top of page

రాజకీయ పోరాటమా.. ఆరాటమా!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Oct 29
  • 2 min read
ree

మళ్లీ సేమ్‌ ఆరోపణలు.. వాటికి ఖండన మండనలు.. వాటికి ఆధారం ఏమిటంటే.. ఒకానొక పత్రికలో వచ్చిన వార్తాకథనం. అంతేతప్ప కొత్తగా కనుగొన్నదేమీ లేదు. ఇదీ దేశంలో ప్రముఖ పారిశ్రామిక గ్రూప్‌గా ఉన్న అదానీ విషయంలో గత దశాబ్దకాలంగా రేగుతున్న రాజకీయ దుమారం. అదే క్రమంలో ఇప్పుడు మరోసారి ఆ గ్రూప్‌పైనా, తద్వారా కేంద్ర పెద్దలపైనా ఆరోపణల రాళ్లు రువ్వే కార్యక్రమం జరుగుతోంది. ఈ చర్యలకు ప్రధాన హేతువు ఏమిటంటే.. అమెరికాకు చెందిన వాషింగ్టన్‌ పోస్టు ప్రచురించిన ఒక కథనం. రాజకీయ ఒత్తిడితో దేశంలోని అగ్రశ్రేణి బీమా సంస్థ ఎల్‌ఐసీ అదానీ గ్రూప్‌ సంస్థల్లో 3.9 బిలియన్‌ డాలర్లు అంటే రూ.33 వేల కోట్ల భారీ పెట్టుబడులు పెట్టిందన్నది ఆ వార్తాకథనంలోని సారాంశం. దీన్నే అందిపుచ్చుకొని భారతీయ పత్రికలు ది హిందూ, సండే టైమ్స్‌ రెండూ ఒకేసారి కూడబలుక్కున్నట్లు ఈ నెల 26న ఇదే కథనాన్ని కొన్ని మార్పుచేర్పులతో పతాక శీర్షికతో ప్రచురించాయి. ఈ కథనాలను పట్టుకుని కాంగ్రెస్‌ పార్టీ ఎన్డీయే సర్కారుపైన, ముఖ్యంగా మోదీపై ఒంటికాలిపై లేచి ఆరోపణలు గుప్పించడం ప్రారంభించింది. ఈ వివాదానికి తెరతీసిన పరిణామాలను పరిశీలిస్తే.. కొన్నాళ్ల కిందట అమెరికా యూఎస్‌ సెక్యూరిటీస్‌ విభాగం అధికారులు అదానీ గ్రూప్‌ సంస్థలపై అవినీతి, మోసం తదితర ఆరోపణలు మోపాయి. దాంతో అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్థికసంస్థలు అదానీ సంస్థల్లో ఉన్న తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నాయి. ఫలితంగా ఆ గ్రూప్‌ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఆ ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ, నీతి ఆయోగ్‌ ఒత్తిడితో ఎల్‌ఐసీ అదానీ గ్రూపులో భారీ పెట్టుబడులు పెట్టిందన్నది వాషింగ్టన్‌ పోస్టు.. తర్వాత హిందూ, సండే టైమ్స్‌ కథనాల సారాంశం. అమెరికా సెక్యూరిటీస్‌ విభాగం చర్యలతో ఇన్వెస్టర్లలో అదానీ గ్రూపు పట్ల విశ్వాసం దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. దీన్ని నిలబెట్టడానికే ఎల్‌ఐసీతో బలవంతంగా పెట్టుబడులు పెట్టించారని ఈ పత్రిక కథనాల ఆధారంగా కాంగ్రెస్‌ ఆరోపణలు లంకించుకుంది. దీనిపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు జరిపించాలన్న తన పాత డిమాండ్‌ను మరోసారి తెరపైకి తెచ్చింది. అదానీ విషయంలో కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలు ఆరోపణలు, విచారణ డిమాండ్లు ఇప్పటివి కావు. గతంలో దేశంలో గంగవరం సహా పలు పోర్టుల నిర్వహణను, అగ్రగామి పోర్టుగా ఉన్న విశాఖ పోర్టు ట్రస్ట్‌లోని కొన్ని బెర్తులను అదానీ గ్రూపునకు కట్టబెట్టడం వంటి అంశాల్లోనూ ఈ తరహా ఆరోపణలు, విచారణ డిమాండ్లు వెల్లువెత్తి.. తర్వాత చల్లారిపోయాయి. ఇప్పుడు ఎల్‌ఐసీ పెట్టుబడులకు సంబంధించి కూడా అవే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రధానమంత్రి