top of page

మనది కష్టాల పంట.. వారిది లాభాల బాట!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Jan 7
  • 3 min read
  • గోదావరి జిల్లాలకు తరలిపోతున్న ధాన్యం నిల్వలు

  • అక్కడ మిల్లింగ్‌ చేసి విదేశాలకు అమ్ముకునే ఎత్తుగడ

  • ప్రభుత్వ పెద్దల మంత్రాంగంతో స్థానిక రైతులకు అన్యాయం

  • ఫలించని జిల్లా అధికారులు, మిల్లర్ల అభ్యంతరాలు

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ధాన్యం అమ్మకాల్లో జిల్లా రైతులు అన్యాయమైపోతున్నారు. జిల్లాలో పండిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం ఆపని చేయకుండా ఇక్కడి నుంచి మిగులు ధాన్యాన్ని తక్కువ రేటుకు సేకరించి ఎక్కువ లాభాలకు అమ్ముకునే వెసులుబాటును ఇతర ప్రాంతాల మిల్లర్లు, వ్యాపారులకు కట్టబెట్టింది. పదేళ్ల క్రితం వరకు ఎఫ్‌సీఐ లెవీ సేకరణ పేరుతో ధాన్యం కొనుగోలు చేసేది. అప్పట్లో జిల్లాకు చెందిన మిల్లర్లు ఒడిశా, బెంగాల్‌ తదితర రాష్ట్రాల నుంచి ధాన్యం దిగుమతి చేసుకొని మరీ లెవీగా ఇచ్చేవారు. అయితే కేంద్రం ఆహార భద్రతా చట్టం అమల్లో తెచ్చిన తర్వాత ఎఫ్‌సీఐ లెవీ సేకరణ ప్రక్రియ నుంచి వైదొలగింది. పౌరసరఫరాల సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేసి ఎఫ్‌సీఐకి 25 శాతం బియ్యం సరఫరా చేయడం ప్రారంభించింది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం కొనుగోలు చేసే అవకాశం జిల్లా మిల్లర్లకు లేకుండా పోయింది. 2024`25లో కేంద్రం దేశీయ అవసరాలు, అంతర్జాతీయ మార్కెట్‌ డిమాండ్‌ల మధ్య సమతుల్యత పాటిస్తూ ఎగుమతి విధానాల్లో కొన్ని సడలింపులు ఇచ్చింది. వాటి ప్రకారం బాస్మతీయేతర బియ్యాన్ని నేపాల్‌, మలేషియా, ఫిలిప్పిన్స్‌, సీషెల్స్‌, కామెరూన్‌, ఐవరీకోస్ట్‌, గనియా దేశాలకు మాత్రమే ఎగుమతి చేసే అవకాశం వచ్చింది. దీన్ని క్యాష్‌ చేసుకోవడానికి తూర్పు, పశ్చిమగోదారి జిల్లాల బడా వ్యాపారులు శ్రీకాకుళం జిల్లా ధాన్యం కొనుగోలు చేయడం ప్రారంభించారు. దీనికి కూటమి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇప్పటికే జిల్లాలో 700 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని గోదావరి జిల్లాల వ్యాపారులు కొనుగోలు చేసి తీసుకెళ్లారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత జిల్లాలో ఇతర జిల్లాలకు చెందిన మిల్లర్లు అక్రమంగా ధాన్యం తరలించుకుపోవడాన్ని జిల్లా మిల్లర్లు వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలో పండిన ధాన్యాన్ని ఇక్కడే మిల్లింగ్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నామని మిల్లర్ల సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. అందుకు అవసరమైన బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వడానికి సిద్ధమని స్పష్టం చేస్తున్నారు.

ఇక్కడే మిల్లింగ్‌కు రెడీగా ఉన్నా..

