top of page

మహావతార నరసింహ.. ‘భక్త ప్రహ్లాద’కు విజువల్‌ టచ్‌

  • Guest Writer
  • Jul 28, 2025
  • 2 min read

ఓవైపు పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ సినిమా ‘హరిహర వీరమల్లు’ థియేటర్లలో సందడి చేస్తున్న సమయంలో దానికి పోటీగా తర్వాతి రోజే ఓ సినిమా రిలీజైంది. ఐతే అది తెలుగు చిత్రం కాదు.. కన్నడ అనువాదం. ‘మహావతార నరసింహా’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో కథ మనకు బాగా పరిచయం ఉన్నదే. యానిమేషన్లో తెరకెక్కిన ఈ భక్తి చిత్రం విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ విషయానికి వస్తే.. కశ్యప ముని భార్యల్లో ఒకరైన దితి.. అసందర్భ సమయలో భర్తను కలుస్తుంది. ప్రతిగా రాక్షసులైన కవలలు హిరణ్య కశ్యపుడు-హిరణ్యాక్షుడు జన్మిస్తారు. వీళ్లిద్దరినీ గురువు శుక్రాచార్యుడు.. మహా విష్ణువుకి శత్రువుల్లా తీర్చిదిద్దుతాడు. అసురులలో అగ్రగణ్యులుగా నిలిచిన వీళ్లిద్దరి అకృత్యాలకు అంతూ పొంతూ ఉండదు. వీరిలో హిరణ్యాక్షుడిని విష్ణువు వరాహ అవతారంలో వచ్చి సంహరిస్తాడు. దీంతో విష్ణువు మీద హిరణ్యకశ్యపుడు మరింత ద్వేషం పెంచుకుంటాడు. మరోవైపు కఠోర తపస్సుతో తనకు మరణం లేకుండా వరం కూడా పొందుతాడు. ఐతే విష్ణువు అంటే అస్సలు పడని హిరణ్య కశ్యపుడికి.. మహా విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు జన్మిస్తాడు. అతడి విష్ణు భక్తికి తట్టుకోలేక కన్నబిడ్డ అయినప్పటికీ సంహరించడానికి ప్రయత్నిస్తాడు హిరణ్యకశ్యపుడు. మరి తన భక్తుడిని విష్ణువు ఎలా కాపాడుకున్నాడు.. హిరణ్య కశ్యపుడిని ఎలా సంహరించాడు.. అన్నది మిగతా కథ.

పురాణ గాథలను తెరకెక్కించడంలో తెలుగు సినిమా సత్తా ఏంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. భాగవతం.. మహాభారతం.. రామాయణం నేపథ్యంలో ఎన్నో కథలను దశాబ్దాల కిందటే వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించారు మన దర్శకులు. మనం టచ్‌ చేయని పురాణ గాథ లేదని.. వీటిలో తెలుగు సినిమాలకు సాటి వచ్చే చిత్రాలు మరే భాషలోనూ తెరకెక్కలేదు అంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు కన్నడలో తెరకెక్కిన ‘మహావతార నరసింహ’ కూడా తెలుగులో ఒకటికి రెండుసార్లు తెరకెక్కిన కథే. తెలుగులో తొలి టాకీ చిత్రంగా తెరకెక్కిన ఘనత అందుకుని.. తర్వాతి కాలంలో ఎస్వీ రంగారావు హిరణ్యకశ్యపుడిగా.. రోజా రమణి ప్రహ్లాదుడిగా తెరకెక్కిన ‘భక్త ప్రహ్లాద’ కథతోనే ఈ యానిమేషన్‌ ఫిలిం రూపొందింది. ఈ కల్ట్‌ కథనే ప్రస్తుత ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని యానిమనేషన్లో భారీగా చెప్పే ప్రయత్నం చేసింది అశ్విన్‌ కుమార్‌ అండ్‌ టీం. ఫీచర్‌ ఫిలిం చూస్తే వచ్చే ఒరిజినల్‌ అనుభూతి రాదన్న మాటే కానీ.. యానిమేషన్లో ఈ కథను ఉన్నంతలో చాలా బాగానే చెప్పింది చిత్ర బృందం. ఆసక్తికర కథనంతో మెప్పిస్తూనే.. హాలీవుడ్‌ సినిమాలకు దీటైన విజువల్‌ ఎఫెక్ట్స్‌ తో ఈ చిత్రాన్ని భారీగా తీర్చిదిద్దింది. గూస్‌ బంప్స్‌ ఇచ్చే కొన్ని ఎపిసోడ్లతో ప్రేక్షకులకు మంచి అనుభూతినే ఇస్తుంది ‘మహావతార నరసింహ’.