మోదీకి సన్నిహితులైనందునే అదానీ గ్రూపులో ప్రభుత్వ సంస్థల నిధులను అనుచితంగా పెట్టుబడులుగా పెట్టిస్తున్నారని, ప్రజల డబ్బుకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. కానీ ఎల్‌ఐసీ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిరచింది. అదానీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం నిజమే కానీ.. అది పూర్తిగా తమ సంస్థ సొంత నిర్ణయమని, అందులో ఎవరి ఒత్తిడీ లేదని స్పష్టం చేసింది. తమకు ప్రత్యేకంగా అసెట్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం ఉంటుందని, అది మార్కెట్‌ స్థితిగతులను పూర్తిగా అధ్యయనం చేసి ఏ సంస్థల్లో.. ఎప్పుడు.. ఎంత.. పెట్టుబడులు పెట్టాలన్నది నిర్ణయిస్తాయని స్పష్టం చేసింది. ఇందులో ఆర్థిక శాఖ ప్రమేయం గానీ, ఒత్తిడి గానీ ఉండవని పేర్కొంది. దేశంలోని సుమారు 500 ప్రముఖ ప్రైవేట్‌, ప్రభుత్వ రంగ సంస్థల్లో తమ పెట్టుబడులు ఉన్నాయని ఎల్‌ఐసీ వివరించింది. వీటిలో అదానీతోపాటు రిలయన్స్‌, టాటా, ఐటీసీ, ఎస్బీఐ వంటి సంస్థలు ఉన్నాయని వెల్లడిరచింది. సరే.. ఆరోపణలు, విమర్శలు వచ్చినప్పుడు ఆయా సంస్థలు ఖండిరచడం, తమ చర్యలను సమర్థించుకోవడం సహజమే. అయితే వాటిపై స్పందించే పార్టీలు, నాయకులు గానీ వాటి పూర్వాపరాలు, ఆధారాలు సేకరించాకే ముందడుగు వేయాలి. కేంద్ర ప్రభుత్వం అదానీ గ్రూపు పట్ల మితిమీరిన ఆదరణ చూపుతోందన్న ఆరోపణ గత పదేళ్లుగా ఉంది, అందులో వాస్తవం కూడా ఉండవచ్చు. అయితే కచ్చితమైన ఆధారాలు చూపగలిగినప్పుడే ఆ ఆరోపణలకు విలువ ఉంటుంది, నిరాధారంగా ఎంత తీవ్ర ఆరోపణలు చేసినా వాటిని చేసేవారిపై విశ్వాసం పెంచవు సరికదా.. తిరిగి వారిపైనే అపనమ్మకం పెంచుతాయి. రాజకీయ, ప్రజాజీవనంలో అపారమైన అనుభవం ఉన్న కాంగ్రెస్‌ కానీ, ఇతర ప్రతిపక్షాలు కానీ ఈ చిన్న విషయాన్ని పట్టించుకోకపోవడం విస్మయం కలిగిస్తుంది. తను ప్రతిపక్షంగా ఉన్నచోట బీజేపీ కూడా ఇలాగే వ్యవహరిస్తోంది. దీన్నే పార్టీలన్నీ ‘రాజకీయ పోరాటం’గా అభివర్ణిస్తుంటాయి. గత ఎనభై ఏళ్లుగా పార్టీలన్నీ ఈ తరహా రాజకీయాలకే అలవాటు పడ్డాయి. తాము ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారన్న ఒక భ్రమలో ఉంటూ తగిన హోంవర్క్‌ లేకుండానే యాంత్రికంగా రాజకీయ ప్రత్యర్థులపై ఆరోపణలు చేసేస్తుంటాయి. ఇలాంటి చర్యలు వికటించిన సందర్భాలు చాలానే ఉన్నా వాటిని ఆకళింపు చేసుకుని పంథా మార్చాలన్న విజ్ఞత, వివేచన పార్టీల్లో లేశమాత్రమైనా కనిపించడంలేదు. ప్రస్తుత ఎల్‌ఐసీ`అదానీ వివాదంలో ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణల్లో నిజమే ఉండవచ్చుగాక. కానీ అది నిజమని స్పష్టీకరించే ఆధారాలు ఏవీ? అభియోగాలు నిరూపణ కానంతవరకు ఎవరినీ నేరస్తులుగా పరిగణించకూడదని మన చట్టాలు స్పష్టం చేస్తున్నాయి. అదే కోవలో ఆధారాలు చూపనంతవరకు ప్రతిపక్షం చేసే ఆరోపణలు గాలిలో తేలిపోతూనే ఉంటాయి. ఇలాంటి రాజకీయ పోరాటాల వల్ల ఉపయోగం ఏమిటో ఆయా పార్టీలే సమీక్షించుకోవాలి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page