top of page

యాడ దొరికిన సంతరా మీరంతా!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Jun 24
  • 3 min read
  • డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఉద్యోగులంతా 2 గ్రూపులు

  • రోజూ తిట్లు, శాపనార్థాలు

  • ఏవో బాబూరావుపై ఫిర్యాదు

  • ఫైల్స్‌ కదలక తటస్థుల పాట్లు

    ree
(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

తన కింద పనిచేసే మహిళా ఉద్యోగినికి రీపోస్టింగ్‌ (దీర్ఘకాల సెలవు అనంతరం) ఇవ్వడానికి రూ.20వేలు లంచం తీసుకుంటూ స్వయంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారితో పాటు ఆయన దగ్గర సీసీగా పని చేసిన ఉద్యోగి కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయినా ఈ శాఖ ఉద్యోగుల్లో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. అంతకు ముందు ప్రభుత్వ నోటిఫికేషన్‌ మేరకు ఉద్యోగాల భర్తీలో అనేక అవకతవకలకు పాల్పడ్డారని కొందరు ఉద్యోగులపై స్వయంగా అప్పటి డీఎంహెచ్‌వోనే టూటౌన్‌లో కంప్లైంట్‌ ఇవ్వడం, దీనిమీద క్రిమినల్‌ కేసు నమోదుచేసి, దర్యాప్తు జరుపుతున్నా మిగిలినవారిలో ఏమాత్రం భయం కనిపించడంలేదు. అన్నింటికంటే ముందు ఈ శాఖలో పనిచేసిన అనేకమంది ఉద్యోగులపై ఏసీబీ ఛార్జెస్‌ ఉన్నా ఏం కాదులే అన్న భావనతో ఇప్పుడున్న ఉద్యోగులు వ్యవహరించడం కొసమెరుపు. అన్నిటికీ మించి ఇక్కడ డీఎంహెచ్‌వోలుగా పనిచేసిన ముగ్గురు అధికారులకు ఇప్పటికీ రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ సెటిల్‌ కాకుండా పెన్షన్‌ అందుకోలేకపోతున్నారని తెలిసినా ఎక్కడా తగ్గేదే లే అంటున్నారు.

