రంగంలోకి మహిళా ముజాహిదీన్లు!
- DV RAMANA

- 3 days ago
- 3 min read
పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ కొత్త కుట్ర
కొత్త విభాగం.. రిక్రూట్‌మెంట్ ప్రారంభం
పాఠాల ముసుగులో సూసైడ్ బాంబర్లుగా మార్చే వ్యూహం
సంస్థ అధినేత సోదరీమణులే సారధులు
పేద కుటుంబాల వారే బలిపశువులు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
ఉగ్రవాద కార్యకలాపాల్లో మహిళలు పాల్గొనడం కొత్త కాదు. గతంలో శ్రీలంకను అల్లకల్లోలం చేసిన తమిళ ఈలం ఉగ్రవాద సంస్థ ఎల్టీటీఈలో మహిళలు సూసైడ్ బాంబర్లుగా పని చేసిన చరిత్ర ఉంది. మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ హత్యకు కూడా థాను పేరుతో మానవబాంబుగా మారిన మహిళే ప్రధాన కారణం. అయితే ఇస్లామిక్ ఉగ్రవాదుల్లో మహిళలు క్రియాశీలంగా పని చేయడం చాలా అరుదు. ఒకవేళ ఉన్నా నిఘా, సమాచార మార్పిడి వంటి వాటికే పరిమితమవుతూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆ చరిత్ర మారుతోంది. మహిళలు కూడా ముజాహిదీన్లుగా మారి జిహాదీ కార్యకలాపాల్లో పాల్గొనేలా పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ ఉగ్రవాద సంస్థ జైష్`ఎ`మొహమ్మద్(జేఈఎం) సన్నాహాలు ప్రారంభించింది. భారత్‌లో హింసా విధ్వంసాలకు పాల్పడి అశాంతిని రాజేసేందుకు దశాబ్దాలుగా ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ ఇప్పుడు మరో కుట్రకు తెర లేపింది. ఇంతవరకు పురుషులే ఈ కార్యకలాపాల్లో నిమగ్నం కాగా ఇప్పుడు మహిళలను కూడా ఉగ్రవాదులుగా మార్చి ప్రపంచం మీదికి వదిలేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్‌లో తీవ్రంగా దెబ్బతిన్న ఈ ఉగ్రవాద సంస్థ తిరిగి పుంజుకునేందుకు మహిళలను పావులకు చేసుకోవడానికి తెగిస్తోంది. ఇందులో భాగంగా తమ సంస్థలోనే మహిళా ముజాహిదీన్ల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. కొత్తగా విమన్ వింగ్ ప్రారంభిస్తున్నట్లు ఇటీవల బహిరంగంగానే ప్రకటించి దానికి జమాత్`ఉల్`ముమినాత్ అని పేరు పెట్టింది. ఈ విభాగంలోకి కొత్త రిక్రూట్‌మెంట్లు ప్రారంభించడంతోపాటు వారికి ఆన్‌లైన్‌లో ‘జిహాదీ కోర్సు’ ప్రారంభించింది. తుఫత్ అల్-ముమినాత్ అనే పేరుతో ఈ కోర్సును జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజహర్ సోదరీమణులు సాదియా, సమైరాల నేతృత్వంలో నిర్వహిస్తున్నారు. కొత్తవారికి రోజుకు 40 నిమిషాల పాటు జిహాదీ విద్య బోధిస్తారు. మహిళా ముజాహిదీన్లుగా చేరదలచినవారు 500 పాకిస్తానీ రూపాయలు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ చర్య భారతదేశంతోపాటు ప్రపంచ భద్రతకు సవాలుగా మారుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఉగ్రవాదులుగా మార్చడమే లక్ష్యం
జైష్ చరిత్రలో మహిళలను ఉగ్రవాద కార్యకలాపాల్లోకి తీసుకోవడం ఇదే మొదటిసారి. ఈ సంస్థ అధ్యక్షుడు మౌలానా మసూద్ అజహర్ అంతర్జాతీయ ఉగ్రవాది. మోస్ట్ వాంటెడ్ కూడా. ఆయన తన సోదరీమణులైన సాదియా, సమైరాలను ఈ మహిళా విభాగానికి సారధులుగా నియమించాడు. సాదియా జైష్ మహిళా విభాగం కమాండర్ హోదాలో ఆన్‌లైన్ పాఠాలు నిర్వహిస్తుంది. ఈ కోర్సులో జిహాద్ ప్రాముఖ్యత, ఆవశ్యకతతోపాటు ఇస్లామిక్ దృక్పథంలో మహిళల పాత్ర గురించి చెబుతారని ప్రకటించినా.. దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం మాత్రం సున్నితమైన మహిళలను బ్రెయిన్ వాష్ చేసి రాడికలైజ్ చేసి అవసరమైతే సూసైడ్ బాంబర్లుగా మార్చడమే. ఈ కోర్సుకు ఎంట్రన్స్ ఫీజు పేరుతో రూ. 