top of page

మరో రాయబారి వచ్చె! ఈయన అదే సమాధానమిచ్చె

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • May 24
  • 2 min read
  • ధర్మానను కలిసిన కుంభా రవిబాబు

  • 2009 నాటి వాతావరణంపై చర్చ

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

మాజీమంత్రి, వైకాపా సీనియర్‌ నాయకుడు ధర్మాన ప్రసాదరావు వద్దకు వైకాపా పార్లమెంటరీ పరిశీలకుడు, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు శుక్రవారం వచ్చారు. జిల్లాలో పార్టీ సమన్వయ సమావేశం నిర్వహించడానికి వచ్చిన రవిబాబు ధర్మాన ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జిల్లాలో వైకాపాను చురుగ్గా ముందుండి నడపాల్సిన ఆవశ్యకతను ఆయనకు వివరించారు. ఎప్పటిలాగే రెండేళ్ల వరకు తాను యాక్టివ్‌ పాలిటిక్స్‌ చేయలేనని, ఆ తర్వాత తన నిర్ణయం చెబుతానంటూ సూటిగా సమాధానమిచ్చినట్లు తెలుస్తుంది. ఇంతకు క్రితమే ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జిగా పని చేసిన విజయసాయిరెడ్డి ఒకసారి, జిల్లా ఇన్‌ఛార్జిగా వ్యవహరించిన కురసాల కన్నబాబు మరోసారి ధర్మానను కలిసి వైకాపాను బలోపేతం చేయాల్సి ఉందని జగన్మోహన్‌రెడ్డి మాటగా చెప్పినప్పుడు కూడా ధర్మాన ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఇప్పుడు తాజాగా కుంభా రవిబాబు కూడా జిల్లాలో వైకాపాకు అనుకూలంగా వాతావరణం ఉందని, ధర్మాన బలమందిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేయగా, రెండేళ్ల వరకు రోడ్డెక్కే రాజకీయాలు చేయలేనని ఆయన స్పష్టం చేశారట. 2019లో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ధర్మానను మంత్రివర్గంలోకి తీసుకోలేదు. ఆ తర్వాత రెండున్నరేళ్లకు ఆయన సోదరుడు కృష్ణదాస్‌ను తొలగించి, ఈయనకు రెవెన్యూమంత్రి పదవి ఇచ్చినా, పార్టీలోను, కేబినెట్‌లోనూ సముచిత స్థానం ఇవ్వలేదన్న భావన ఆయన అభిమానుల్లో ఉంది. మంత్రి పదవి ఇచ్చినా గౌరవం మాత్రం దక్కలేదన్న అభిప్రాయమైతే ధర్మానకు ఉంది. జగన్మోహన్‌రెడ్డి స్టైల్‌కు ధర్మాన ఇమడలేకపోయారు. ఉమ్మడి రాష్ట్రంలో రెవెన్యూమంత్రిగా పని చేసి, స్వయంగా రాజశేఖరరెడ్డి, రోశయ్య లాంటి సీనియర్ల మన్ననలు పొంది కిరణ్‌కుమార్‌ రెడ్డి లాంటి జగన్‌ వ్యతిరేక శక్తులు కూడా కాదనలేని వ్యక్తిత్వంతో రాజకీయాలు నడిపిన ధర్మాన వైకాపా అధికారంలోకి వచ్చేసరికి ప్రతిపక్షంలో ఉన్నప్పటి కంటే బలహీనపడిపోయారు. పార్టీతో సంబంధం లేనివారిని అడిగి జగన్మోహన్‌రెడ్డి అపాయింట్‌మెంట్‌ కోరడం, ఆయన్ను కలవాలంటే పదెంచెలు దాటాల్సి రావడం వంటి వ్యవహారాల పట్ల కినుక వహించారు. వీటన్నిటితో పాటు జిల్లాపై తన ప్రభావం లేకుండా చూసేందుకు పార్టీ ప్రయత్నించిందన్న భావన ఆయనలో ఉంది. అందుకే 2024లో పార్టీ ఓటమి తర్వాత ఆయన అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్‌ వచ్చినప్పుడు కూడా ధర్మాన నేరుగా వెళ్లి ఆయన్ను కలవాలనుకోలేదు. అందుకే ఆయన తనయుడు రామ్‌మనోహర్‌నాయుడు కేడరంతా జగన్‌ దగ్గరకు వెళ్లడానికి సమాయత్తం కావాలని మీడియా ముఖంగా పిలుపునిచ్చారు. కానీ చివరి నిమిషంలో ధర్మాన మనసును మార్చిన ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు పాలకొండలో జగన్‌తో భేటీ అయ్యేలా చేశారు. వాస్తవానికి అప్పట్నుంచే పరిస్థితిలో మార్పు కూడా కనిపించింది. ధర్మాన ఆరోగ్యం కోసం మాత్రమే ఆరా తీసి వదిలేసిన జగన్మోహన్‌రెడ్డి ఆ తర్వాత ధర్మాన ఈ జిల్లాకు ఎందుకు అవసరమో ఆరా తీయడం ప్రారంభించారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన విజయసాయిరెడ్డిని అడిగినా, పక్క జిల్లాలో ఉన్న బొత్స సత్యనారాయణను అడిగినా, పరిశీలకులుగా వచ్చిన ఎవర్ని అడిగినా ధర్మాన లేని వైకాపా కోసం పాజిటివ్‌గా చెప్పకపోవడంతో ఆయన పార్టీలో ఇన్‌యాక్టివ్‌గా ఉన్నా, పార్టీ మాత్రం ఆయన వెంటే ఉంటామన్న సంకేతాన్ని పంపిస్తుంది. అందులో భాగమే తాజాగా కుంభా రవిబాబు రావడం. జిల్లాలో ప్రస్తుత పరిస్థితులు ధర్మానకు అనుకూలంగా ఉన్నా, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదన్న పద్ధతిని ఆయన అవలంభిస్తున్నారు. ప్రభుత్వం వచ్చి ఏడాదే కావడం వల్ల మరికొంత కాలం వేచిచూసే ధోరణే బెటరన్న ఆలోచన ధర్మానది. జిల్లాలో వైకాపా శ్రేణులకు వచ్చిన నష్టం, కష్టం ఏమీ లేదని, కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాలంటే మాత్రం మరికొంత సమయమివ్వాలన్న భావన ధర్మానకు ఉంది.