జిల్లాలో ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం 3.6 లక్షల ఎకరాలు కాగా ఈ సీజన్‌లో ధాన్యం దిగుబడి 11 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉండవచ్చని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఆ ప్రకారం జిల్లాలో 6.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించి సీఎంఆర్‌ ద్వారా మిల్లింగ్‌ చేయాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. దానికి అనుగణంగా జిల్లాలోని 270 మిల్లుల యజమానులు 1:2కు బ్యాంకు గ్యారెంటీలు సమర్పించారు. 45 రోజులు వ్యవధిలోనే సుమారు 6 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం రైతుల నుంచి మిల్లర్లకు చేరింది. మరో 50 వేలు మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించి మిల్లర్లకు ఇస్తే సరిపోతుంది. కాగా ప్రభుత్వ అంచనా ప్రకారం జిల్లాలో ఉత్పత్తి అయిన 11 లక్షల టన్నుల ధాన్యంలో ఒక లక్ష మెట్రిక్‌ టన్నులను రైతుల సొంత అవసరాలకు ఉంచుకుంటారని వ్యవసాయశాఖ అంచనా వేస్తుంది. మిగిలిన 10 లక్షల మెట్రిక్‌ టన్నుల్లో ప్రభుత్వం 6.5 లక్షలు మెట్రిక్‌ టన్నులు సేకరిస్తుంది. ఇవి పోగా రైతుల వద్ద ఇంకా 3.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉంటుంది. దీన్నే జిల్లా నుంచి తరలించుకు పోయేందుకు ఇతర జిల్లాలవారికి కూటమి ప్రభుత్వ పెద్దలు అనుమతి ఇచ్చేశారని తెలిసింది. మొదట దీనికి జిల్లా అధికారులు అంగీకరించకపోయినా పౌరసరఫరాల సంస్థ రాష్ట్ర అధికారుల జోక్యంతో మౌనం వహించక తప్పలేదు. ఇప్పటికే దళారుల ద్వారా పాతపట్నం, ఆమదాలవలస తదితర ప్రాంతాల నుంచి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన మిల్లర్లు ధాన్యం తరలించుకుపోతున్నారని జిల్లాలో చర్చ సాగుతుంది.

తనిఖీల తర్వాతే మార్గం సుగమం

ధాన్యం సేకరణ పరిస్థితిని అంచనా వేయడానికి రెండు రోజుల క్రితం పౌరసరఫరాలశాఖ మంత్రి జిల్లాలో పర్యటించి కొన్ని మిల్లులను తనిఖీ చేశారు. సామర్ధ్యానికి మించి ట్రక్కు షీట్‌లు జనరేట్‌ చేసి కొన్ని మిల్లులు ధాన్యం తరలించడం వంటి లోపాలను గుర్తించారు. అయితే ఇది సాధారణ ప్రక్రియలో భాగమేనని మిల్లర్లు చెబుతున్నారు. గత ఏడాది మిల్లింగ్‌ చేసిన టార్గెట్‌ మేరకు ఈ ఏడాది ట్రక్కుషీట్‌లు జనరేట్‌ చేసి ధాన్యం సరఫరా చేసినట్టు అధికారులు చెబుతున్నారు. మంత్రి పర్యటన తర్వాత రైతుల వద్ద ఉన్న ధాన్యం ఇతర జిల్లాలకు తరలించడానికి మార్గం సుగమం చేశారన్న భావన మిల్లర్లలో కలిగింది. మిల్లర్ల సంఘం నాయకులు మౌనంగా ఉన్నా కొందరు మిల్లర్లు మాత్రం ప్రభుత్వ చర్యలను తప్పుపడుతున్నారు. 40 రోజుల వ్యవధిలోనే జిల్లాలో ఆరు లక్షలు మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించి మిల్లింగ్‌ ప్రారంభించినట్టు చెబుతున్నారు. మరో వారం రోజుల్లో మిగతా 50వేల టన్నులు ధాన్యం సేకరిస్తే టార్గెట్‌ పూర్తవుతుందని అంటున్నారు. అయితే శ్రీకాకుళం డివిజన్‌లోని పలు మండలాల్లో ఇప్పటికీ నూర్పులు పూర్తి కాలేదు. వరి తర్వాత వేసే అపరాల పంట కోతకు వచ్చిన తర్వాత పొలాల్లో పెట్టిన వరి కుప్పలను నూర్చడం ఆనవాయితీ. వ్యవసాయ అధికారుల అంచనా ప్రకారం సుమారు 3.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఇప్పటికే రైతుల వద్ద ఉంది. దీన్ని ప్రభుత్వం సేకరించి మిల్లింగ్‌కు ఇవ్వాలని మిల్లర్లు కోరారని తెలిసింది. దీనివల్ల జిల్లాలో ఫుడ్‌ ప్రొసెసింగ్‌ ఇండస్ట్రీకి ఉపాధి లభిస్తుంది. కానీ ప్రభుత్వ పెద్దలు మాత్రం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన మిల్లర్లకు జిల్లాలోని ధాన్యాన్ని తరలించుకోవడానికి అవకాశం ఇచ్చినట్టు తెలిసింది. దీన్ని అటు నుంచి విదేశాలకు ఎగుమతి చేసుకోవడానికి పైస్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page