మన పేకాట కీర్తి.. ఖండాలు దాటి!
- NVS PRASAD

- Nov 10
- 1 min read

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
మన జిల్లాలో పేకాట ఇప్పుడు పశ్చిమగోదావరిలో కొన్ని ప్రాంతాల మాదిరిగా ఒక సంప్రదాయంగా మారిపోయిందా? అంటే.. అవుననేవారే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఒకప్పుడు పండగకు, పబ్బానికీ పేకాడుకునే సిక్కోలువాసులకు మొదట పేకాట క్లబ్‌ను నగరంలో తెరిచి అలవాటు చేశారు. అది కాస్త ఇప్పుడు ఆనవాయితీ అయిపోయింది. చివరకు జిల్లా కాదుకదా.. రాష్ట్రం, దేశం దాటి వేరే ఖండాల్లో పేకాడిరచడానికి మనోళ్లు పేమెంట్లు తీసుకుంటున్నారు. తాజాగా నగరం నుంచి ఓ 15 మంది వ్యాపారస్తులు వియత్నాం వెళ్లారు. ఇక్కడ వీరిని నరసన్నపేటకు చెందిన కుమార్ పోగుచేసి వియత్నాంకు పంపినట్లు తెలుస్తుంది. రూ.5 లక్షలు చెల్లిస్తే.. వియత్నాం వెళ్లి రావడానికి విమానం టిక్కెట్లు, భోజనాలు, మందు, హోటల్ రూమ్‌లతో పాటు పేకాడటానికి నగదుకు ప్రత్యామ్నాయంగా టోకెన్లను ఇచ్చే ఏర్పాట్లను ఇక్కడ కుమార్ చూసుకుంటున్నాడట. హైదరాబాద్, విశాఖపట్నం, కడప, కర్నూలు, ఖమ్మం ప్రాంతాల నుంచి కూడా ఈ పేకాట టూరిజానికి పెద్ద ఎత్తున మనుషులను వియత్నాం పంపినట్లు తెలుస్తుంది. వారం రోజుల పాటు నడిచే ఈ పేకాట టూర్‌లో ఒకరి నుంచి రూ.5 లక్షలు వసూలుచేస్తే, అందులో 5శాతం కమీషన్ ఇస్తుండటంతో 200 మందిని పోగేసి తాజాగా వియత్నాం పంపారట. శ్రీకాకుళం నుంచి ఈ పేకాట టూరిజం కోసం పెద్ద ఎత్తునే బయల్దేరి వెళ్తున్నారు. ఇక్కడ ఏ చెట్లూ, పుట్టల మాటున పేకాడటం కంటే మందు, పొందు దొరికేచోట విచ్చలవిడిగా ఆడుకోవచ్చని కుమార్‌ను అనేకమంది కలుస్తున్నట్టు భోగట్టా. 5 శాతం కమీషన్ స్పాట్‌లోనే రావడంతో వారానికో చోట పేకాట కోసం మనుషులను పంపుతున్నారు. ఆమధ్య కజికిస్థాన్‌లో ఆడిరచారు. నేపాల్ వెళ్లారు. గోవా టూర్ రెగ్యులర్‌గా ఉంటుంది. ఈసారి వియత్నాం అని ప్రకటించడంతో ఎక్కువమంది అటువైపు మొగ్గు చూపించినట్లు చెప్పుకుంటున్నారు.










Comments