శివసేన శకం అంతరిస్తోందా?
- DV RAMANA

- 3 days ago
- 3 min read

ఎన్నికల్లో పార్టీల గెలుపు ఓటములు సహజం. ఒకసారి గెలిచిన పార్టీ మరోసారి ఓడిపోవచ్చు. ఇప్పుడు ఓడిపోయిన పార్టీ మళ్లీ పుంజుకుని అధికారం అందుకోవచ్చు. కానీ కొన్ని ఎన్నికలు మాత్రం పార్టీల ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చేస్తుంటాయి. మహారాష్ట్రలో ఇటీవల జరిగిన నగరపాలక సంస్థల ఎన్నిÅ£లు ఒక పార్టీని అటువంటి దుస్థితిలోకే నెట్టేశాయి. మిగతా నగరపాలక సంస్థల సంగతెలా ఉన్నా మన దేశ ఆర్థిక రాజధానిగా, మహారాష్ట్రకు గుండెకాయలా విలసిల్లుతున్న ముంబై మహానగరం తనను రెండున్నర దశాబ్దాలపాటు అవిచ్ఛిన్నంగా ఏలిన ఒక పార్టీని దిగజార్చేసిన ఎన్నికలివి. ముంబైలో శివసేనది ఘనమైన చరిత్ర. బాలాసాహెబ్ థాక్రే స్థాపించిన శివసేన సుమారు పాతికేళ్లపాటు ఎదురులేని ఆధిపత్యం వహించింది. కానీ 2012లో పులిలాంటి థాక్రే మరణించడం, ఆయన కుటుంబంతోపాటు, పార్టీపై పెత్తనం విషయంలో వారసుల మధ్య తలెత్తిన వివాదాలు పార్టీని చీల్చి కొంత బలహీనపరిచాయి. అనంతరం ఉద్ధవ్ థాక్రే నేతత్వంలోని శివసేనలో ఏక్‌నాథ్ షిండే వర్గం తిరుగుబాటు చేసి మరో చీలిక తీసుకొచ్చింది. చీలికవర్గం బీజేపీతో జతకట్టి అధికారం పంచుకుంటోంది. ఈ పరిణామాలు పరోక్షంగా బీజేపీకి కలిసివచ్చాయి. ఒకప్పుడు అధికారం కోసం బాల్‌థాక్రే నేతత్వంలోని శివసేన ముందు చేతులు కట్టుకుని నిల్చున్న కమలదళం ఇప్పుడు చీలిక వర్గమైన షిండే శివసేనతో కలిసి రాష్ట్ర ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించడమే కాకుండా తాజాగా జరిగిన నగరపాలక సంస్థల ఎన్నికల్లో తమ సీట్లు, ఓట్లను గణనీయంగా పెంచుకుంది. కీలకమైన బహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో ఏకైక పెద్ద పార్టీగా అవతరించడమే కాకుండా తొలిసారి శివసేన ఆధిపత్యానికి గండికొట్టి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ముంబైలో మొత్తం 227 డివిజన్లు ఉండగా వాటిలో 89 డివిజన్లను కైవసం చేసుకుంది. షిండే వర్గంతో కలిసి 118 సీట్లతో ముంబై సింహాసనం అధిష్టించేందుకు సిద్ధమైంది. మరోవైపు బాల్‌థాక్రే మరణం తర్వాత వేరు కుంపట్లు పెట్టుకున ఉద్ధవ్, రాజ్ థాక్రేలు ఏకమై ఈ ఎన్నికల్లో పోటీ చేసినా ఫలితం దక్కలేదు. ఆ ఇద్దరికి కలిపీ 65 సీట్లే వచ్చాయి. ముంబైలోనే కాకుండా మిగిలిన నగరపాలక సంస్థల్లోనూ బీజేపీ నేతత్వంలోని మహయుతి కూటమి విజయం సాధించడం ముంబైతోపాటు మహారాష్ట్రంలో శివసేన శకం ముగుస్తున్నదనడానికి సంకేతాలుగా రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలోనే ముంబై అత్యధిక బడ్జెట్ కలిగిన నగరపాలక సంస్థ. ఇక్కడ జనాభా కూడా చాలా ఎక్కువ కావడంతో ముంబై ఎన్నికలను మహారాష్ట్ర పార్టీలు, రాజకీయ విశ్లేషకులు అతిముఖ్యమైనవిగా భావిస్తుంటారు. రాష్ట్రంలో ముంబై, థానే, పుణె, నవీ ముంబైలలో అత్యధిక ప్రజలు నివసిస్తున్నారు. వీటిలో ఒక్క ముంబైలోనే 12 నుంచి 15 మిలియన్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మహారాష్ట్రలోని సుమారు 40 శాతం మంది ప్రజలు ఈ ఎన్నికల్లో ఓటు వేశారు. అలాంటి ముంబై మహానగరం తనపై శివసేనకు ఉన్న సుదీర్ఘ ఆధిపత్యానికి ముగింపు పలికిందని