రూ.40 లక్షలు తినేశారు సార్..!
- Prasad Satyam
- Sep 20
- 1 min read
కలెక్టర్, మినిస్టర్ ముందు కుండబద్దలుగొట్టిన కాలనీవాసులు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
‘‘నగరంలో అతి పెద్ద కార్గిల్ పార్కు ఆధునీకరణలో భాగంగా రూ.40 లక్షలు అప్పనంగా తినేశారు సార్..! కావాలంటే ఈ రోడ్లు, అర్ధాంతరంగా నిలిచిపోయిన రీజింగ్ రూమ్, గార్డెనింగ్ పేరుతో వేసిన పిచ్చిమొక్కలు ఒక్కసారి చూడండి.’’ అంటూ కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ముందు కాలనీవాసులు శుక్రవారం మధ్యాహ్నం తమ గోడు వెలిబుచ్చుకున్నారు. స్థానిక ఏపీహెచ్‌బీ కాలనీలో ఉన్న కార్గిల్ పార్క్‌ను కేంద్రమంత్రి సందర్శించినప్పుడు మున్సిపాలిటీ చేసిన చిత్రమైన పనులను కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గవిడి వాసుదేవరావు కేంద్రమంత్రికి వివరించారు. సుందరీకరణ పనులు ప్రారంభించక ముందే ఈ పార్కు బాగుండేదని, కాలనీవాసులకు వాకింగ్, విశ్రాంతి కోసం ఉపయోగపడేదని, ఇప్పుడు ఆధునీకరణ పేరుతో పూర్తిగా చెడగొట్టేశారని, చివరకు వర్షంనీరు బయటకు పోయే మార్గాన్ని కూడా ఇవ్వలేకపోయారని తెలిపారు. ఈ పార్క్‌నకు అసిస్టెంట్ కమిషనర్‌ను ఇన్‌ఛార్జిగా నియమించారని, 15 రోజుల్లో సుందరమైన పార్క్‌ను చూస్తారని మాటిచ్చిన ఆయన కనిపించకుండాపోయారంటూ ఫిర్యాదు చేశారు. అరకొరగా చేసిన పనులను చూసిన కలెక్టర్, కేంద్రమంత్రి అవాక్కయ్యారు. కొద్ది రోజుల క్రితం ఈ పార్క్‌పైన ‘సత్యం’ సమగ్ర కథనం ప్రచురించినప్పుడే కలెక్టర్ దినకర్ దీనిపై ఆరాతీశారు. ఇప్పుడు స్వయంగా పరిశీలించడం ద్వారా మున్సిపాలిటీ చేస్తున్న పనులు ఎంత నాణ్యంగా ఉంటున్నాయో తెలుసుకున్నారు. ఇకనుంచి ఈ పార్కుకు ఎంత ఖర్చయినా సుడా చూడాలని, ఈ పనులను దగ్గరుండి చేపట్టాలని సుడా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గొలివి సుగుణాకర్‌ను కేంద్రమంత్రి సూచించారు.










Comments