మరో మూడు రోజులు మంచినీటికి కటకటే!
- Prasad Satyam
- Dec 29, 2025
- 1 min read

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్లకు మంచినీటి సరఫరాకు మరో మూడు రోజులు ఇబ్బందులు తప్పవని కార్యాలయ ఇంజినీరింగ్ వర్గాలు పరోక్షంగా చెబుతున్నాయి. ఇంతవరకు ఎక్కడైనా రిపేరు వర్కులుంటే ఫలానా రోజు వరకు నీరు ఇవ్వలేమంటూ కార్యాలయ వర్గాలు ప్రకటించేవి. అటువంటిదేమీ లేకుండానే గడిచిన నాలుగు రోజులుగా నగరంలో అనేక ప్రాంతాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. కొన్నిచోట్ల రోజువిడిచి రోజు కుళాయిలు వస్తున్నాయంటే.. అందుకు కారణం ఖాజీపేటలో ఉన్న పాత వాటర్‌వర్క్స్ సరఫరా చేస్తుండటమే. అకస్మాత్తుగా నగరంలో నీటికొరతకు కారణం ఆదివారంపేట మెయిన్ పంప్‌హౌస్ వద్ద మూడు మోటార్లు కాలిపోయాయి. హైవోల్టేజ్ రావడంతో 75 హార్స్‌పవర్ కెపాసిటీ ఉన్న మూడు మోటార్లకు వైండిరగ్ కాలిపోవడంతో పంపింగ్ ఆగిపోయింది. దీంతో నగరంలో కుళాయిలకు నీటి సరఫరా నిలిచిపోయింది. ఆదివారంపేట వద్ద ఆరు మోటార్లతో నీటిని పంప్ చేయాల్సివుండగా, అందులో మూడు మోటార్లు కాలిపోయాయి. వాస్తవానికి శ్రీకాకుళానికి నీటిని అందించే కేపాసిటీని బట్టి మొదట్నుంచి టు ప్లస్ టు పద్ధతిలోనే మోటార్లను వాడుతున్నారు. అందులో కొన్ని కాలిపోవడం వల్ల ప్రస్తుతం రెండు మోటార్లు నడుస్తున్నాయి. దీనితోనే ఇన్‌ఫిల్టరేషన్ బావుల నుంచి నీటిని తోడి కలక్షన్ ట్యాంక్‌లో నీటిని వేయడం, అక్కడ్నుంచి ఏఎస్‌ఎన్ కాలనీలో ఉన్న బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీటిని పంపడం వంటి ప్రక్రియలు ఆగిపోయాయి. కనీసం రెండు మోటార్లయినా పని చేయడం వల్ల రోజు విడిచి రోజైనా కొన్ని ప్రాంతాలకైనా తాగునీరు అందుతుంది. ఏఎస్‌ఎన్ కాలనీలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిండిన తర్వాత నగరంలో పలుచోట్ల ఉన్న సర్వీస్ రిజర్వాయర్లకు నీరు వెళ్తుంది. అయితే ఇప్పుడు పంపింగే లేకపోవడం వల్ల సర్వీస్ రిజర్వాయర్లన్నీ ఖాళీ అయిపోయాయి. ప్రస్తుతం కాలిపోయిన మోటార్లకు వైండిరగ్ చేయిస్తున్నారు. మరోవైపు కొత్త మోటార్లకు ఆర్డర్ పెట్టారు. ఇవన్నీ పంప్‌హౌస్‌కు చేరుకొని రన్నింగ్‌లోకి రావాలంటే మరో మూడు పట్టేట్టు ఉందని వారే ఆఫ్ ది రికార్డ్‌గా చెబుతున్నారు. అన్నింటికీ మించి ఆదివారంపేట పంప్‌హౌస్‌లో మోటార్లు నడవడానికి వీలుగా ప్రత్యేకమైన ట్రాన్స్‌ఫార్మర్ లేదు. ఆదివారంపేట వద్ద ఉన్న హెచ్‌టీ లైన్‌కు దీన్ని కనెక్ట్ చేయడం వల్ల నిరంతరాయంగా విద్యుత్ అయితే సరఫరా అవుతోంది కానీ, ఓల్టేజీలో హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు మాత్రం ఇలాగే మోటార్లు కాలిపోతుంటాయి. 75 హెచ్‌పీ మోటార్లు ఒకసారి కాలిపోతే ఉన్నఫలంగా బయట మార్కెట్‌లో కొని బిగించే వెసులుబాటు ఉండదు. కాబట్టి ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసుకోవడంపై కార్పొరేషన్ దృష్టి సారిస్తే బాగుంటుంది.










Comments