500 పాక్ కరెన్సీ వసూలు చేయడం ద్వారా జైష్ ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు కూడా సమీకరిస్తున్నారు. ఈ కుట్ర మనదేశానికి, ప్రపంచ భద్రతకు తీవ్రమైన ముప్పుగా మారబోతోంది. 2019 పుల్వామా దాడితో సహా అనేక ఇతర దాడులు, విధ్వంసక చర్యలకు పాల్పడిన చరిత్ర జైష్`ఎ`మహమ్మద్‌ది. ఇప్పుడు ఈ సంస్థలోకి మహిళలను తీసుకోవడం వల్ల దాడులు మరింత రహస్యంగా జరిగే అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారాల ద్వారా రాడికలైజేషన్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది. సోషల్ మీడియా, ఎన్‌క్రిప్టెడ్ యాప్‌ల ద్వారా యువతను, మహిళలను ఆకర్షించడం సులభం అవుతుంది. పాకిస్తాన్‌లో నెలకొన్న ఆర్థిక సమస్యలు, లింగ వివక్ష ఈ రిక్రూట్‌మెంట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. వీటి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళల బలహీనతలను ఉపయోగించుకుంటూ ‘కాశ్మీర్ స్వాతంత్య్రం’ అనే మాయమాటలతో వారిని జైష్ సంస్థ మోసం చేస్తోంది.
మహిళలే ఎందుకంటే..
పహల్గాంలో ఉగ్ర ఘాతుకానికి ప్రతీకారంగా భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ జైష్`ఎ`మహమ్మద్ సంస్థను దారుణంగా దెబ్బతీసింది. ఆ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేయడంతో పాటు పలవురు కమాండర్లను భారత సైన్యం హతమార్చింది. దీంతో కోలుకోలేనంతగా నష్టపోయిన ఆ సంస్థ తిరిగి పుంజుకునేందుకు పాక్ సైన్యం పరోక్ష మద్దతుతో ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే మహిళలను రిక్రూట్ చేయడం ద్వారా తమ ఆపరేషనల్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని చూస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని రావలాకోట్‌లో అక్టోబర్ 19న జరిగిన ‘దుఖ్తరాన్-ఎ-ఇస్లాం’ కార్యక్రమం ఈ రిక్రూట్‌మెంట్‌కు నాంది పలికింది. ఆర్థికంగా వెనుకబడిన మహిళలు, జైష్ కమాండర్ల భార్యలను ఈ కొత్త విభాగంలోకి తీసుకోవాలన్న లక్ష్యంతో ఈ సంస్థ పని చేస్తోంది. తద్వారా ఐసిస్, ఎల్‌టీటీఈ వంటి ఉగ్ర సంస్థల వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. మహిళలు బురఖా ధరించడం ఇస్లామిక్ సంప్రదాయం. పురుషుల మాదిరిగా వారిని భద్రతా బలగాలు స్వేచ్ఛగా తనిఖీ చేయలేవు. ఇవే పురుషుల కంటే మహిళలు నిషేధిత ప్రాంతాల్లోకి వెళ్లడానికి, తనిఖీల నుంచి తప్పించుకుని ఆయుధాలను తలించడానికి, రహస్య సమాచార సేకరణకు, అవసరమైతే దాడులకు పాల్పడేందుకు ఎక్కువ వీలు కల్పిస్తాయని జైష్ నాయకత్వం భావిస్తోంది. అందువల్లే మహిళా జిహాదీలను రూపొందించాలని నిర్ణయించుకుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ కుట్రను ఆదిలోనే అడ్డుకోవాల్సిన అవసరముంది. భద్రతా దళాలు, ఇంటెలిజెన్స్ విభాగాలు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారాలను నిశితంగా గమనిస్తూ ట్రాక్ చేయగలిగితే ఈ కుట్రను మొగ్గ దశలోనే తుంచి వేయవచ్చు. మహిళలను రాడికలైజ్ చేయడం, నిధుల సేకరణకు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారాలను ఉపయోగించడం ద్వారా జైష్ తన ప్రమాదకర ఆలోచనలను విస్తరిస్తోంది. ఇది ఒక దేశ సమస్య మాత్రమే కాదు.. ప్రపంచ భద్రతకు సవాలుగా పరిగణించి దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది.










Comments