలపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. మనదేశంలో పాలను పవిత్ర పదార్థంగా కూడా భావించి పూజలు, శుభకార్యాల్లో దేవుళ్ల అభిషేకాలకు వినియోగిస్తుంటారు. ప్రసాదాల తయారీలోనూ వాడుతుంటారు. అలాంటిది అమెరికాలో మాంసాహార వ్యర్థాలు తినే పశువులు ఇచ్చే పాలను ఎలా పవిత్రంగా భావించగలమన్నది భారత వాదన. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధమంటూ తిరస్కరించడం విశేషం.










Comments