యూఏఈ.. హిందువులకు ఎంతో హాయి!
- DV RAMANA

- Jan 10
- 2 min read
ప్రపంచంలో అత్యంత నమ్మకమైన ముస్లిం దేశం
మతాలన్నింటికీ సమాన గుర్తింపు, భద్రత
దీని కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఘనత
భద్రతా సూచీల్లోనూ అగ్రస్థానంతో భరోసా

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
మనది ప్రజాస్వామ్య దేశం. మన రాజ్యాంగం పౌరులకు మతస్వేచ్ఛను హక్కుగా ఇచ్చింది. అంటే దేశ ప్రజలు తమకు ఇష్టమైన మతంలో చేరవచ్చు.. ఆ మత విశ్వాసాలు ఆచరించవచ్చు. ఈ ప్రకారమే హిందూ ముస్లింలతో సహా దేశంలో పదుల సంఖ్యలో ఉన్న మతవర్గాల వారందరూ మెజారిటీ వర్గమైన హిందువులతో సమాన హక్కులు అనుభవిస్తూ, స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారు. మనం ఆచరిస్తున్నది పరమత సహనం అయితే.. మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్‌లో మత అసహనం రాజ్యమేలుతోంది. అక్కడ మైనారిటీ మతస్తులుగా ఉన్న హిందువులు తరచూ వివక్షకు, దాడులకు గురవుతున్నారు. గత ఏడాదిన్నరగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదేశంలో జరుగుతున్న ఉద్యమాలు, అల్లర్లు.. ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లుగా హిందువులపైకి మళ్లుతున్నాయి. ఒక మతానికి చెందిన అల్లరిమూకలు పెట్రేగిపోయి హిందువుల ధన, మాన, ప్రాణాలను హరిస్తున్నారు. గత నెల రోజుల వ్యవధిలోనే దాదాపు ఐదుగురిని మతముష్కరులు హత్య చేసి దహనం చేశారు. ఇద్దరు హిందూ మహిళలపై అత్యాచారానికి తెగబడ్డారు. ఆస్తులను తగులబెట్టారు. ఒక్క బంగ్లాదేశ్‌లోనే కాదు మనకు మరోపక్కనున్న పాకిస్తాన్‌లోనూ మైనారిటీ వర్గంగా ఉన్న హిందువులపై అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఇంత తీవ్రస్థాయిలో కాకపోయినా ఇతర ముస్లిం దేశాల్లోనూ మత అసహనం కనిపిస్తుంది. హిందువులతోపాటు ఇతర మైనారటీ మతస్తులపై మెజారిటీ వర్గీయులైన ముస్లింలు వేధింపులకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఘటనల గురించి వింటూనే ఉన్నాం. కానీ ప్రపంచంలో ఒక్క ముస్లిం దేశం మాత్రం దీనికి మినహాయింపు. అదే యూఏఈ.. అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. కొన్ని చిన్నచిన్న రాజ్యాల సమూహమైన ఈ దేశం మెజారిటీ జనాభాగా ఉన్న ముస్లింలతో సమానంగా హిందువులకు కూడా పూర్తి భద్రత, గౌరవం కల్పిస్తూ ప్రత్యేకత చాటుకుంటోంది.
మైనారిటీలకు పూర్తి రక్షణ
హిందువులకు అత్యంత సురక్షతమైన ముస్లిం దేశంగా యూఏఈ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇతర దేశాల్లో మైనారిటీలు వివక్ష ఎదుర్కొంటున్న పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ దేశంలో మాత్రం హిందువులు తమ మత సంప్రదాయాలను స్వేచ్ఛగా, బహిరంగంగా ఆచరించుకోగలుగుతున్నారు. కేవలం మాటలకే పరిమితం చేయకుండా కఠినమైన చట్టాల ద్వారా ఈ దేశంలో మత స్వేచ్ఛను అమలు చేస్తున్నారు. 