మరీ ఇలా దొరికిపోయారేంటి చీప్‌గా
- SATYAM DAILY
- Aug 14
- 3 min read
ఆంధ్రాలో ఓట్‌చోరీ అంటూ రాహుల్ ఎందుకు మాట్లాడాలి?
ఎన్నికల తర్వాత సమీక్షలో ఈవీఎంపై మాట్లాడిరది మీరే కదా
చంద్రబాబు`రాహుల్ బంధం ఎలా కుదురుతుంది

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
దేశంలో అన్ని రాష్ట్రాల్లో కంటే ఏపీలోనే ఎక్కువ ఎన్నికల అక్రమాలు జరిగాయని, కానీ రాహుల్‌గాంధీ ఏపీ గురించి ఏమీ మాట్లాడటం లేదని, చంద్రబాబుతో చేతులు కలపడం వల్లనే ఏపీ ఎన్నికల అక్రమాల గురించి మాట్లాడటం లేదని జగన్ అన్నారు. ఈ మధ్య కాలంలో ఇంత పస లేని, హాస్యాస్పద, అపరిపక్వ రాజకీయ వ్యాఖ్య దేశంలోనే ఎవరూ చేసుండరు.
ఏపీ గురించి మీరు సైలెంట్‌గా వుంటే రాహుల్ అక్కడి ఎన్నికల అక్రమాల గురించి కత్తి తిప్పాలా? అసలు నిజానికి రాహుల్ దేశం మొత్తం ఎన్నికల గురించి మాట్లాడలేదు. 2024లో వివిధ రాష్ట్రాలలో ఎదురైన ప్రతికూల ఎన్నికల ఫలితాలను దృష్టిలో వుంచుకొని గెలుస్తామని బాగా నమ్మకం వుండి ఓడిపోయిన కర్నాటకలోని ఒక్క పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒకే ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్‌లో చోటు చేసుకున్న ఐదు రకాల ఇర్రెగ్యులారిటీస్ గురించి మాట్లాడాడు. రాహుల్ చూపించింది కేవలం ఓ ఉడికిన అన్నం మెతుకు. ఆయన ఒక్క మహదేవ్‌పూర్ అసెంబ్లీ సెగ్మెంట్‌ని మాత్రమే కవర్ చేశాడు. ఏ మాత్రం కనీస తర్కం, మౌలిక అవగాహన లేకుండా అసలు అలా ఎలా ఏపీ గురించి ఏమీ చెప్పలేదని వ్యాఖ్యానించగలడు? అది జగన్‌కే సాధ్యం.
ఆయన పలికిన మరో ఆణిముత్యం ఏమిటంటే రాహుల్, చంద్రబాబు మధ్య ఏదో ఒప్పందం వుందన్నాడు. ఇది మరీ పీక్స్. టీడీపీ రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ఎన్డీయే కూటమిలో వుంది. వాళ్లూ వాళ్లూ బానే వున్నారు. ఒక రాజకీయ ప్రత్యర్ధిగా ఈయనకది ఇష్టం లేకపోవడం సహజమే. తప్పేం లేదు. కానీ మోడీకి వ్యతిరేకంగా బాబు రాహుల్‌తో చేతులు కలుపుతాడని అనడం ద్వారా ప్రజల దృష్టిలో పలుచనే అవుతాడాయన. ఏమాత్రం కన్విన్సింగ్‌గా లేని వ్యాఖ్య ఇది. గతంలో మోడీని విభేదించినప్పుడు బహిరంగంగానే రాహుల్ చెంతకు చంద్రబాబు చేరిన విషయం అందరికీ తెలుసు. కాకపోతే ఇప్పుడు మోడీని కాదని బాబు అటువైపు వెళ్లలేరనేది కూడా అందరికీ అర్థమయ్యేది.
పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలే చంద్రబాబుకి చివరి ఎన్నికలు కాబట్టి, ఈ శేష జీవితం కృష్ణా రామా అనుకుంటూ కూర్చోవాలని కూడా జగన్ సెలవిచ్చారు. 2029 ఎన్నికల వరకు చంద్రబాబు జీవించి వుండకూడదనే బలమైన కోరిక ఏదో మనసులో వుంటే మాత్రం అలా బైటపడితే ఎలా జగన్ గారూ? అస్సలు బాలేదు.
మామూలుగా అయితే పొలిటికల్ పార్టీస్, వాటి కేడర్స్ ఒకరినొకరు దూషించుకోవడం పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఏపీలో రాజకీయాలు తమ హుందాతనాన్ని ఎప్పుడో కోల్పోయాయి. కానీ పార్టీల అధినేతలు ఎవరైతే వున్నారో వాళ్లు బాధ్యతగా, డీసెంట్‌గా వుండాలని ఆశించడంలో తప్పులేదు.