ఖుషి టీవీ లాంటి పిల్లల ఛానెళ్లు చూస్తే.. పురాణ గాథలను యానిమేషన్లో చూపించే ప్రోగ్రామ్స్‌ బోలెడన్ని కనిపిస్తుంటాయి. మరి వాటిని మించి వెండితెరపై యానిమేషన్లో కొత్తగా ఏం ఆవిష్కరిస్తారు అనే సందేహం కలుగుతుంది. కానీ ‘మహావతార నరసింహ’ టీం మాత్రం ‘భక్త ప్రహ్లాద’ కథకు భారీ విజన్‌ జోడిరచి యానిమేషన్లో ఒక గొప్ప అనుభూతిని ఇవ్వడానికి ప్రయత్నించింది. తెలిసిన కథే అయినా.. బోర్‌ కొట్టించని కథనంతో.. చక్కటి సంభాషణలతో ఈ చిత్రాన్ని నడిపించడం విశేషం. కన్నడ సినిమా అయినప్పటికీ.. ఆ ఫీలింగ్‌ ఎంతమాత్రం కలగకుండా స్ట్రెయిట్‌ తెలుగు సినిమా చూస్తున్న ఫీలింగే వస్తుంది సినిమా చూస్తుంటే. సంభాషణలు అంత బాగా రాశారు. పురాణ గాథల మీద ఆసక్తి ప్రదర్శించే వారిని ఎంగేజ్‌ చేసేలా ఈ కథ సాగుతుంది. ఏ కాంప్లికేషన్‌ లేకుండా కథను చాలా సరళంగానే చెప్పింది చిత్ర బృందం. పాటలు.. కొన్ని సన్నివేశాల వల్ల మధ్యలో ఓ అరగంట కొంచెం నెమ్మదించిన భావన కలిగినా.. రెండు గంటల నిడివిలో మిగతా కథనమంతా బాగానే ఆసక్తికరంగానే సాగుతుంది.

మహావతార నరసింహకు ప్రధాన బలం.. పతాక సన్నివేశాలే. నరసింహావతారంలో విష్ణువు రంగ ప్రవేశం చేసిన దగ్గర్నుంచి హిరణ్య కశ్యపుడిని సంహరించే వరకు ఓ 20 నిమిషాల పాటు గూస్‌ బంప్స్‌ గ్యారెంటీ. ప్రపంచ స్థాయి విజువల్‌ ఎఫెక్ట్స్‌ తో ఈ ఎపిసోడ్‌ ను అద్భుతంగా తీర్చిదిద్దారు మేకర్స్‌. యానిమేషనే కదా అని తీసి పడేయడానికి వీల్లేకుండా.. రెగ్యులర్‌ సినిమాలు చూస్తున్న భావన కలిగేలా పతాక సన్నివేశాలను తీర్చిదిద్దారు. ఆరంభంలో హిరణ్యాక్షుడిని వరాహ అవతారంలో విష్ణువు వధించే సన్నివేశాలు కూడా ఇంతే బాగా రూపొందించారు. సినిమాకు ప్రధాన ఆకర్షణ ఈ రెండు ఎపిసోడ్లే. విజువల్‌ ఎఫెక్ట్స్‌ ను బాగా ఉపయోగించుకున్న సినిమా ఇది. సామ్‌ సీఎస్‌ అదిరిపోయే బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ తో సినిమాకు అతి పెద్ద బలంగా నిలిచాడు. ప్రేక్షకులకు కొన్ని ఎపిసోడ్లలో గూస్‌ బంప్స్‌ వచ్చేలా చేయడంలో ఆర్‌ఆర్‌ పాత్ర కీలకం. యానిమేటెడ్‌ మూవీ కావడం వల్ల.. ఇది సహజంగా అనిపించకపోవడం సమస్య కావచ్చు. మనం చూడబోయేది యానిమేటెడ్‌ మూవీ అని ప్రిపేరై రావడం కీలకం. సినిమాలో కొన్ని చోట్ల మాత్రం ఎఫెక్ట్స్‌ అంత ఎఫెక్టివ్‌ గా లేవు. ఓవరాల్‌ గా చూస్తే.. మనకు తెలిసిన కథనే యానిమేషన్‌ విజన్లో భారీ స్థాయిలో.. ఆసక్తికరంగా చెప్పడంలో ‘మహావతార నరసింహ’ టీం సక్సెస్‌ అయిందని చెప్పొచ్చు.

- తుపాకి.కామ్‌ సౌజన్యంతో..

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page