2004లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి హవాతో అధికారంలోకి వచ్చినా, 2009లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును పీఆర్పీ ద్వారా చీల్చడం, కాంగ్రెస్‌ అభ్యర్థులను గుర్తించి బలోపేతం చేయడం వంటి అంశాల్లో రాజశేఖరరెడ్డి ధర్మానకే ఫ్రీహ్యాండ్‌ ఇచ్చారు. అందుకే రాజశేఖరరెడ్డి సొంత జిల్లా కడప మాదిరిగానే పదింటికి తొమ్మిది సీట్లు ఇక్కడ కాంగ్రెస్‌ గెలుచుకోగలిగింది. ఇప్పుడు మళ్లీ అదే వాతావరణం రావాలంటే ధర్మాన ప్రసాదరావుకు మళ్లీ అంతే స్థాయి స్వేచ్ఛ ఇవ్వాలన్న ప్రతిపాదన ఒకటి అధిష్టానానికి వెళ్లినట్టు భోగట్టా. ధర్మాన కృష్ణదాస్‌ జిల్లా పార్టీ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నా, అందుకు కర్త, కర్మ, క్రియ మాత్రం ధర్మానేనని పార్టీ భావిస్తుంది. ఒకానొక సందర్భంలో జిల్లా పార్టీ అధ్యక్షుడ్ని మార్చాలన్న ప్రతిపాదన వచ్చినప్పటికీ పదవి లేకుండా అన్న, పదవి తీసుకోకుండా తమ్ముడు ఇద్దరూ బయట ఉంటే, వైకాపా తరఫున తప్పుడు సంకేతాలు వెళ్తాయని పార్టీ భావించి, ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. ఆ తర్వాత పరిణామాలు ధర్మానకు అనుకూలంగానే జరుగుతూ వస్తున్నాయి. ఆమదాలవలసలో చింతాడ రవిని ఇన్‌ఛార్జిగా నియమించడం, టెక్కలి ఇన్‌ఛార్జిగా తిలక్‌ను ఉంచడంతో పాటు దువ్వాడ శ్రీనును పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడం వంటివి ధర్మానకు స్వాంతన చేకూర్చే చర్యలే. అయితే ఇంకా రెండు నియోజకవర్గాలకు సంబంధించే ధర్మానకు, పార్టీకి మధ్య పీఠముడి వీడాల్సి ఉంది. ఇచ్ఛాపురంలో రెడ్డిక సామాజికవర్గానికి ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇవ్వాలని ఎప్పటినుంచో ధర్మాన కోరుతున్నారు. అలాగే పాతపట్నం నుంచి మామిడి శ్రీకాంత్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్నది ధర్మాన కోరిక. అయితే ఈ రెండు అసెంబ్లీ సెగ్మెంట్ల పైనే జగన్మోహన్‌రెడ్డి కూడా పట్టుగా ఉన్నారు. ఏం జరుగుతుందో వేచిచూడాలి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page