మళ్లీ తెరపైకి నియోజకవర్గాల పునర్విభజన
- DV RAMANA

- Jun 23, 2025
- 2 min read

దాదాపు 14 ఏళ్ల తర్వాత దేశంలో జనగణనకు కేంద్ర ముహూర్తం నిర్ణయించగా, సెన్సస్ రిజి స్ట్రార్ జనరల్ దానికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయడంతో రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజనపై రాజకీయ పార్టీల్లో ఆశల మోసులు వేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ లోనూ దీనిపైనే చర్చలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో అమల్లోకి వచ్చిన ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం 2019 ఎన్నికల నాటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్వభజన జరిపి కొత్త నియోజకవర్గాల్లో సాధారణ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కానీ ఆ ప్రక్రియ జరగలేదు. కొత్త జనాభా లెక్కలు సేకరించిన తర్వాతే.. ఆ గణాంకాల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ కరోనా మహమ్మారి కారణంగా 2021లో జరగాల్సిన జనగణనను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. ఐదేళ్ల తర్వాత 2026లో ఆ ప్రక్రియ చేపట్టేందుకు సిద్ధమైంది. కానీ దీనికి భిన్నంగా జమ్మూ కశ్మీర్ విభజన అనంతరం అక్కడ నియోజకవర్గాలను పునర్విభజించడాన్ని ప్రస్తావిస్తూ తెలుగు రాష్ట్రా ల్లోనూ అదే రీతిలో నియోజకవర్గాలను విభజించాలని కోరుతూ జర్నలిస్టు పురుషోత్తం రెడ్డి సుప్రీం కోర్టులో కేసు వేశారు. అయితే జనాభా లెక్కలు తేలిన తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన చేపడతా మని సుప్రీంకోర్టుకు కేంద్రం తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఇది విచారణ దిశలో ఉంది. ఈ తరుణంలో జనగణనకు కేంద్రం గజెట్ జారీ చేసింది. జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా ఈసారి చేపడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన తో పాటు రిజర్వేషన్లను కూడా మార్చేందుకు అవకాశం లభిస్తుంది. ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాలను 225కు, తెలంగాణలో నియోజకవర్గాలను 119 నుంచి 134కు పెంచాల్సి ఉంది. కొత్త జనాభా గణాంకాల ఆధారంగా ఆ మేరకు పెంచేందుకు మార్గం సుగమం అవుతుంది. అదే సమయంలో కులగణన జరుగుతున్నందున సామాజికవర్గాలవారీగా, అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు ఆమో దించినందున మహిళలకు నియోజకవర్గాలు రిజర్వ్ చేసేందుకు మార్గం సుగమమైనట్లే. వీటి ఆధారం గానే 2029 సార్వత్రిక ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే వచ్చే ఎన్నికలనాటికి రాష్ట్రంలో మరో 50 కొత్త నియోజకవర్గాలు ఏర్పాటవుతాయి. ఆ మేరకు రాజకీయ పార్టీలకు తమ అభ్యర్థులుగా ఎక్కువమందికి అవకాశం కల్పించే వెసులుబాటు లభిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి వచ్చే ఎన్నికల్లోనూ కూటమిగానే పోటీ చేయదలిస్తే కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు సులభతరం అవుతుందంటున్నారు. కూటమి పార్టీలో ఈ పరిణామం జోష్ నింపుతుండగా ప్రధాన ప్రతిపక్షమైన వైకాపా మాత్రం మౌనంగా ఉండిపోయింది. గతంలో నియోజకవర్గాల పునర్విభజనకు సై అన్న వైకాపా ఇప్పుడు మాత్రం స్పందించడంలేదు. ఎందుకంటే.. పార్టీ నుంచి చాలామంది నాయకులు వెళ్లిపోవడంతో నియోజకవర్గాల్లో నాయకత్వ కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడున్న నియోజకవర్గాల్లోనూ చాలావాటికి సమర్థులైన ఇన్‌ఛార్జీలు లభించక పార్టీ నాయకత్వం సతమతమవుతోంది. ఈ పరిస్థితుల్లో 50 నియోజకవర్గాలు పెరిగితే నాయకత్వ సమస్య మరింత తీవ్రతరం అవుతుందన్నది ఆ పార్టీ ఆందోళన. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం 25 లోక్‌సభ స్థానాలు ఉండగా, మరో 6`8 వరకు పెరిగే అవకాశం ఉందని నాయకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న మూడు పార్టీల కూటమిలో మొన్నటి ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కోసం త్యాగం చేసిన వారికి ఈసారి సీట్లు కేటాయింపునకు అవకాశం వస్తుందని చెబుతున్నారు. కాగా కులగణన అనంతరం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల సంఖ్య పెరగటం ఖాయమని.. ఆ దామాషా ప్రకారం సీట్ల కేటాయించాల్సిన అంశం తమకు కలిసి వచ్చేదిగా కొందరు వైకాపా నాయకులు చెబుతున్నారు. కాగా నియోజకవర్గాల పెరగనున్న నియోజకవర్గాలు, మారనున్న సామాజిక సమీకరణాలు వచ్చే ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్థుల విజయావకాశాలను ప్రభావితం చేస్తాయన్నది నిర్వివాదాంశం. 2008లో పునర్విభజన అనంతరం 2009లో జరిగిన ఎన్నికలను పార్టీలు గుర్తు చేసుకుంటున్నాయి. దీంతో రాజకీయంగా ఈ నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపు ఏపీ పార్టీల భవిష్యత్తును నిర్దేశించను న్నాయన్నది మాత్రం వాస్తవం.










Comments