జిల్లాలో ఎక్కువమంది ఉద్యోగులు ఉన్న విభాగంగా వైద్యఆరోగ్య శాఖ కీలకమైనది. కాబట్టి ఇక్కడ ప్రతీ సీటు కాసులు కురిపించేదే. అందుకే సొమ్ములు పంచుకోవడంలోను, దండుకోవడంలోను తేడాలు రావడం వల్ల కార్యాలయంలో స్వయంగా డీఎంహెచ్‌వో ఛాంబర్‌ ఎదుటే ఒకరిపై ఒకరు బాహాబాహీకి దిగుతున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో మినిస్టీరియల్‌ ఉద్యోగులు రెండు గ్రూపులుగా విడిపోయి నిత్యం ఒకరిపై ఒకరు పెద్ద ఎత్తున కేకలు వేసుకుంటూ సంత మాదిరిగా తయారుచేశారు. అక్కడితో ఆగకుండా ఇక్కడి నుంచి బదిలీ చేయించాలన్న కోణంలో ఒక వర్గంపై మరొక వర్గం ఫిర్యాదులు చేసుకుంటోంది. డీఎంహెచ్‌వో కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ బాబూరావు, అకౌంట్స్‌ విభాగం సూపరింటెండెంట్‌ శివకుమార్‌, ఎల్‌డీ కంప్యూటర్‌ హోదాలో జూనియర్‌ అసిస్టెంట్‌ హోదాలో పని చేస్తున్న ఉదయ్‌కుమార్‌ల బృందం ఒక గ్రూప్‌ కాగా, సూపరింటెండెంట్‌ భాస్కర్‌ కుమార్‌తో పాటు మరికొందరు మినిస్టీరియల్‌ ఉద్యోగులు ఒక గ్రూపుగా ఏర్పడి చొక్కాలు పట్టుకొంటున్నారు. చివరకు ఈ వ్యవహారం వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టరేట్‌కు చేరింది. ఏవో బాబూరావు సవ్యంగా విధులకు రారని, ఆయన సీటులో ఎప్పుడూ ఉండరు సరికదా, మిగిలిన ఉద్యోగులపై చిర్రుబుర్రులాడుతూ దుర్భాషలాడుతారంటూ ఒక ఫిర్యాదును ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు భాస్కర్‌ కుమార్‌ వర్గం బాబూరావుపై ఒక ఫిర్యాదును అందించింది. దీనిపై ప్రజాగ్రీవెన్స్‌కు సిఫార్సు చేస్తూ కూన రవికుమార్‌ లేఖ పంపించారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ డీఎంహెచ్‌వోకు లేఖ రాశారు. అయితే ఇది తన పరిధిలోకి రాదని, దీనిపై చర్యలు తీసుకోవాల్సింది వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టరేనంటూ కలెక్టర్‌ లేఖను అక్కడకు పంపారు. ప్రస్తుతం ఇక్కడ ఎటువంటి చర్యలకు సిఫార్సు చేశారన్నది తేలాల్సివుంది. అవినీతి అంశం పక్కనపెడితే బాబూరావు సీటులో ఉండటం తక్కువే. అయితే డీఎంహెచ్‌వో ఆఫీసులో ప్రతీ పనికి ఓ రేటు వసూలుచేసే బ్యాచ్‌కు, బాబూరావుకు మధ్య ఏమాత్రం పొసగడంలేదు. సంబంధిత క్లర్క్‌ ఫైల్‌ తయారుచేసిన తర్వాత సూపరింటెండెంట్‌ సంతకం చేసి ఏవో ఓకే అంటేనే డీఎంహెచ్‌వో టేబుల్‌ మీదకు ఫైల్‌ వెళ్తుంది. అయితే అయినదానికీ, కానిదానికీ ఏవో కొర్రీలు పెట్టి ఫైల్‌ వెనక్కు పంపుతున్నారనేది వీరి వాదన. ప్రతీ దానికి ఓ రేటు ఫిక్స్‌ చేసి అందులో తన వాటా కూడా ఉందని వసూలు చేస్తున్నందునే తిరస్కరిస్తున్నట్లు బాబూరావు భావన. ఏది ఏమైనా రెండు గ్రూపులుగా ఏర్పడి డీఎంహెచ్‌వో ఆఫీసులో తన్నుకుంటున్నారు. అకౌంట్స్‌ సూపరింటెండెంట్‌ కె.శివకుమార్‌కు ఈ వ్యవహారాలతో సంబంధం లేకపోయినా బాబూరావుకు కొమ్ముకాస్తున్నారని, 2024 మార్చి 6న ఏవోగా చేరిన బాబూరావు మినిస్టీరియల్‌ ఉద్యోగులను దుర్భాషలాడుతూ అగౌరవపరుస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. పనిలో పనిగా బాబూరావుకు సంబంధంలేని వ్యవహారాలను కూడా ఇందులో కలిపేశారు. అర్బన్‌ పీహెచ్‌సీల్లో ల్యాబ్‌ టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల నియామకానికి గత ఏడాది ఫిబ్రవరి 27న జిల్లా కలెక్టర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన మేరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ప్రొవిజినల్‌ లిస్టును తయారుచేసిన తర్వాత బాబూరావు ఆ ఫైల్‌ను తొక్కిపెట్టేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వాస్తవానికి వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ఏ పద్ధతిలో నియామకానికైనా డైరెక్టరేటే నోటిఫికేషన్‌ ఇస్తుందని, జిల్లాలవారీగా ఖాళీల భర్తీని నిలుపుదల చేయాలంటూ వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టరేటే ఆదేశాలివ్వడంతో ఈ నియామకాలు నిలిచిపోయాయి. అయితే ఇందుకు బాబూరావే బాధ్యుడని కూడా ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. కార్యాలయానికి వచ్చి ఎఫ్‌ఆర్‌సీ పూర్తయిన తర్వాత బయటకు వెళ్లిపోతారని, దీనివల్ల ఫైళ్లు పెండిరగ్‌లో ఉండిపోతున్నాయంటూ ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. వాస్తవానికి బాబూరావు, భాస్కర్‌కుమార్‌ ఒకే సామాజికవర్గానికి చెందినవారు. వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరులో గ్రూపులు ఏర్పడిన మాట వాస్తవం. అయితే వైద్యఆరోగ్యశాఖ పరిధిలో సామాన్య ఉద్యోగి మాత్రం వీరి గొడవల మధ్య నలిగిపోతున్నాడు.

బాబూరావు కార్యాలయంలో తన కింది ఉద్యోగులను వేధిస్తున్నారనడానికి ఉదాహరణగా మరో ఫిర్యాదును దీనికి జతచేశారు. 2022 నుంచి డీఎంహెచ్‌వో కార్యాలయంలో పని చేస్తున్న ఓ మహిళా సీనియర్‌ అసిస్టెంట్‌ ఏవో తనను మిగిలిన ఉద్యోగుల సమక్షంలోనే దుర్భాషలాడుతున్నారని మరో ఫిర్యాదు అందించారు. జూనియర్‌ అసిస్టెంట్‌ నుంచి సీనియర్‌ అసిస్టెంట్‌గా ఇటీవలే పదోన్నతి పొందిన తనకు ఏవో కోర్టు డ్యూటీలు కూడా వేస్తున్నారని, తరచూ విజయవాడ పంపుతున్నారని, మహిళనని కూడా చూడకుండా కించపరుస్తూ మాట్లాడుతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. బహుశా ఈమె ఫిర్యాదు మేరకు వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో దర్యాప్తు చేపడితే బాబూరావుపై చర్యలుంటాయని భాస్కర్‌ కుమార్‌ వర్గం భావిస్తోంది. అయితే బాబూరావు కూడా సూపరింటెండెంట్‌ భాస్కర్‌కుమార్‌ బ్యాచ్‌కు సంబంధించిన అక్రమాల ఆధారాలు కూడా పైకి పంపినట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికి ప్రతీరోజు డీఎంహెచ్‌వో ఛాంబర్‌ ముందు, వీలైతే డీఎంహెచ్‌వో ముందే వీరు బాహాబాహీకి దిగడం వల్ల కార్యాలయంలో పనిచేసే వాతావరణం పూర్తిగా పాడైపోయింది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page