2023లో అమల్లోకి వచ్చిన ఫెడరల్ లా నంబర్ 34 ప్రకారం.. ఏ మతానికి వ్యతిరేకంగానైనా విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం, మతాలను అవమానించడం లేదా వివక్ష ప్రదర్శించడం నేరంగా పరిగణిస్తారు. ఈ చట్టం హిందువులతో పాటు అన్ని మతాలకు సమానంగా రక్షణ కల్పిస్తుంది. మతపరమైన నేరాలకు పాల్పడే వారికి భారీ జరిమానాలు, జైలు శిక్ష విధిస్తారు. సోషల్ మీడియా వేదికల విషయంలో కూడా ఈ చట్టం కఠినంగా అమలు అవుతుంది. దీనివల్ల ఖAజులో నివసిస్తున్న హిందువులు తమ వ్యక్తిగత, మత స్వేచ్చ, భద్రత విషయంలో పూర్తి నమ్మకంతో ప్రశాంతంగా జీవించగలుగుతున్నారు. యూఏఈలో పరిఢవిల్లుతున్న పరమత సహనానికి నిలువెత్తు నిదర్శనంగా అక్కడి హిందూ దేవాలయాలు నిలుస్తున్నాయి. అబుదాబిలోని బీఏపీఎస్ హిందూ దేవాలయం వాటిలో ముఖ్యమైనది. 2024 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా విశేష గుర్తింపు పొందింది. అంతకుముందే దుబాయ్‌లోని జెబెల్ అలీ హిందూ దేవాలయం 2022లో ప్రారంభమై ప్రతిరోజూ వేలాది మంది భక్తులను ఆకర్షిస్తోంది. బుర్ దుబాయ్‌లోని శ్రీకృష్ణ దేవాలయం 1958 నుంచే హిందువుల ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది.
ప్రభుత్వ విధానాల్లో సహజీవనానికి ప్రాధాన్యం:
మత సహనం, సహజీవనాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన ప్రపంచంలోని ఏకైక దేశం యూఏఈ. వివిధ మతాలు, సంస్కృతులకు చెందిన ప్రజలు కలసిమెలసి జీవించాలనే దృక్పథంతో ప్రభుత్వం పనిచేస్తోంది. 200కి పైగా దేశాలకు చెందిన ప్రజలు నివసిస్తున్న ఈ దేశంలో నివసిస్తున్నారు. అందువల్ల వీరందరిలో ఐక్యత పెంపొందించి, పరస్పర స్నేహభావం ప్రోది చేసేందుకు వీలుగా 2025 సంవత్సరాన్ని కమ్యూనిటీ సంవత్సరంగా కూడా ప్రకటించిన యూఏసీ ప్రభుత్వం ఏడాది పొడవునా అనేక కార్యక్రమాలు నిర్వహించింది. హిందువుల పండుగలను కూడా ఇక్కడ అధికారికంగా, బహిరంగంగా జరుపుకుంటారు. దీపావళి, హోలీ, దసరా నవరాత్రి వంటి వేడుకలకు ప్రభుత్వ మద్దతు ఉంటుంది. దీపావళి సందర్భంగా బుర్జ్ ఖలీఫా వంటి ప్రపంచ ప్రఖ్యాత కట్టడాలను దీపాల వెలుగులతో అలంకరించడం యూఏఈలో మత గౌరవానికి ఇచ్చే విలువను ప్రతిబింబిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దేశాల్లో భద్రత స్థాయిని అంచనా వేసే సూచీల్లో యూఏఈ ఎప్పటికప్పుడు అగ్రస్థానంలో నిలుస్తోంది. 2025 నంబియో భద్రతా సూచిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత సురక్షతమైన దేశాల్లో యూఏఈ ఒకటిగా నిలిచింది. ఆ దేశ జనాభాలో భారతీయుల వాటా 30 నుంచి 35 శాతం వరకు ఉండటం విశేషం. వ్యాపారం, నిర్మాణ రంగం, ఆరోగ్య సేవలు, ఐటీ, సేవా రంగాల్లో భారతీయులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. మొత్తంగా మత భేదాలకు అతీతంగా సహజీవనాన్ని ప్రోత్సహిస్తున్న యూఏఈ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. హిందువులకు భద్రత, గౌరవం కల్పించే ముస్లిం దేశంగా ఇది ప్రత్యేకంగా గుర్తింపు పొందుతోంది.










Comments