యువజనంలో పెరుగుతున్న ఆత్మహత్యలు
- DV RAMANA

- Jul 2, 2025
- 2 min read

మనదేశం జనసంఖ్యలో ప్రపంచంలోనే తొలి స్థానంలో ఉందన్నది తెలిసిందే. గతంలో చైనా అగ్రస్థానంలో ఉండేది. కానీ కఠిన కుటుంబ నియంత్రణ విధానాలు అనుసరించడం ద్వారా జనాభాను గణనీయంగా తగ్గించుకోగలిగింది. ఎంతలా అంటే.. ఇప్పుడు జనసంఖ్య భారీగా తగ్గిపోతుండటం.. అదే సమయంలో అత్యాధునిక వైద్య విధానాల వల్ల మనుషుల అయుఃప్రమాణం పెరిగి దేశ జనాభాలో వృద్ధుల సంఖ్య ఎక్కువైపోతోంది. యువజనులు తగ్గిపోతున్నారు. దాంతో ఆందోళన చెందిన చైనా ప్రభుత్వం ఎక్కువ మంది పిల్లలను కనడాన్ని ప్రోత్సహిస్తోంది. చైనా సంగతి పక్కన పెడితే.. భారత్‌లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కు.ని. కార్యక్రమాలు ధారాళంగా నిర్వహిస్తున్నా జనాభా పెరిగిపో తోంది. మరణాల కంటే జననాల రేటు అధికంగా ఉండటమే ఈ పరిస్థితికి కారణమని సామాజిక వేత్తలు విశ్లేషిస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో ఆత్మహత్యల కేసులే గణనీయ సంఖ్యలో నమోదవుతుండటం.. ఈ తరహా బలవన్మరణాలకు మహిళలు, యువజనులే అధికంగా పాల్పడుతుందటం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా ఆత్మహత్య కేసులు భారీగా పెరుగుతున్నట్లు కాజ్ ఆఫ్ డెత్ నివేదిక వెల్లడిరచింది. క్షణికావేశాలు, అనాలోచిత నిర్ణయాలు, మానసిక సమస్యలు, ఒంటరితనం, శారీరక సమస్యలు, కుటుంబ ఇబ్బందులు, గృహ హింస, ప్రేమ వైఫల్యం, చదువు, ఉపాధిలో వెనుకబడటం వంటి కారణాలను యువతను బలవన్మరణాలకు ప్రేరేపిస్తున్నట్లు ఈ అధ్యయన నివేదిక గుర్తించింది. ఎంతో భవిష్యత్తు ఉన్న యువత ఇలా చిన్న చిన్న కారణాలకు భవిష్యత్తుపై ఆశలు కోల్పోయి ప్రాణాలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ తరహా ఘటనలు ఎన్నో వేల కుటుంబాల్లో తీరని విషాదం నింపుతున్నాయి. చేతికి అందివచ్చి ఆసరాగా నిలుస్తారనుకున్న పిల్లలు అలా అర్థాంతరంగా బలవన్మరణాలకు పాల్పడుతూ ఈ లోకాన్ని, తమ కుటుంబాలను వీడి వెళ్లిపోతుండటంతో కన్నవాళ్లకు కడుపుకోత మిగల్చడంతోపాటు ఆ కుటుంబాలకు అండ లేకుండా చేస్తున్నారు. భారతదేశంలో యువత ఆత్మహత్యలకు సంబంధించి సంచలన విషయాలు ఈ అధ్యయనం లో వెల్లడయ్యాయి. దేశంలో యువత.. ముఖ్యంగా 15-29 సంవత్సరాల మధ్య వయస్కుల మరణానికి గత రెండు దశాబ్దాలుగా ఆత్మహత్యలే ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. 2020-22 మధ్యకాలంలో అధ్యయనం నిర్వహించిన ఎస్‌ఆర్‌ఎస్ కాజ్ ఆఫ్ డెత్ నివేదిక ప్రకారం 15-29 మధ్య వయసు గల యువతకు సంబంధించి ప్రతి ఆరు మరణాల్లో ఒకదానికి ఆత్మహత్య కారణమవుతోందని క్రైమ్ రికార్డులు వెల్లడిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గణాంకాల ప్రకారమే కాకుండా, కేంద్ర ప్రభుత్వానికి చెందిన రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం కూడా ఈ అంశం నిర్థారితమైంది. ఈ ఆత్మహత్యల్లో కూడా మహిళలవే ఎక్కువ ఉండటం చాలా విచారకరం. మొత్తం ఆత్మహత్యల్లో మహిళల వాటా 18.2 శాతంగా ఉండగా, పురుషులలో ఇది 16.3 శాతంగా ఉంది. మొత్తంగా చూస్తే 15-29 ఏళ్ల వయస్సు వారిలో 17.1 శాతం మంది ఆత్మహత్య చేసుకునే ప్రాణాలు కోల్పోతున్నారు. ఆత్మహత్యల తర్వాత స్థానాల్లో రోడ్డు యాక్సిడెంట్లు (15.6 శాతం), గుండె సంబంధిత వ్యాధులు (9.6 శాతం), ఇతర ప్రమాదాలు (8.7 శాతం), జీర్ణ సంబంధిత వ్యాధులు (6.4 శాతం), శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు (5.3 శాతం) యువత మరణాలకు కారణమవుతున్నాయి. నేషనల్ క్లైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాల ప్రకారం 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్కుల్లో ఆత్మహత్య లకు ప్రధాన ఐదు కారణాలు ఉన్నట్లు వర్గీకరించారు. ఆత్మహత్యల్లో ప్రేమ వైఫల్యం కేసులే 34.2 శాతంతో అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. ఆ తర్వాత పెళ్లి సంబంధిత సమస్యలు (8 శాతం), మానసిక అనారోగ్యం (7.4 శాతం), కుటుంబ వివాదాలు (7.5 శాతం), మాదక ద్రవ్యాల వ్యసనం (5.2 శాతం) ప్రధాన కారణాలుగా ఉంటున్నాయి. మరో విషయం ఏమంటే.. పెళ్లి సంబంధిత సమస్యల కారణంగా జరిగే ఆత్మహత్యల్లో 28 శాతం మాత్రమే పురుషులవి కాగా.. మిగిలిన 72 శాతం మహిళలవే నమోదు కావడం గమనార్హం. దేశంలో ఏటా 60 వేలకు పైగానే యువజనుల ఆత్మహత్యలు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ సంఖ్య చైనా కంటే ఆరు రెట్లు అధికం. ఈ దృష్ట్యా మానసిక ఆరోగ్యం పట్ల ప్రజల్లో అవగాహన పెంచడం, హెల్ప్‌లైన్ నంబర్లు, సంప్రదించదగిన మానసిక నిపుణుల సేవలను అందుబాటులో ఉంచడం అత్యవసరం.










Comments