top of page

మన సల్మాన్‌ఖాన్‌పై ఉగ్ర ముద్రా!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Oct 27, 2025
  • 2 min read

భారత్‌ చేతిలో ఎన్నిసార్లు పరాభవాలు ఎదుర్కొంటున్నా పాక్‌ కుటిల బుద్ధి ఏమాత్రం మారడంలేదు. కుక్క తోక వంకర అన్నట్లు అంతర్జాతీయంగా తిరస్కారాలు ఎదురవుతున్నా అక్కడి పాలకుల తీరు మారడం లేదు. ఈ నగుబాట్ల నుంచి తమ దేశ ప్రజల దృష్టి మళ్లించేందుకు పాక్‌ పాలకులు కుటిల పన్నాగాలు పన్నుతూనే ఉన్నారు. గురివింద గింజ తన నలుపు ఎరుగనట్లు, పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనిపించినట్లు వక్రబుద్ధితో భారత్‌ను దెబ్బతీయాలని శతధా ప్రయత్నిస్తున్న పాకిస్తాన్‌ పాలకులకు భారత్‌కు చెందిన సెలబ్రిటీలు ఏం మాట్లాడినా అవి ఉగ్రచర్యలుగానూ, వారు ఉగ్రవాదులుగానూ కనిపిస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడితో 26 మంది అమాయక భారత టూరిస్టులను బలిగొన్నందుకు ప్రతిగా పాకిస్తాన్‌లో ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసుకున్నందుకు పాక్‌ క్రికెటర్లు, నటులు సహా అనేకమంది సెలబ్రిటీలు విచక్షణారహితంగా భారత్‌పై నోరు పారేసుకుని విధ్వేషం వెళ్లగక్కినా ఫర్వాలేదు గానీ.. పాకిస్తాన్‌తోపాటు బలూచిస్థాన్‌ను కలిపి ప్రస్తావించనంతమాత్రానే అదేది ఘోరం జరిగిపోయిందన్నట్లు.. బలూచిస్తాన్‌ను తమ దేశం నుంచి విడదీసేసినట్లు తెగ ఫీలైపోయిన పాక్‌ పాలకులు ప్రముఖ సెలబ్రిటీ అయిన మన కండల వీరుడు, బాలీవుడు హీరో సల్మాన్‌ఖాన్‌పై ఏకంగా ఉగ్రవాది అన్న ముద్ర వేసేశారు. అసలు జరిగిందేమిటో తెలిస్తే.. సల్మాన్‌ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే ఇండియాతోపాటు ఇండియన్స్‌ పట్ల పాక్‌ ఎంత ఉక్రోషంతో రగిలిపోతోందో అర్థమవుతుంది. ఇటీవల సౌదీ అరేబియాలో జరిగిన ‘జాయ్‌ ఫోరం 2025’ అనే కార్యక్రమంలో సల్మాన్‌ పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలూచిస్థాన్‌ను ప్రత్యేక దేశం అన్నట్లు మాట్లాడారన్నది పాక్‌ ఆరోపణ. తమ దేశంలో అంతర్భాగమైన బలూచ్‌లో విముక్తి పోరాటం జరుగుతున్న తరుణంలో సల్మాన్‌ అలా మాట్లాడటం పాక్‌కు మింగుడుపడలేదు. ఈ వివాదానికి దారితీసిన సల్మాన్‌ఖాన్‌ ప్రసంగంలోని కొన్ని అంశాలు పరిశీలిస్తే.. ‘భారతీయ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. ఒక హిందీ సినిమాను సౌదీ అరేబియాలో విడుదల చేస్తే తప్పకుండా సూపర్‌హిట్‌ అవుతుంది. ఆపై తెలుగు, తమిళ్‌, మలయాళ సినిమాలు కూడా ఇక్కడ కోట్ల రూపాయలు రాబడుతున్నాయి. దీనంతటికీ కారణం పలు దేశాలకు చెందిన ప్రజలు సౌదీలో ఉండటమేనని చెప్పాలి’ అని ఆయన అన్నారు. ఇంకా ప్రసంగాన్ని కొనసాగిస్తూ ‘బలూచిస్థాన్‌, అఫ్ఘనిస్థాన్‌, పాకిస్తాన్‌ నుంచి వచ్చిన ప్రజలు కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు. ఈ మాటల్లో బలూచిస్థాన్‌ వేరే దేశం అనే అర్ధం ధ్వనిస్తోందని, సల్మాన్‌ కావాలనే అలా మాట్లాడారని పాకిస్తాన్‌ ఆరోపించింది. దానికితోడు ఈ వ్యాఖ్యలపై బలుచిస్థాన్‌ వేర్పాటువాదులు