top of page

మనది ఐదు ట్రిలియన్ల బంగారు కొండ!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 7 hours ago
  • 3 min read

భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. రెండుమూడేళ్లలో జర్మనీని అధిగమించి మూడో ఆర్థికవ్యవస్థగా ఆవిర్భవిస్తుందని భావిస్తున్నారు. అందుకు తగినట్లే మన దేశీయ జీడీపీ కూడా నానాటికీ పెరుగుతున్నది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)కు చెందిన వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్‌కు చెందిన 2025 అక్టోబర్ రిపోర్టు ప్రకారం.. 2025-26 (మార్చి 2026తో ముగిసిన ఆర్థిక సంవత్సరం) సంవత్సరాంతానికి భారత జీడీపీ విలువ 4.125 ట్రిలియన్లుగా అంచనా వేసింది. జీడీపీ అనేది ఏడాదిలో దేశం ఉత్పత్తి చేసే వస్తువులు, సేవల విలువను సూచిస్తుంది. కానీ మరో విషయంలో భారత్ దీనికి మించిన ప్రగతిని నమోదు చేసింది. అదే మనదేశంలో ఉన్న బంగారం విలువ. మన భారతీయ ఇళ్లలో ఉన్న బంగారం విలువ ఐదు ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ. 452 లక్షల కోట్లు) దాటేసింది. అంటే మన పసిడి సంపద దేశ జీడీపీని దాటేసిందన్నమాట. మరోవైపు రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) కూడా భారీగానే బంగారం నిల్వ చేస్తోంది. ప్రజలతోపాటు రిజర్వ్ బ్యాంకు ఎందుకు బంగారం వైపే మొగ్గు చూపుతున్నారంటే దానికి పలు అంశాలను కారణంగా చెప్పాల్సి ఉంటుంది. ఒక అంచనా ప్రకారం భారతీయ కుటుంబాల వద్ద సుమారు 30వేల టన్నుల బంగారం ఉంది. దీనికి ప్రధాన కారణం.. భారతీయులకు బంగారం ఒక సెంటిమెంట్. దాంతో సంప్రదాయ ఆభరణాలు చేయించి అలంకరించుకోవడంతోపాటు ఆస్తిగా కూడా భావిస్తుంటారు. అలాంటి బంగారం విలువ ఇప్పుడు అంచనాలకు అందకుండా పోతున్నది. ప్రస్తుత ధరల ప్రకారం పరిశీలిస్తే పసిడి విలువ సుమారు ఐదు ట్రిలియన్ డాలర్లు. అంటే.. భారతీయ కరెన్సీలో సుమారు రూ. 452 లక్షల కోట్లు. బంగారం ధరలు పెరిగితే ఈ సంపద విలువ కూడా పెరుగుతుంటుంది. ఇటీవలి కాలంలో బంగారం ధరలు బాగా పెరగడం వల్ల దానికి అనుగుణంగా ఇళ్లలో ఉన్న బంగారం విలువ అమాంతం పెరిగిపోయింది. డాలర్, ప్రభుత్వ బాండ్లపై నమ్మకం తగ్గిపోవడం దీనికి ఒక కారణం కాగా.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక ఒత్తిళ్లు మరో కారణంగా నిలుస్తోంది. ఇక పెట్టుబడిదారులు, కేంద్ర బ్యాంకులు సైతం బంగారాన్ని మళ్లీ ఆర్థిక భద్రత సూచికగా భావిస్తున్నాయి. బంగారం దాచుకుంటే అత్యవసర సమయాల్లో ఆదుకుంటుందనే భావన ఎక్కువమందిలో ఉంటుంది. కానీ నిపుణులు మాత్రం ఇంట్లో దాచుకునే బంగారంతో నేరుగా ఆదాయం పొందలేమని అంటున్నారు. బిజినెస్ లేదా ఉద్యోగాల్లా ఆర్థిక వృద్ధిని సాధించలేమని చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో బంగారంపై ప్రజల అభిప్రాయం మారుతోంది. చాలామంది భారతీయులు ఇళ్లలో దాచిన బంగారాన్ని పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఈ బంగారం ఆర్థిక వ్యవస్థలోకి వచ్చి చేరుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గృహాల్లో దాచిన బంగారాన్ని క్రమంగా బ్యాంకింగ్, పెట్టుబడి మార్గాల్లోకి తీసుకురాగలిగితే దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతమిస్తుంది. గహస్తులకే