రాయచోటికి కన్నీరు.. మదనపల్లికి పన్నీరు
- DV RAMANA

- Dec 30, 2025
- 2 min read

జిల్లాల పునర్విభజన తేనెతుట్టెను గత వైకాపా ప్రభుత్వం కదిపి రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను రెట్టింపు చేసింది. దాని ప్రకంపనలు ఇప్పటికీ చాలాచోట్ల కనిపిస్తున్నాయి రెవెన్యూ డివిజన్లు, మండలాలను వేరే జిల్లాల్లో చేర్చడం, కొత్త డివిజన్ల ఏర్పాటు వంటిపై భిన్నాభిప్రాయాలు, ఆందోళనలు కూడా అప్పట్లో వ్యక్తమయ్యాయి. శాస్త్రీయంగా కాకుండా రాజకీయ కోణంలో పలు మార్పులు చేశారని వైకాపా ప్రభుత్వంపై అప్పట్లో తెలుగుదేశం సహా పలువురు విమర్శలు గుప్పించారు. వాటిలో ప్రధానంగా చెప్పుదగ్గది కొత్తగా ఏర్పాటు చేసిన అన్నమయ్య జిల్లాకు రాయచోటిని కేంద్రంగా చేయడం. దీనిపై అప్పట్లోనే విమర్శలు రేగాయి, రాయచోటి కంటే పెద్ద పట్టణమైన మదనపల్లెను జిల్లా కేంద్రం చేయకపోవడం పట్ల ఆందోళనలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్న ప్రాంతీయ మనోభావాలను, ప్రజల సెంటిమెంట్లను మళ్లీ రెచ్చగొట్టింది. వైకాపా హయాంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుతామంటూ మంత్రివర్గ ఉపసంఘం ద్వారా రూపొందించిన మార్పుచేర్పుల జాబితాను సోమవారం కేబినెట్ ఆమోదించింది. ఈ మార్పుల్లో కీలకమైనది రాయచోటి నుంచి అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకు మార్చడమే. అంతవరకు ఆందోళనలు చేసిన మదనపల్లి వాసులకు ఈ నిర్ణయం సాంత్వన చేకూర్చినా.. సుమారు రెండేళ్లపాటు జిల్లా కేంద్రం హోదా అనుభవించిన రాయచోటి వాసుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అక్కడి ప్రజలే కాదు.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ సైతం తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మార్పుచేర్పులను ఆమోదించిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి, సహచర మంత్రుల సమక్షంలోనే ఆయన కన్నీటిపర్యంతం కావడం ఆ ప్రాంత ప్రజలను మరింత రెచ్చగొట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన్ను ఓదార్చి విశాల రాష్ట్ర ప్రయోజనాలను, ప్రాదేశిక సమగ్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా కేంద్రం మార్పు ప్రతిపాదనను ఆమోదించక తప్పడంలేదని వివరించారు. అయితే రాయచోటిని జిల్లా కేంద్రం స్థాయిలోనే అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అయినా రాంప్రసాద్‌లోని ఉద్వేగానికి అడ్డుకట్టపడలేదు. రాయచోటి నియోజకవర్గం ఏకాకి అయిపోయిందని వ్యాఖ్యానించారు. జరిగిన పొరపాటుకు, గ్రహపాటుకు తాను కూడా బాధ్యడినేనంటూ నియోజకవర్గ ప్రజలకు క్షమాపణలు చెప్పారంటే ఈ నిర్ణయం ఆయన్ను ఎంత కలచివేసిందో అర్థమవుతుంది. తాను గెలిస్తే జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మార్చకుండా కొనసాగించేలా చూస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి గెలిచానని, ఇప్పుడు దానికి విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాన్ని సాక్షీభూతంగా ఉండటంతోపాటు తాను కూడా తలాడిరచాల్సి వచ్చిందని ఆవేదనతో వ్యాఖ్యానించారు. మాట నిలబెట్టుకోలేకపోయినందుకు నియోజకవర్గ ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియడంలేదని