రాజకీయ చదరంగంలో వ్యవస్థలే పావులు
- DV RAMANA

- Jul 24, 2025
- 2 min read

రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, గవర్నర్.. పేరుకు వీటిని గౌరవనీయ పదవులని అంటున్నా.. వాస్తవా నికి ఇవి అత్యున్నత రాజ్యాంగ వ్యవస్థలు. అందుకే రాష్ట్రపతిని దేశ ప్రథమ పౌరుడని, ఉప రాష్ట్ర పతిని ద్వితీయ పౌరుడని అంటారు. అలాగే ఒక రాష్ట్రానికి రాజ్యాంగ అధిపతిగా ఉండే గవర్నర్‌ను రాష్ట్ర ప్రథమ పౌరుడిగా పరిగణిస్తారు. దేశ భవిష్యత్తు గురించి ఎంతో ఆలోచించి.. ఎన్నికల ద్వారా ఎన్నికయ్యే ప్రభుత్వాల్లో అనుచితంగా జోక్యం చేసుకోకుండా.. అలాగని ప్రభుత్వాలు హద్దులు మీరి ప్రవరిస్తుంటే వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తుంటే చూస్తూ ఊరుకోకుండా తగిన చర్యలు తీసుకునే అధికా రం కల్పిస్తూ ఈ వ్యవస్థలను రాజ్యాంగ నిర్మాతలు ఏర్పాటు చేశారు. కానీ కాలక్రమంలో మన ప్రజా స్వామ్యం పక్కదారి పడుతున్నట్లే ఈ వ్యవస్థలు కూడా పతనం అవుతున్నాయి. ఈ పరిస్థితికి ప్రభు త్వాలను నడుపుతున్న పాలక పార్టీలే కావడం విచారకరం. అయిలే ఇంతవరకు గవర్నర్లనే తమ తాబేదార్లుగా కేంద్రంలోని ప్రభుత్వాలు వాడుకుంటున్నాయని విమర్శలు ఉన్నాయి. దాంతో ఆ పదవి ఔన్నత్యం, విలువ పతనావస్థలోకి పడిపోయాయి. అయితే నిన్న గాక మొన్న ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ హఠాత్తుగా రాజీనామా చేయడం వెనుక పాలక పార్టీ రాజకీయమే కారణమని స్పష్టమైంది. దాంతో గవర్నర్ల వ్యవస్థకు ఉప రాష్ట్రపతి పదవి కూడా రాజకీయ ఫంకిలంలో చిక్కుకుందన్న ఆందో ళన వ్యక్తమవుతోంది. విశేషమేమిటంటే.. ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్ ధన్‌ఖడ్ అంతకుముందు పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా ఉన్నారు. గవర్నర్ అనగానే రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తూ రాజ్యాంగ విలువలను కాపాడే బాధ్యత ఉన్న రాజ్యాంగ వ్యవస్థగా అందరూ భావిస్తారు. అయితే వెనకటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆ ఊహను తలకిందులు చేసి గవర్నర్ వ్యవస్థను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం ప్రారంభించాయి. చరిత్రలో అటువంటి ఉదంతాలు బోలెడు కనిపి స్తాయి. దశాబ్దకాలానికిపైగా అధికారంలో ఉన్న ఎన్డీయే హయాంలో ఆ వ్యవస్థను ఏమైనా గౌరవిస్తు న్నారా అంటే అవునని చెప్పలేని పరిస్థితి. రాజమార్గంలో బాహాటంగానే.. ఇంకా చెప్పాలంటే గవర్నర్ పదవిని కొత్తగా నిర్వచించదలచుకున్నట్లు వ్యవహరిస్తోంది. ఆ క్రమంలోనే రాజ్‌భవన్లు రాజకీయ భవన్‌లుగా మారుతున్నాయన్న విమర్శలు జోరందుకుంటున్నాయి. ఇదే ధన్‌ఖడ్ బెంగాల్ గవర్నర్‌గా ఉన్నప్పుడు అక్కడ ఎన్నికల ద్వారా ఏర్పడిన మమతాబెనర్జీ సర్కారు పట్ల వ్యవహరించిన తీరు.. అను సరించిన ఘర్షణాత్మక వైఖరి.. రాజ్‌భవన్ సమాంతర ప్రభుత్వం నడుపుతోందన్న విమర్శలకు గురైంది. ఇదంతా కేంద్రంలోని ఎన్డీయే సర్కారు వ్యూహం, దన్నుతోనే చేశారన్నది బహిరంగ రహస్యం. గవ ర్నర్ వ్యవస్థను విమర్శల పాల్జేసిన ధన్‌ఖడ్ వంటి వ్యక్తికి ఎన్డీయే సర్కారు ప్రమోషన్ ఇచ్చి ఉప రాష్ట్ర పతి పదవిలో కూర్చోబెట్టింది. అంటే ప్రజలు ఎన్నుకున్న ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టిన ఆయనగారి తీరు కేంద్ర నాయకత్వానికి ఎంత బాగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఎదైనా తన దాకా వస్తే గానీ తెలియదంటారు. దాన్నే నిజం చేస్తూ ఇప్పుడు ధన్‌ఖడ్ వంతు వచ్చింది. కేంద్ర పెద్దల ఆలోచనకు భిన్నంగా వ్యవహరించిన పాపానికి నాడు మమత సర్కారు ఎదుర్కొన్న క్షోభనే ఇప్పుడు ఉప రాష్ట్రపతి వంటి అత్యున్నత హోదాలో ఉన్నా కూడా ధన్‌ఖడ్ ఎదుర్కోక తప్పలేదు. గవర్నర్‌గా చూపిన వ్యవహారశైలినే ఉపరాష్ట్రపతి హోదాలోనూ కొనసాగించారు. సుప్రీంకోర్టు అధికార పరిధిని ప్రశ్నించడంతో సహా రకరకాల వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అది కాస్త వికటించింది. రాజ్యసభ చైర్మన్‌గా ఆపరేషన్ సింధూర్‌పై మాట్లాడే అవకాశం మొదటగా ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వడం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తికి వ్యతిరేకంగా ప్రతిపక్షం ఇచ్చిన అభిశంసన తీర్మానాన్ని స్వీకరించడం వంటి పరిణామాలు అధికార కూటమి కన్నెర్రకు, ధన్‌ఖడ్ రాజీనామాకు కారణమయ్యాయి. తెరచాటు కారణాలు ఎలాంటివైనా తెరముందు జరిగింది మాత్రం స్పష్టంగా, సందేహానికి తావులేకుండా కనిపిస్తూనే ఉంది. ఈ పరిణామాలు ఉప రాష్ట్రపతి అనే వ్యవస్థపైనా, రాజ్యసభ చైర్మన్ అనే దాని అనుబంధ వ్యవస్థపైనా నీలినీడలు కమ్ము కుని పతన సంకేతాలనిస్తున్నాయి. పాలక పార్టీల రాజకీయ చదరంగంలో ఒకదాని తర్వాత ఒకటిగా రాజ్యాంగ పదవులు, వ్యవస్థలు పావులుగా మారి బలైపోతుండటం ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువ ల పతనానికి నిదర్శనం. ఇది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు క్షేమదాయకం కాదు.










Comments