విశ్లేషిస్తున్నారు. ఒక రాజకీయ శకం ముగిసినట్లేనని బీఎంసీపై 25 ఏళ్ల శివసేన పాలన ముగింపును అభివర్ణిస్తున్నారు. బీజేపీ, ఏక్‌నాథ్ పిండే నేతృత్వంలోని శివసేన అధికార కూటమిగా ఆవిర్భవించాయి. ముంబై చుట్టూ ఉన్న ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లు థానే, కళ్యాణ్, నవీ ముంబైలలో కూడా బీజేపీ దాని మిత్రపక్షాల స్పష్టమైన ఆధిపత్యం సాధించాయి. ముంబై వెలుపల ఉన్న నాగ్‌పూర్ వంటి కార్పొరేషన్లలోనూ బీజేపీ లేదా బీజేపీ - శివసేన కూటమికి స్పష్టమైన విజయాలు దక్కాయి. అయితే ప్రతిపక్షం పూర్తిగా వెనకపడిపోలేదని అంటున్నారు. లాతూర్ సహ కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ విజయాలు సాధించింది. అయితే జనాభాపరంగా అవి చిన్న నగరాలన్న వాదన వినిపిస్తోంది. కొత్త కూటములకు ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయి. ఈ కూటములు అణగారినవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ గతంలో ఉనికి లేని అనేక సెమీ అర్బన్, పట్టణ కేంద్రాల్లో ప్రభావం చూపాయంటున్నారు. ముంబైలో కాంగ్రెస్- వంచిత బహుజన్ అఘాడీ ఒప్పందం చాలా ఆలస్యంగా జరిగినప్పటికీ ముఖ్యమైన రాజకీయ ప్రయోగంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఈ కూటమి గురించి చాలా రోజులుగా చర్చలు జరిగినప్పటికీ ఎన్నికల ముంగిటే అవి సాధ్యమయ్యాయి. ఈ ఆలస్యమే కొంత నష్టం చేసింది. ప్రచారంలో ఈ కూటమికి ప్రజాస్పందన బాగానే కనిపించినప్పటికీ ఆ మద్దతును ఓట్లుగా మార్చుకోగలిగేంత సమయం లభించలేదు. కూటమిలో ఓట్ల బదిలీ కూడా పూర్తిస్థాయిలో జరగలేదు. పాక్షికంగానే జరిగిన ఓట్ల బదిలీ కూటమిలో కాంగ్రెస్‌కు మాత్రమే ప్రయోజనం చేకూర్చిందని ఒక విశ్లేషకుడు అంచనా వేశారు. కాగా ముంబైలో ఫలితాలు అంచనాల కంటే భిన్నంగా ఉన్నాయని అంటున్నారు. బీజేపీ ఏకైక పెద్ద పార్టీగా ఆవిర్భవించినప్పటికీ ఆ పార్టీ ఆశించిన అఖండ విజయం మాత్రం దక్కని విషయాన్ని పలువురు అనలిస్టులు ప్రస్తావించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ కూటమి 150 సీట్లు దాటుతుందని భావించారు. కానీ దాని విజయ పరంపర 118 దగ్గరే ఆగిపోయింది. దానివల్ల మేయర్ కోసం తన కూటమి భాగస్వామిపై ఆధారపడాల్సి ఉంటుంది. కాగా క్షేత్రస్థాయిలో వనరులు తక్కువగా ఉన్నప్పటికీ శివసేన(యూబీటీ) అంచనాల కంటే చాలా మెరుగ్గా రాణించిందని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ప్రతిపక్షాల ఓట్లను చీల్చడంలో ఎంఐఎం కూడా కీలకపాత్ర పోషించింది. ఎంఐఎం పోటీ వల్ల ముంబైతో సహ అనేక చోట్ల కాంగ్రెస్ ఓట్లకు గండి పడింది. ఇది పరోక్షంగా బీజేపీ కూటమికి మేలు చేసిందంటున్నారు. పోటీ తీవ్రంగా ఉన్న వార్డుల్లో ప్రతిపక్ష ఓట్లు చీలిపోయి బీజేపీ లాభపడింది. ఈ ఎన్నికల్లో బీజేపీ సాధించిన దేవేంద్ర ఫడ్నవిస్‌కు మంచి మైలేజీ ఇచ్చాయి. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార వ్యూహాలు రచించడం, రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం ప్రచారం చేయడంలోనూ ఆయనే కీలకపాత్ర పోషించారు. మొత్తం మీద ఇవి కార్పొరేషన్ ఎన్నికలే అయినా రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణలకు తెరతీశాయి.










Comments