మహేష్ నిద్రకు ఆగలేడు.. షాట్స్ వేగంగా తీసి పంపించేయండి!
- Guest Writer
- Jun 9, 2025
- 2 min read

సూపర్‌స్టార్ హీరోగా’’గూఢచారి117’’ సినిమా షూటింగ్ మద్రాస్ లోని స్టూడియోలో వేసిన ‘‘విమానం ఇంటీరియర్ సెట్’’ లో జరుగుతోంది. సమయం అర్ధరాత్రి 2 గంటలు. బాలనటుడైన మహేష్‌బాబుతోసహా దాదాపు సినిమాలోవున్న నటీనటులందరూ ఆ ఫ్లైట్ సెట్లో ఉన్నారు. ఫ్లైట్ ఎక్స్‌టీరియర్ వర్క్ హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగింది. కృష్ణగారు డైరెక్టర్‌గారితో ‘‘ముందు మహేష్ షాట్స్ తీయగలిగితే తీసి పంపించేయండి. నిద్రకి ఆగలేడు. నేను కావాలంటే తెల్లవారేవరకూ ఉంటాను’’ అని నవ్వుతూ చెప్పారు. ఆ సినిమా షూట్ జరుగుతున్నప్పుడు మహేష్‌బాబు టకటకా డైలాగులు చెబుతుంటే కృష్ణగారు చూస్తూ భలే మురిసిపోతుండేవారు.
కధప్రకారం టెర్రరిస్ట్ భానుప్రియ గ్రూప్ ఫ్లైట్ హైజాక్ చేసి వాళ్ళ డిమాండ్స్ కోసం ఒక్కొక్కరినీ చంపుతుంటారు. ఆ ప్రోసెస్‌లో భాగంగా కొత్తగా పెళ్ళైన ఓ జంటలోని యువకుడిని చంపుతారు. మా మిత్రుడుపురం రాధాకృష్ణ (తర్వాతికాలంలో’’చిరంజీవులు’’ సినిమాకి దర్శకత్వం వహించాడు) ఆ యువకుడి పాత్ర పోషిస్తే అతని జంటగా ఓ కొత్తమ్మాయి వేసింది. డైరెక్టర్ గారు ఆ అమ్మాయితో ‘‘టెర్రరిస్ట్‌లు మీ ఆయన్ని కాల్చేశారు అది చూసి నువ్వు కెవ్వుమని అరిచి పడిపోవాలి’’అని చెప్పారు. సెట్లో ఒకరిద్దరు గురకపెడుతున్న వాళ్ళను, నిద్రకు జోగుతున్న వాళ్ళను లేపి టేక్ అని అరిచాము. డైరెక్టర్ గారు యాక్షన్ చెప్పగానే రాధాకృష్ణ బుల్లెట్ తగిలినట్లు అరిచి పడిపోతే అతన్ని చూసిన ఆ అమ్మాయి ఒక్కసారిగా తల పైకెత్తి తన చెవులురెండూ మూసుకుని ‘‘కెవ్వు’’ అనే పదం పెద్దగా పలుకుతూ పడిపోయింది. అంతే దెబ్బకి సెట్లో అందరికీ నిద్రమత్తు ఒదిలిపోయింది. విరగబడి నవ్వారందరూ. మీరు చెప్పిందేకదా చేశాను ఎందుకు నవ్వుతున్నారు అన్నట్లు చూసిందా అమ్మాయి. డైరెక్టర్ గారు ‘‘కెవ్వుమని అరవమంటే’’ కెవ్వూ’’ అని అనక్కర్లేదమ్మా. అరిచిపడిపోతే చాలు’’ అని మళ్ళీ యాక్షన్ చెప్పారు. మళ్ళీ సెకెండ్ టేక్‌లో కూడా ఆ అమ్మాయి ‘‘కెవ్వూ’’ అంటూ దీర్ఘం తీయడంతో మళ్ళీ నవ్వులేనవ్వులు. మూడో టేక్‌కి అర్ధమైందామెకి. టేక్ ఓకే అయ్యింది.
అప్పటి నుండి ఆ అమ్మాయి ‘‘కెవ్వుకుమారి’’ అయ్యింది. కొన్ని తెలుగు తమిళ సినిమాలలో నటించిన ఆ అమ్మాయి తరువాత కనిపించలేదు. నేను దర్శకత్వం వహించిన ‘‘బ్లేడ్‌బాబ్జీ’’ సినిమాలో.... అల్లరి నరేష్ బృందం బ్యాంక్ రాబరీ చేసి పోలీసులనుండి తప్పించుకున్న ఆనందంలో వైజాగ్ బీచ్ ఒడ్డున లంగరేసివున్న ఓ చిన్న షిప్ లో మందుకొట్టి పడుకుని తెల్లారి లేచి చూసేసరికి షిప్ సముద్రం మధ్యలో ఉంటుంది. షాక్ అయ్యిన వాళ్ళు చేతులు చెవులకు ఆనించి ‘‘కెవ్వు’’ అని అరుస్తారు పెద్దగా. అలా అరిపించటానికి ఆనాటి కెవ్వు కుమారి ‘‘కెవ్వే’’ నాకు ప్రేరణ. ఆ ‘‘కెవ్వు’’ ఆనాడు సెట్లో అందరినీ ఎలా నవ్వించిందో అలాగే ఈ ‘‘కెవ్వు’’ ధియేటర్‌లో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. వెతకాలేగానీ మనచుట్టూ జరిగే సంఘటనల్లో, చుట్టూ ఉండే మనుషుల్లో ఎన్నో నవ్వులు దాక్కునివుంటాయి. మనిషికి కష్టమొచ్చినపుడు కష్టపడకా,దుఃఖం వచ్చినపుడు దుఃఖపడకా తప్పదు. కానీ మిగిలిన విలువైన సమయాన్నికూడా భారంగా ఎందుకు ఖర్చు చెయ్యటం? ఏమాత్రం ‘‘ఖర్చు’’లేని ‘‘నవ్వు’’ ని ముఖానికెందుకు దూరం చెయ్యటం? సాధ్యమైనన్ని నవ్వుల్ని పోగేసుకుని బ్రతికేద్దాం.
- దేవీ ప్రసాద్










Comments