మరో ముగ్గురు సీఐలకు పొగ?
- Prasad Satyam
- Sep 20, 2025
- 2 min read

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జిల్లాలో పోలీస్ శాఖలో పని చేస్తున్న ముగ్గురు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లకు బదిలీ లేదా వీఆర్ పొగ కమ్మేయనుంది. శనివారం ఎస్పీ ఆధ్వర్యంలో జరిగే క్రైమ్ మీటింగ్‌లో ఈమేరకు సంకేతాలు అందినట్లు తెలుస్తుంది. శనివారం ఉదయం 10 గంటల సమయానికే జిల్లాలో ఉన్న సీఐలు, డీఎస్పీలు అన్ని వివరాలతో క్రైమ్ మీటింగ్‌కు హాజరుకావాలని శుక్రవారం రాత్రి సమాచారం అందింది. కాశీబుగ్గ డీఎస్పీతో పాటు డీపీటీసీలో పని చేస్తున్న మరో డీఎస్పీని కూడా రాత్రికి రాత్రే వీఆర్‌లోకి పంపిన తర్వాత శనివారం జరుగుతున్న అత్యవసర క్రైమ్ మీటింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందులో ముగ్గురు సీఐలకు బదిలీ తప్పదని తెలుస్తుంది. ఎస్పీ మహేశ్వరర్‌రెడ్డి బదిలీపై వెళ్లిపోవాలని ఇక్కడ పోలీస్ సిబ్బంది ఎంతలా కోరుకున్నారో, ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి కూడా తనకు బదిలీ అవుతుందో లేదో తెలుసుకొని కొందరిపై చర్యలకు ఉపక్రమించాలని ఇంతవరకు వేచిచూశారు. అందరి నిరీక్షణలు ముగిసిన తర్వాత ఇప్పుడు వేట మొదలైంది. కాశీబుగ్గ డీఎస్పీ ఎందుకు వీఆర్‌లోకి వెళ్లారన్న విషయం ప్రస్తుతానికి పక్కన పెడితే, జిల్లాలో మరో ముగ్గురు సీఐలు వీఆర్‌లోకి వెళ్లిపోనున్నట్లు తెలుస్తుంది. శ్రీకాకుళం టూటౌన్ సీఐ ఈశ్వరరావుపై ఎస్పీ ఎప్పట్నుంచో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన గత ఏడాది నవంబరులో ఏఆర్ నుంచి లా అండ్ ఆర్డర్‌కు వస్తూ టూటౌన్ సీఐగా బాధ్యతలు తీసుకున్నారు. అప్పట్నుంచి ప్రతీ క్రైమ్ మీటింగ్‌లోనూ ఎస్పీ ఆయన పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తునే ఉన్నారు. ఆర్మ్‌డ్ రిజర్వ్ నుంచి రావడం వల్ల ఆయనకు లా అండ్ ఆర్డర్ వ్యవహారాలు కొత్త. దీంతో టూటౌన్ పరిధిలో క్రైమ్ రేట్ పెరగడం, పెండిరగ్ కేసులు కుప్పలు తెప్పలుగా ఉండటంతో ఎస్పీ ఇప్పటికి ఆరుసార్లు ఛార్జిమెమో జారీ చేశారు. అలాగే లోక్‌అదాలత్‌లో రాజీ పడాల్సిన కేసులు ఒక్క టూటౌన్ పరిధిలోనే 160 పైచిలుకు ఉండగా, కేవలం 10 కేసులు మాత్రమే అదాలత్‌లో పెట్టారని, దానికి కూడా విపరీతమైన ఫాలోఅప్ చేయాల్సివచ్చిందంటూ ఎస్పీ తాజాగా మరో ఛార్జిమెమో ఇచ్చారు. దీంతో ఈశ్వరరావుకు బదిలీ లేదా వీఆర్‌కు పంపడం తప్పదని తెలుస్తుంది. అలాగే సీసీఎస్ డీఎస్పీ చంద్రమౌళిపై కూడా అనేక ఫిర్యాదులు ఉన్నాయి. ఎస్పీ నియమించిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందాలు ఎక్కడికక్కడ నేరస్తులను పట్టుకొని సీసీఎస్‌కు అప్పగిస్తున్నా, ఆ కేసులు నీరుగారిపోతున్నాయని ఎస్పీ భావిస్తున్నారు. అలాగే ఈయన మీద అనేక ఫిర్యాదులు కూడా ఎస్పీ వద్ద ఉన్నాయి. కాబట్టి బదిలీ తప్పదని తెలుస్తుంది. ఇది కాకుండా మరో సీఐని కూడా బదిలీ చేస్తారని, ఇంతకు క్రితమే ఈయనపై డీఐజీకి నివేదిక పంపారని తెలుస్తుంది. ఇదిలా ఉండగా వినాయక నవరాత్రుల సందర్భంగా జిల్లాలో 30 చోట్ల ఘర్షణలు జరిగాయని ఎస్పీ మహేశ్వర్‌రెడ్డికి స్పెషల్ బ్రాంచ్ నివేదించింది. కానీ జిల్లాలో అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో కలిపి 15 కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో ఎస్బీ చెప్పింది వాస్తవమా? పోలీస్‌స్టేషన్‌లో నమోదైన సంఖ్యమాత్రమే నిజమా? తేల్చుకోవడం కోసం ఎస్పీ డీఎస్పీని కూడా ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి మహేశ్వర్‌రెడ్డికి బదిలీ కాకపోవడంతో జిల్లాలో సొంత శాఖలో ప్రక్షాళన మొదలైంది. కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావుకు ఆర్థికంగా, రాజకీయంగా బలమైన బ్యాక్‌గ్రౌండ్ ఉంది. అటువంటిది ఆయన్నే మూడో కంటికి తెలియకుండా రాత్రికి రాత్రి వీఆర్‌కు పంపారంటే.. తామంతా తట్టాబుట్టా సర్దుకోవడం బెటరనే భావనలో ఇక్కడ చాలామంది ఉన్నారు.










Comments