top of page

రాజకీయానికే కొవ్వు పట్టింది!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 3 days ago
  • 2 min read

దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలవారు ఇష్టపడే, వినియోగించే స్వీట్ లడ్డూ. ఇక లడ్డూ ప్రసాదమంటే పడిచచ్చిపోతారు. ప్రత్యేకించి కలియుగ దైవం తిరుమల వెంకన్న లడ్డూ ప్రసాదమంటే ఇక చెప్పనక్కర్లేదు. ఆ వేంకటేశ్వరస్వామికి ఎంత ప్రీతిపాత్రమో.. అంతకుమించి అన్నట్లు భక్తులు లడ్డూ ప్రసాదం ప్రస్తావన వస్తే చాలు.. నాలుక చప్పరించేస్తారు. తిరుపతి వెళ్లేవారు ఇచ్చి కాసింత ప్రసాదమైనా భక్తితో రుచి చూడాల్సిందేనని తపించిపోతారు. ఆ దేవదేవుడి ప్రసాదం అనే భక్తిభావంతోపాటు అమోఘమైన రుచి వెంకన్న లడ్డూకు అత్యంత విశిష్టతను ఆపాదించింది. కానీ ఇప్పుడు ఆ లడ్డూ పదం వింటినే మొహం చిట్లించే పరిస్థితికి తీసుకొచ్చారు మన నాయకమ్మన్యులు. ఈ విషయంలో ప్రభుత్వపక్షం, ప్రతిపక్షం పోటీ పడుతున్నాయి. ఏడాదికిపైగా ఆ లడ్డూ చుట్టూనే పనికిమాలిన, నీతిమాలిన రాజకీయాలు నడుస్తున్నాయి. దీనివల్లే ఒనగూడే రాజకీయ ప్రయోజనాల మాటేమోగానీ.. భక్తుల మనోభావాలు దెబ్బతిసేలా.. తిరుమల ప్రతిష్ట మసకబార్చేలా ఈ వ్యవహారం నానాటికీ శతిమించిపోతోంది. పోటాపోటీ ధర్నాలు, రాజకీయం ముసుగులో వ్యక్తిగత దూషణభూషణలు, ఆ సాకుతో కేసులు, అరెస్టులు చూస్తుంటే.. తిరుమల వెంకన్న లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యి పేరుతో జంతువుల కొవ్వు వాడారన్న అప్పుడెప్పుడో చంద్రబాబు చేసిన ఆరోపణలో ఎంత నిజముందో గానీ.. రాజకీయాల్లో కొవ్వు పెరిగిపోయిందన్న ఏహ్యభావం కలుగుతోంది. వైకాపా ప్రభుత్వ హయాంలో తిరుమలలో లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి సరఫరాలో అక్రమాలు జరిగాయని, జంతువుల కొవ్వు కలిపిన నాసిరకం నెయ్యి సరఫరా చేసి వందల కోట్లు దండుకున్నారని అప్పట్లో చంద్రబాబు చేసిన ఆరోపణలను, ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అందుకోవడం, దీనిపై విచారణకు సిట్ వేయడం తెలిసిందే. సిట్ ఇచ్చిన నివేదిక సరికొత్త రాజకీయ పోరాటానికి ఆజ్యం పోసింది. అప్పట్లో తిరుమలకు సరఫరా అయిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిన ఆనవాళ్లు లేవని.. సాదా నూనె, కొన్ని రసాయనాలు కలిపి తయారు చేసినట్లు సిట్ తన నివేదికలో పేర్కొంది. ఈ అంశాలనే అధికార, ప్రతిపక్షాలు తమకు అనుకూలమైన విషయాన్ని పట్టుకుని రాజకీయ యుద్ధానికి తెరతీశాయి. జంతువుల కొవ్వు లేదని సిట్ నిర్థారించినందున అధికారపక్షం తమపై చేసిందంతా దుష్ప్రచారమేనని, తద్వారా భక్తుల మనోభావాలను దెబ్బతీసిందంటూ వైకాపా రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. కానీ అది అసలు నెయ్యే కాదని రసాయనాల మిశ్రమమని కూడా సిట్ పేర్కొన్న అంశాన్ని కావాలనే విస్మరించింది. సరిగ్గా ఇదే విషయాన్ని అధికారపక్షం తనకు అనుకూలంగా మలచుకుని నెయ్యి కలపడం నిజమేనంటూ పోటీ ఆందోళనలు చేపట్టింది. వెరసి నెయ్యిలో ‘కొవ్వు’ రాజకీయం విషమించింది. తిరుమల లడ్డు, ఇతర