ఆయనకు సోషల్‌మీడియా వేదికగా కృతజ్ఞతలు చెబుతూ పోస్టులు పెడుతుండటం పాక్‌కు పుండు మీద కారం రాసినట్లుగా ఉంది. ‘సల్మాన్‌ నిజం మాట్లాడారు. బలూచిస్థాన్‌ ఒక ప్రత్యేక దేశం. ఇదొక చారిత్రక వాస్తవం. బలూచిస్థాన్‌ పాకిస్తాన్‌లో భాగం కాదు. అది పాక్‌ ఆక్రమిత భూభాగం. మేము బలూచిస్థాన్‌ నుంచి సల్మాన్‌ భాయ్‌ని ప్రేమిస్తున్నాము’ అంటూ బలూచ్‌ పోరాటవాదులు పోస్టులు పెడుతుండటంతో పాకిస్థాన్‌ ప్రభుత్వం మరింత రగిలిపోయింది! ఒక దేశం పక్కన ఇంకో ప్రాంతం పేరు చేర్చినంత మాత్రానా అది ప్రత్యేక దేశమైపోతుందా? అది ప్రస్తుతం పాక్‌లో ఒక భాగమన్న విషయాన్ని ప్రపంచం గమనించలేకపోతుందా? సల్మాన్‌లాంటి ఒక వ్యక్తి పొరపాటుగానో, గ్రహపాటుగానో పాక్‌తోపాటు బలూచ్‌ను ప్రస్తావిస్తే దాన్ని దేశంగా ఆమోదించినట్లు, గుర్తించినట్లు అవుతుందా? అన్న ఇంగితం, విచక్షణ కూడా లేకుండా పాక్‌ పాలకులు సల్మాన్‌ఖాన్‌పై కత్తిగట్టారు. ఏకంగా ఆయన్ను ఓ ఉగ్రవాదిగా ప్రకటించేశారు. ఆ మేరకు ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం సల్మాన్‌ఖాన్‌ను నాలుగో షెడ్యూల్‌లో చేర్చింది. ఈ షెడ్యూల్‌ ఉగ్రవాద నిరోధక చట్టం కిందకు వస్తుంది. ఇందులో పేర్కొనే వ్యక్తులు పాకిస్తాన్‌లో చట్టపరమైన చర్యలకు లోబడి ఉంటారు. అటువంటి జాబితాలో సల్మాన్‌ పేరును చేర్చడం ద్వారా ఆయన్ను ఉగ్రవాదిగా పాక్‌ ప్రభుత్వం గుర్తించడం ఒక్కసారిగా వైరల్‌గా మారింది. దీనికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది. బలూచిస్తాన్‌ అన్న పేరును ప్రస్తావించినందుకే పాక్‌ ఎందుకింత ఉలిక్కిపడిరదంటే.. ఖనిజ వనరులతో సమృద్ధిగా ఉన్నప్పటికీ బలూచిస్థాన్‌ అత్యంత వెనుకబడిన ప్రాంతంగా మిగిలిపోయింది. ఇక్కడి ఖనిజ వనరులు పాకిస్తాన్‌ ఖజానాకు వరంగా మారాయి. ఈ ప్రాంతంలో ఉన్న బంగారం, బొగ్గు, రాగి, చమురు తదితర విలువైన ఖనిజ వనరుల ద్వారా లభించే ఆదాయంతో పంజాబ్‌, సింధ్‌ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్న పాక్‌ ప్రభుత్వం బలూచిస్థాన్‌ ప్రాంతాన్ని మాత్రం పట్టించుకోకుండా అభివృద్ధికి ఆమడదూరంలో ఉంచేసింది. ఈ వివక్షే బలూచ్‌ ప్రజల్లో అశాంతి, అసంతృప్తి రగిల్చి విముక్తి పోరాటంగా రూపుదాల్చింది. ప్రభుత్వంపై తిరగబడుతూ, అణచివేయాలని చూస్తున్న సైన్యంపై విరుచుకుపడుతూ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పుడు ప్రత్యేకంగా బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీని ఏర్పాటు చేసుకునే స్థాయికి, అలాగే పలు ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వం నడిపేస్థాయికి పోరాటవాదులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో బలుచిస్థాన్‌ను ఒక దేశంగా సల్మాన్‌ ప్రస్తావించడాన్ని పాక్‌ జీర్ణించులేక ఉగ్రవాది అన్న ముద్ర వేసింది. అలా అయితే భారత్‌ను అనుచితంగా తూలనాడిన ఎంతోమంది పాక్‌ సినిమా, క్రికెట్‌ సెలబ్రిటీలకు భారత ప్రభుత్వం ఎంత కఠిన శిక్షలు విధించాలి?!

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page