రాజకీయ అనారోగ్యమే కారణం!
- DV RAMANA

- Jul 23, 2025
- 2 min read

ఆరోగ్య కారణాలతో పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ పేర్కొన్నారు. అయితే ఆయన చెబుతున్న ఆరోగ్య కారణాలు వేరని.. అవి శరీరానికి సంబంధించినవి కావని.. రాజకీయాలకు, మనసుకు సంబంధించినవని రాజీనామాకు కొన్ని గంటల ముందు జరిగిన పరిణామాలను ఉటంకిస్తూ కథనాలు, విశ్లేషణలు ప్రసార మాధ్యమాల్లో వస్తున్నాయి. దీని వెనుక పాలక బీజేపీ అధిష్టానంతో తలెత్తిన విభేదాలు, వారు తనపట్ల వ్యవహరించిన తీరుతో మనస్తాపానికి గురై ధన్‌ఖడ్ రాజీనామా చేశారంటున్నారు. సహజంగానే ఆవేశపూరితంగా వ్యవహరించే ధన్‌ఖడ్ పార్లమెంటు వర్షాకాల ప్రారంభం రోజే బీజేపీ పెద్దలకు నచ్చని నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల తన ఇంట్లో నోట్ల కట్టలతో వార్తల్లోకి ఎక్కిన అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంగనాథ్ వర్మపై ప్రతిపక్షాలు రాజ్యసభలో ప్రతిపాదించి అభిశంసన తీర్మానంపై చర్చకు సభాధ్యక్షుడి హోదాలో ధన్‌ఖడ్ అనుమతించి, అందుకు ఏర్పాట్లు చేయమని రాజ్యసభ సెక్రటేరియట్‌ను ఆదేశించడం బీజేపీ పెద్దలకు సుతరామూ నచ్చలేదు. ప్రభుత్వం తీసుకోవాల్సిన క్రెడిట్‌ను ధన్‌ఖడ్ తన చర్య ద్వారా ప్రతిపక్షానికి దక్కేలా చేశారని భావించింది. సభలోనే నడ్డా ఈ అంశంపై చేసిన వ్యాఖ్యలు ఉప రాష్ట్రపతిని అసంతృప్తికి గురి చేశాయి. అదే సమయంలో పలువురు బీజేపీ పెద్దలు ఫోన్లు చేసి తనపై అవిశ్వాస తీర్మానం పెడతామన్నట్లు హెచ్చరిక ధోరణిలో మాట్లాడటంతో మనస్తాపానికి గురయ్యారు. అవిశ్వాసాన్ని ఎదుర్కోవడం కంటే రాజీనామా చేసి గౌరవంగా తప్పుకోవడం మంచిదని భావించినట్లు కనిపిస్తోంది. బీజేపీ అంతర్గత రాజకీయాల వల్ల దేశంలోని రెండో అత్యున్నత రాజ్యాంగ పదవికి అవమానం జరిగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ అనూహ్య పరిణామం ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక పెద్ద అంతర్గత తిరుగుబాటుకు సంకేతంగా భావిస్తుండటంతో పాటు రాజ్యాంగ వ్యవస్థలు, పదవుల స్వయంప్రతిపత్తిని కాపాడుకోవాల్సిన అవసరంపై దేశవ్యాప్తంగా సరికొత్త చర్చకు దారితీసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణ వ్యూహంలో భాగంగా ఇద్దరు న్యాయమూర్తులపై అభిశంసన తీర్మానాలను ప్రవేశపెట్టాలని బీజేపీ నిర్ణయించింది. కానీ రాజ్యసభ చైర్మన్ హోదాలో ఉన్న ధన్‌ఖడ్ ఈ విషయంలో ప్రభుత్వానికి అనుకూలంగా కాకుండా స్వతంత్ర వైఖరి ప్రదర్శించారు. ముఖ్యంగా.. జస్టిస్ శేఖర్ యాదవ్ అభిశంసన ప్రతిపాదనలో సాంకేతిక లోపాలున్నాయని బహిరంగంగా వ్యాఖ్యానించడమే కాకుండా ఆ తీర్మానాన్ని సభలో లిస్ట్ చేయాలని పార్లమెంట్ సెక్రటరీ జనరల్‌ను ఆదేశించారు. చైర్మన్ తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయం బీజేపీ అధిష్టానానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ధన్‌ఖడ్ వైఖరికి ప్రతిగా, బీజేపీ తన అసంతృప్తిని పరోక్షంగా కానీ బలంగా కానీ తెలియజేసింది. పార్లమెంటు కార్యకలాపాల అజెండాను నిర్ణయించే కీలకమైన బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశానికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇద్దరూ గైర్హాజరయ్యారు. చైర్మన్‌కు కనీస ముందస్తు సమాచారం లేకుండా జరిగిన ఈ చర్యను ధన్‌ఖడ్ తీవ్ర అవమానంగా, తన ఆత్మగౌరవానికి భంగకరంగా భావించారు. రాజ్యాంగబద్ధమైన తన విధులకు అడ్డుకట్ట వేయడాన్ని సహించలేక, మౌనంగా వైదొలగాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టమవుతోంది. ఇటీవల గుండెకు స్టెంట్ వేయించుకున్నప్పటికీ, ఆయన చురుగ్గానే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని జైపూర్ పర్యటనకు కూడా సిద్ధమయ్యారని అందువల్ల ఆరోగ్య కారణం ఒక సాకు మాత్రమేనని అంటున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ పదవులు ఉన్నత రాజ్యాంగ పదవులు. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత ఆ పదవుల్లో కూర్చున్నవారిపై ఉంటుంది. కానీ చాలా కాలంగా ఈ అత్యున్నత పదవులు రాజకీయ పునరావాసం కేంద్రాలుగా మారిపోయాయన్నది వాస్తవం. పాలక పార్టీలు వయసు మీరి రాజకీయంగా రిటైర్‌మెంట్ తీసుకున్న లేదా తమకు అతి విశ్వాసపాత్రులుగా ఉన్న పార్టీ నేతలను ఫక్తు రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తూ రాజ్యాంగ పదవుల్లో మెజారిటీ బలంతో కూర్చోబెడుతున్నారు. అలా ఎన్నికైన(ఎంపికైన) వారిలో పలువురు పార్టీ భేదం చూపించకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తున్నప్పటికీ పలు సందర్భాల్లో ముఖ్యంగా గవర్నర్లు తమ పార్టీ ప్రభుత్వాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అపవాదు ఉంది. సహజంగానే ఇప్పుడు ధన్‌ఖడ్ విషయంలో బీజేపీ తీరు రాజ్యాంగ వ్యవస్థల ఔన్నత్యంపై నీలినీడలు ప్రసరింపజేసింది.










Comments