ప్రసాదాల తయారీకి వాడే పదార్థాలను 1980కి ముందు నాణ్యత పరీక్షల కోసం మైసూరులోని ల్యాబ్ కు పంపేవారు. రిపోర్టు రావటానికి వారం పట్టేది. ఆ తర్వాత తిరుమలలోనే ఆ ల్యాబ్ ఏర్పాటు చేశారు. అదే కాలక్రమంలో హెల్త్ విభాగంగా మారి లడ్డూతోపాటు వడ, ఆప్పం వంటి ఇతర ప్రసాదాలతో పాటు మంచినీరు, చెత్త నిర్వహణ, నిత్యాన్నదానం నాణ్యత పరీక్షలకు సుమారు 500 మంది శాశ్వత, రెండువేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రసాదాల తయారీలో ప్రతి పదార్థాన్ని పరీక్షించి నాణ్యత ప్రమాణాల మేరకు లేకపోతే తిరస్కరిస్తుంటారు. ఏ ప్రభుత్వం ఉందన్నదానితో నిమిత్తం లేకుండా అలా తిరస్కరించిన ఉదంతాలు కోకొల్లలుగా ఉన్నాయి. అలా గత ప్రభుత్వ హయాంలో తిరస్కరణకు గురైన ఒక నెయ్యి ట్యాంకరే రాష్ట్రంలో ఏడాది కాలంగా రాజకీయాన్ని రగిలిస్తోంది. దీనికోసమే నాయకులు, కార్యకర్తల్లో కొందరు భక్తులుగా మారిపోయి మెడలో కండువాలు వేస్తే.. మరికొందరు వంటి మీద కాషాయం నుదుట పెద్ద బొట్టు ధరించారు. ఎమ్మెల్యేల సంఖ్యలో 12 పైసల వాటా ఉన్నవారు ఏకంగా పావలా నటన చేయటం, తిరుమల పవిత్రత కాపాడటానికి బదులు ఆ ప్రసాదంలో ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిపారని ప్రచారం చేయడమే కాకుండా.. మనందరికీ దూరంగా అయోధ్యలో ఉన్న బాలరాముడ్ని కూడా ఈ రొచ్చులోకి లాగేశారు. సిట్ రిపోర్టులో ఇంతకు ముందు ప్రచారం చేసినట్లు జంతువుల కొవ్వు లేదని నిర్థారించగానే ప్రతిపక్ష పార్టీ రోడ్లపైకి వచ్చి ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడంతో రభస మొదలైంది. దీనివల్ల రాజకీయంగా నష్టపోతామేమోనని భావించిన అధికారపార్టీ వెంకన్నను, తిరుమల లడ్డూను పోస్టర్ల రూపంలో గోడల మీదకు తెచ్చేసింది. ఆ పోస్టర్లను చించడానికి ప్రతిపక్షం, కాపాడాలని అధికారపక్షం కాపాలాకాయడాలు.. ఆ క్రమంలో వ్యక్తిగత దూషణలు, బూతులు లంకించుకోవడం, ప్రమేయంలేని పెద్దలను లాగడం.. ‘ముఖ్యమంత్రి వస్తాడా.. వాడి అమ్మ మొగుడు వస్తాడో.. రమ్మను’ అని వివేచన మరిచి విరుచుకుపడిన ప్రతిపక్ష మాజీ మంత్రి.. పర్యవసానంగా దాడులు, విధ్వంసాలు, అరెస్టులు. ఈ పరిణామాలు చూస్తే కొవ్వు కలిసింది లడ్డులో కాదని.. మన రాజకీయాలకే కొవ్వెక్కిందని అనిపించకమానదు. నిజంగా ఇరుపక్షాలకు వెంకన్నస్వామి మీద, తిరుమల పవిత్రత మీద అవ్యాజమైన ప్రేమ ఉందా? అన్నది అనుమానవే. దేవుడు సంగతి పక్కనపెడితే.. కనీసం రాష్ట్రం మీద, ఓటు వేసిన ప్రజల మీదన్నా ఇరుపక్షాలకు బాధ్యత ఉండాలి కదా? ఇలా ద్వేషాలు పెంచుకుంటూ, గొడవలు పడుతూ విధ్వంసాలకు పాల్పడుతూపోతే అసలు రాష్ట్రం ఎప్పటికైనా కోలుకొంటుందా! తాత్కాలిక రాజకీయ లబ్ధి కోసం, ఒక సంఘటన నుంచి మరో సంఘటనకు ఘర్షణలు పెంచుకొంటూ పోతుంటూ రాజకీయానికి విలువేముంటుంది? రేపటితరానికి రాజకీయాలపై ఎలాంటి దురభిప్రాయం, ఏహ్యభావం ఏర్పడుతుందో? అందరూ ఒక్కసారి ఆలోచించాలి. ఇంతవరకు జరిగిన రచ్చ చాలు.. తప్పొప్పులు ఎంచే బాధ్యతను ప్రజలకు వదిలేస్తేనే మేలు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page