రాజకీయ కత్తుల కరచాలనం!
- NVS PRASAD
- Jul 28
- 2 min read
విలువలకు పట్టం.. ప్రత్యర్థుల సంగమం
ప్రత్యర్థి అయినా ధర్మానను గౌరవించిన గొండు
ఎన్నికల్లోనే రాజకీయమన్న సంప్రదాయానికి పెద్దపీట
సీనియర్ అయిన ధర్మానకే ముఖ్యఅతిధి పాత్ర
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ప్రత్యర్థులు ఎదురుపడ్డారు. కానీ అక్కడేమీ యుద్ధం జరగలేదు. పైగా ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. కుశల ప్రశ్నల వర్షం ఇద్దరి మీదా కురిసింది. అనంతరం ఇద్దరూ కలిసే వేదికను పంచుకున్నారు. ఆద్యంతం వారు సుహృద్భావ పూరితంగా వ్యవహరించడం కార్యక్రమానికి హాజరైన వారందిరినీ విస్మయానందాలకు గురి చేసింది. అదే సమయంలో ఎంత ఒదిగి ఉంటే.. గౌరవం అంత ఇనుమడిస్తున్న దానికి ఈ ఉదంతం నిదర్శనంగా నిలిచింది. ఎమ్మెల్యే గొండు మాజీ అయిన ధర్మానను గౌరవించడం ఆయనకే భూషణంగా భాసించింది. ఈ అద్భుత దృశ్యానికి నగరంలో జరిగిన లయన్స్ క్లబ్ హర్షవల్లి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం వేదికైంది. సాధారణంగా రాజకీయ ప్రత్యర్థులు ఒకే కార్యక్రమంలో పాల్గొనాల్సి వచ్చినప్పుడు ఎవరో ఒకరు ముందు వచ్చి వెళ్లిపోతారు.. ఆ తర్వాతే రెండోవారు హాజరుకావడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. నిర్వాహకులు కూడా అనవసర ఉద్రిక్తతలను నివారించడానికి ప్రత్యర్థులు ఎదురుపడకుండా చాలా జాగ్రత్తగా కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తుంటారు. కానీ ఆదివారం లయన్స్ క్లబ్ కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అనూహ్యంగా వైకాపాకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ప్రస్తుత ఎమ్మెల్యే గొండు శంకర్ ఎదురుపడ్డారు. అయితే ఇద్దరూ ముభావంగానో, మొహం ముడుచుకుంటూనో ముఖం చాటుచేయడానికి ప్రయత్నించకపోగా ఒకరికొకరు పలకరించుకుని, కుశల ప్రశ్నలు వేసుకున్నారు. 2024 ఎన్నికల్లో వైకాపా నుంచి ధర్మాన, టీడీపీ నుంచి శంకర్ పోటీ చేసి ముఖాముఖీ తలపడ్డారు. ఎన్నికల్లో ప్రత్యర్థులుగా వ్యవహరించిన వారిద్దరూ ఎన్నికల తర్వాత ఇంతవరకు పరస్పరం ఎదురుపడలేదు. కానీ లయన్స్ క్లబ్ కార్యక్రమం ఆ దృశ్యాన్ని ఆవిష్కరించింది. కార్యక్రమానికి గొండు శంకర్ ముందుగా వచ్చారు. ఆయన మొక్కలు నాటుతున్న సమయంలోనే ధర్మాన వచ్చేశారు. ఆయన్ను గమనించిన ఎమ్మెల్యే శంకర్ ఏమాత్రం సంకోచించకుండా, ఆలోచించకుండా ఎదురెళ్లి ఆయన్ను పలకరించారు. ఆరోగ్యం గురించి వాకబు చేశారు. ముందుగా నిర్వాహకులు ధర్మానకు కాఫీ ఇచ్చారు. ఈలోగా వేదికపైకి పిలుపు రావడంతో ‘నేను వస్తాను.. ముందు మీరు స్టేజి మీదకు వెళ్లండి’ అని ధర్మాన సూచించడంతో శంకర్ వేదికపైకి వెళ్లారు. అయితే సీట్లు కూర్చోకుండా ధర్మాన వచ్చే వరకు నిలబడే వెయిట్ చేయడం ద్వారా సభామర్యాద పాటించారు. ఆయన వచ్చాక ఇద్దరూ ఒకసారే ఆశీనులయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఎమ్మెల్యే గొండు శంకర్‌నే నిర్వాహకులు నిర్ణయించారు. కానీ పెద్దవారిని గౌరవించాలన్న ఉద్దేశంతో శంకర్ తానే కాస్త తగ్గారు. మాజీమంత్రి ధర్మాననే ముఖ్యఅతిధి స్థానంలో మాట్లాడిరచాలని నిర్వాహకులకు సూచించారు. ఈ దృశ్యాలను చూసినవారు నేటి రాజకీయాల్లో ఇటువంటివి కనగలమా? అని ఆశ్చర్యానందాలతో వ్యాఖ్యానించారు. తాను సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ, తన చేతిలో ధర్మాన ఓడిపోయినప్పటికీ.. రాజకీయాల్లో తనకంటే సీనియర్ అయిన ధర్మానను గౌరవించడం ద్వారా విలువలున్న నేతగా గొండు శంకర్ మన్ననలందుకున్నారు.
Yorumlar