ప్రత్యేక హోదా ఇవ్వనివాడు మోడీ అయితే ఇక్కడ మనవాళ్లు ముగ్గురు మోడీని మాట వరుసకు కూడా పేరెత్తకుండా ఒకరినొకరు దెప్పిపొడుచుకుంటారు. విశాఖ ఉక్కు ప్రైవేటు పరం చేయబోయింది మోడీ అయితే మళ్లీ ఇక్కడ ఆయన్నేమీ అనకుండా ముగ్గురూ ఒకరినొకరు తిట్టుకునేవారు. రాజధాని నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటానికీ ఆయన నిధులివ్వకపోతే వీళ్లలో వీళ్లు వీధి కుళాయి కయ్యాలాడుకుంటారు. అదే పద్ధతిలో దొంగఓట్లపై రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో ఎన్నికల కమిషన్ మీద దాన్ని నడిపించిన ప్రభుత్వంపై పోరాటం చేస్తుంటే.. ఇక్కడ మనవాళ్లు ఎప్పటిలానే బాధ్యుల్ని వదిలేసి వాళ్లను ఎత్తిచూపిన రాహుల్ గాంధీపై పడుతున్నారు. రెండు రోజులు ఆగి జగన్ కూడా మూడోరోజు ముసుగు తొలగించేసుకున్నారు. అసలు తెలుగోడు అనే పదంలోనే ఈ అవలక్షణాలు అన్నీ నిక్షిప్తమై ఉన్నాయేమో..?!
కులగజ్జి వల్ల కొంతమంది, ఆ నాయకుడు నచ్చక ఇటువైపునకు, ఈ నాయకుడు నచ్చక అటువైపునకు ఘనీభవించేసి అసలు విషయం పట్ల అపసవ్యత వైపు నిలబడిపోతున్నారు. ఎంత జుగుప్సాకరంగా, ఎదురుగా తేలిపోతున్నప్పటికీ కూడా మా వాడు కట్టుకున్నవి దేవతా వస్త్రాలు కావు, పట్టు వస్త్రాలేననే బుకాయింపొకటి.
అదేదో సినిమాలో రావు గోపాలరావు అన్నట్టు సపోజ్, పర్ సప్పోజ్ ఆంధ్రలో దొంగఓట్లు వేయించుకుని గెలిచారే చూడు. అదే నిజమనుకుందాం. అది ఎవరు చేయించి ఉండాలి? కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఎవరికోసం చేయించింది? చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి.
ఆ తప్పులో కాంగ్రెస్‌కు గాని, రాహుల్ గాంధీకి గాని ఎంత మాత్రం పాత్ర లేదుగా! దానివల్ల లబ్ధి పొందిందెవరు? చంద్రబాబు. లబ్ధి చేకూర్చింది ఎవరు.. మోడీ. జగన్ అనదల్చుకుంటే, నిజంగా ఆయన అభిమానులు ఆయన్నేదో అంటుంటారు అదంతా నిజం అయితే ఆయన ఆరోపించాల్సింది ఎవరిని? నరేంద్ర మోడీని. కానీ అంటున్నది ఎవరిని? రాహుల్ గాంధీని. తేలిపోలేదూ? జగన్ నుంచి విజయాన్ని దొంగలించారని అంటూ ఆ దొంగ పేరు ఎత్తలేకపోతున్నారంటే, సింగిల్ సింహం, పులివెందుల పులి లాంటి భుజకీర్తులు తగిలించి మాట్లాడుతున్నారు అంటే.. అదంతా అబద్ధమని ఒప్పుకోవాలి. చంద్రబాబుతో చేరి మోడీ ఆంధ్ర రాష్ట్రంలోని ఈవీఎంలను మార్చేసి అక్క చెల్లెళ్లు, అన్నా తమ్ములు, అవ్వతాతలు ఇంకా కోట్లాదిగా నీకు వేసిన ఓట్లను దాచేసి నిన్ను అన్యాయంగా ఓడిరచారని, దీనంతటికీ మోడీయే కారణమని, ఎన్నికల కమిషన్‌ను ఆయన ఇలా భ్రష్టు పట్టించారని ఒక్క మాటైనా అనాలి. అలా అనటమే కాకుండా కాదనడానికి వీల్లేని సాక్ష్యాధారాలను ప్రెస్‌మీట్ పెట్టి, వివరించి చెప్పి, వాళ్లు అడిగే ప్రశ్నలను సూటిగా తిప్పికొట్టాలి. జగన్ మాటల్లో పసవుంటే అర్థం చేసుకున్న వాళ్లు అందరూ ఆయన వెనుక వచ్చి నిలబడతారు.
నిన్నటిదాకా సింగిల్ సింహం, మడమ తిప్పనితనం అంటూ కబుర్లు చెప్పి ఇప్పుడు ఎవరో రాహుల్ గాంధీ రాలేదు, నా మాట ఎత్తలేదు ఇలాంటి బేలతనపు మాటలు చెల్లవ్. మీ యుద్ధం మీరు చేసుకోండి. దానికి ఇతరుల సాయం దేనికి? అందునా మీ ప్రత్యర్థుల సాయం కోరడం ఏంటి? బొత్తిగా చిరాగ్గా ఉండటమే కాకుండా చిన్నతనంగా కూడా లేదూ? కిరణ్ కుమార్ రెడ్డి స్థాయికి దిగజారకూడదని జగన్ తెలుసుకోవాలి.
Comments