ఆయన బేలగా అన్నారు. మరోవైపు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై అసంతృప్తితో రాయచోటి రగిలిపోతోంది. జిల్లా కేంద్రాన్ని మదనపల్లికి తరలిస్తారన్న వార్తలు రావడంతో ఆదివారం నుంచే జిల్లా సాధన సమితి, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసనలు, ఆందోళనలు జరుగుతుండగా, సోమవారంనాటి మంత్రివర్గ నిర్ణయం వాటికి మరింత ఆజ్యంపోసింది. ప్రజలు రోడ్లెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు, మానవహారాలు చేశారు. తాజా నిర్ణయాన్ని ఉపసంహరించుకుని రాయచోటినే జిల్లాకేంద్రంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్ణయం మార్చుకునే వరకు తమ పోరాటం ఆగదని ఆందోళనకారులు హెచ్చరించారు. అవసరమైతే ఆమరణ దీక్షలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజల ఆందోళనను గమనించిన మంత్రి రాంప్రసాద్‌రెడ్డి గత రెండుమూడు రోజుల్లో ముఖ్యమంత్రిని పలుమార్లు కలిసి పరిస్థితిని విన్నవించారు. అయినా రాయచోటిని తప్పిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పరిపాలన, అభివృద్ధి పరంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నది ప్రభుత్వ వాదనగా ఉంది. ఇదే విషయాన్ని కన్నీరు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్‌కు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే చెప్పి ఓదార్చడానికి ప్రయత్నించారు. ఇక్కడ ఒక విషయం గమనార్హం. తాజా నిర్ణయంతో జిల్లా కేంద్రం హోదా పంపిన మదనపల్లి జనాభాపరంగా, వాణిజ్యపరంగా, భౌగోళికంగా.. ఇలా ఏ రంగంలో చూసుకున్నా రాయచోటి కంటే పెద్ద పట్టణం. బ్రిటీష్ కాలం నుంచే ఇక్కడ విద్య వైద్యరంగాలు పునాదులు వేసుకుని బలపడ్డాయి. కానీ గత ప్రభుత్వం మదనపల్లిని కాదని రాయచోటిని కొత్తగా ఏర్పాటుచేసిన అన్నమయ్య జిల్లాకు కేంద్రంగా ప్రకటించింది. అప్పట్లో రాయచోటి ఎమ్మెల్యేగా ఉన్న వైకాపా నేత, ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డికి, తద్వారా వైకాపాకు రాజకీయ ప్రయోజనం చేకూర్చడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశమని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. జిల్లాకేంద్రాన్ని ఇప్పుడు మళ్లీ మార్చడం వల్ల రాయచోటి ప్రజల ఆగ్రహానికి గురికావచ్చుగానీ.. దానికంటే పెద్ద పట్టణమైన మదనపల్లితోపాటు పశ్చిమ రాయలసీమ ప్రజల ఆదరణ దక్కుతుందన్న రాజకీయ కోణంలోనే ప్రభుత్వం జిల్లా కేంద్రం మార్పు నిర్ణయం తీసుకుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ అనుకూలవర్గాల వాదన మరోలా ఉంది. అన్నమయ్య జిల్లాలో నిన్నటి వరకు విచిత్రమైన భౌగోళిక వాతావరణం ఉండేది. కొన్ని నియోజకవర్గాల ప్రజలు జిల్లా కేంద్రం రాయచోటిలోని కలెక్టర్, ఇతర కార్యాలయాలకు రావాలంటే దాదాపు వంద కిలోమీటర్లకుపైగా ప్రయాణించాల్సి వస్తోంది. ఇప్పుడు మదనపల్లికి మార్చడం వల్ల జిల్లాకు దాదాపు కేంద్రంగా, అన్ని ప్రాంతాలకు సమానదూరంలో ఉంటుందంటున్నారు. సాంకేతిక కారణాలు తప్ప జిల్లా కేంద్రం మార్పులో రాజకీయ కారణాలు లేవని, జిల్లా కేంద్రం తరలిపోయినంత మాత్రాన.. రాయచోటిలో ఇప్పటికే ప్రతిపాదించిన అభివృద్ధి పనులు నిలిచిపోవని ప్రభుత్వం భరోసా ఇస్తోంది.










Comments