కాకుండా రిజర్వ్ బ్యాంకుకు బంగారంపై మమకారం పెరిగింది. ప్రపంచమంతా ఆర్థిక అనిశ్చితిలో ఉండటంతో విదేశీ కేంద్ర బ్యాంకులు సైతం డాలర్‌పై పూర్తిగా ఆధారపడటం లేదు. తమ దేశాల్లో బంగారాన్ని భద్రంగా దాచుకుంటున్నాయి. బంగారం నిల్వలను క్రమంగా పెంచుకుంటున్నాయి. ఇతర దేశాల మాదిరిగా భారత్ కూడా బంగారంపై దృష్టిపెట్టింది. ప్రధానంగా రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కూడా బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నది. గత పదేళ్లలో ఆర్బీఐ వద్ద ఉన్న బంగారం పరిమాణం సుమారు 58 శాతం పెరిగింది. ఫలితంగా ప్రస్తుతం దేశ విదేశీ మారక నిల్వల్లో పసిడి వాటా 17శాతానికి పైగా పెరిగింది. బంగారాన్ని భద్రత కోసం ఒకేచోట పెట్టకుండా ఆస్తులుగా విడగొట్టి పలుచోట్ల పెట్టుబడిగా పెట్టడం వంటివి చేయాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం భారత్ వద్ద దాదాపు 880 టన్నుల వరకు బంగారం ఉంది. ఈ విషయంలో ప్రపంచంలో టాప్ దేశాల్లో ఒకటిగా భారత్ నిలిచింది. ప్రస్తుతానికి బంగారం విలువను అంతర్జాతీయ ధరల ప్రకారమే లెక్కిస్తున్నారు. ఫలితంగా రూపాయి విలువ తగ్గినా ప్రయోజనాలు వేరేగా ఉంటున్నాయి. ఇది కష్టకాలంలో దేశానికి ఆర్థిక స్థిరత్వం అందించగలదు. దేశీయ కరెన్సీపై నమ్మకాన్ని నిలబెట్టగలదు. ఇవన్నీ బంగారం నిల్వల వల్లే సాధ్యమంటే అతిశయోక్తి కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే గృహస్తులకే కాకుండా బంగారం దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా బీమాలాంటి భరోసా ఇస్తుందన్న మాట. ప్రస్తుత రోజుల్లో బంగారాన్ని చాలామంది లాభం కోసం కొనడం లేదు. కేవలం ఆర్థిక భద్రత కోసం కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఉంది. సెంట్రల్ బ్యాంకులు సైతం బంగారాన్ని కేవలం వడ్డీ రాబడి కోసమో దాచుకోవడం లేదు. బంగారం ఉంటే దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకునే సంపద. ఒకరిపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. మరోవైపు కరెన్సీ విలువ క్షీణించినప్పుడు భద్రత కవచంగా కూడా ఉపయోగపడే సంపదగా చెప్పొచ్చు. అందుకే డాలర్‌పై అతిగా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఆంక్షల భయం అక్కర్లేదు. కరెన్సీ అస్థిరత కారణంగా ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు ముందుజాగ్రత్తగా ప్రతి ఏడాది సుమారు వెయ్యి టన్నుల బంగారం కొనుగోలు చేస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నేటి ప్రపంచంలో బంగారాన్ని కేవలం వాణిజ్యంగా మాత్రమే కాకుండా బంగారు నిల్వలను కూడా వైవిధ్యంగా ఉంచాల్సి అవసరం ఉందని అంటున్నారు. చమురు ధరల మాదిరిగా బంగారం కూడా ఇప్పుడు ప్రపంచ అనిశ్చితిని కొలిచే సూచికగా మారుతోంది. భారతీయ గృహాలైనా లేదా రిజర్వ్ బ్యాంకు వంటి సెంట్రల్ బ్యాంకులకైనా ఈ పసిడి కేంద్ర బిందువుగా మారుతోంది. మరోవైపు గత కొన్నేళ్లుగా బంగారం పెట్టుబడి సాధనంగానూ వెలుగులు విరజిమ్ముతోంది. గోల్డ్ ఈటీఎఫ్‌లు, సావరిన్ బాండ్లు, డిజిటల్ గోల్డ్ అంటూ రకరకాల మార్గాల్లో బంగారంపై పెట్టుబడి పెట్టడం పెరిగింది. ఇవన్నీ బంగారం విలువను పెంచేస్తున్నాయి.



Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page