మళ్లీ వార్తలకెక్కిన పొందూరు కేజీబీవీ
- BAGADI NARAYANARAO

- Sep 20
- 1 min read
భవనం పైనుంచి పడిన విద్యార్థిని
రిమ్స్‌లో చికిత్స, కలెక్టర్‌కు సమాచారం
కొద్ది రోజుల ముందు గారలో చేతులు విరగ్గొట్టుకున్న విద్యార్థి

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
పొందూరు (లోలుగు) కేజీబీవీలో ఇంటర్ రెండో సంవత్సరం బైపీసీ చదువుతున్న విద్యార్ధిని లోలుగు గ్రామానికి చెందిన చిత్తారపు వందన కళాశాల భవనం పైఅంతస్తు నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలైంది. ఈ ఘటనలో విద్యార్ధిని కుడికాలు విరిగిపోగా, ఎడమ కాలికి, వెన్నుపూసకు గాయమైందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం విద్యార్ధిని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నా, కోలుకోవడానికి సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. విద్యార్ధిని మేడ పైనుంచి కింద పడినట్టు సమాచారం తెలుసుకున్న ఏపీసీ శశిభూషణ్ ఈ విషయం కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిసింది.
వివరాళ్లోకి వెళితే..
రెండో ఏడాది బైపీసీ చదువుతున్న వందన శుక్రవారం 10.30 గంటలకు స్టడీ అవర్ పూర్తయిన అనంతరం విద్యార్ధినులందరూ నిద్రపోగా అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో మేడపైకి వెళ్లినట్లు క్షతగాత్రురాలు చెబుతుంది. ఈ నేపధ్యంలో కాలుజారి కింద పడిపోయినట్టు ఆమె స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. అయితే ఇందులో వాస్తవం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నెల రోజుల క్రితం పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్ బదిలీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపింది. ఇప్పుడు అదే కేజీబీవీ విద్యార్ధిని మేడపై నుంచి కింద పడడంతో మళ్లీ వార్తల్లోకెక్కింది. మేడపైకి విద్యార్ధులు వెళ్లకుండా తాళాలు వేయాల్సి ఉన్నా అలా ఎందుకు వేయలేదని సిబ్బందిని ప్రశ్నిస్తే.. ట్యాంకులో నీటిని నింపడానికి గ్రిల్స్ తాళాలు తీసినట్టు చెబుతున్నారు. శనివారం మధ్యాహ్నం నుంచి కేజీబీవీకి దసరా సెలవులు ఇవ్వనున్నట్టు అధికారులు ప్రకటించారు. అయితే ముందు రోజు అర్ధరాత్రి మేడపై నుంచి విద్యార్థి పడిపోవడంపై భిన్నవాదనలున్నాయి.
పొందూరు కేజీబీవీకి ఇటీవలే గార నుంచి ఎస్.లలితకుమారి బదిలీపై వచ్చారు. ప్రిన్సిపల్ లతకుమారి హయాంలోనే గారలో 40 రోజుల క్రితం తొమ్మిదో తరగతి విద్యార్ధిని మేడపై నుంచి దూకి రెండు చేతులు విరగ్గొట్టుకుంది. అయితే ఆ విద్యార్ధిని తొమ్మిదో తరగతిలో అప్పటికి అడ్మిషన్ ప్రక్రియ పూర్తి కాలేదు కాబట్టి ఈ వ్యవహారం వెలుగు చూడకుండా జాగ్రత్తపడ్డారు. విద్యార్ధిని తల్లిదండ్రులను పిలిపించి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అదే రోజు కంచిలి నుంచి బదిలీపై వచ్చిన ప్రిన్సిపల్ బాధ్యతలు స్వీకరించారు. ఈ వ్యవహారం వెలుగులోకి రాకుండా అన్ని వ్యవస్థలను మేనేజ్ చేశారు.










Comments