top of page

రాజధాని దారిలో ఎవరికి వారే!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 2 days ago
  • 2 min read

రాజధాని లేని మన రాష్ట్రంలో పుష్కర కాలంగా అదే అంశం తరచూ రాజకీయరంగు పులుముకుని చర్చోపచర్చలకు, వివాదాలకు కారణమవుతున్నది. కొద్దిరోజులుగా ఇదే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈసారి రాష్ట్రానికే పరిమితం కాకుండా పార్లమెంటుకు పాకింది. తద్వారా దేశమంతా చర్చకు ఆస్కారమిచ్చింది. ఇప్పటికే ఆలస్యమైన రాజధాని అంశంలో రాజకీయాలకు అతీతంగా ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకోవాల్సిన తరుణంలో మన రాష్ట్ర పాలక, ప్రతిపక్షాలు ఇప్పటికీ రాజకీయ భేషజాలను వీడటం లేదు. భిన్నవైఖరులను పట్టుకుని వేలాడటం మానలేదు. అమరావతే ఏకైక రాజధాని అంటున్న టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణాలకు చర్యలు తీసుకుంటూనే.. మరోవైపు గత అనుభవాల దష్ట్యా భవిష్యత్తులో ఇంకెవరూ అమరావతిని టచ్ చేయలేని, రాజధానిని మార్చలేకుండా చేయడంపై దష్టి సారించింది. విజనరీగా చెప్పుకొనే సీఎం చంద్రబాబు మదిలోంచి పుట్టిన పరిష్కార మార్గమే అమరావతి రాజధానిగా చేస్తూ పార్లమెంటులో చట్టసవరణ చేయడం ద్వారా చట్టబద్ధం చేయడం. అనుకున్నదే తడవుగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పూర్తి అయినా కూడా ప్రత్యేకంగా మళ్లీ అసెంబ్లీని సమావేశపర్చి అమరావతే ఏకైక రాజధాని అని.. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం`2014లో రాజధానిగా అమరావతి పేరు చేరుస్తూ సవరణ చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేయించి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. అక్కడ ఉన్నది కూడా ఎన్డీయే ప్రభుత్వమే కావడంతో ఏపీ నుంచి వచ్చిన తీర్మానాన్ని అంతే అర్జంటుగా కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసేసి.. ఆ వెంటనే పార్లమెంటులో ప్రతిపాదించి ఆమోదింపజేశారు. దాంతో అమరావతి రాజధానికి చట్టబద్ధత లభించిందని, ఇక దాన్నెవరూ ముట్టుకోలేరు.. కదపలేరని చంద్రబాబు సహా నాయకులందరూ తెగ ప్రచారం చేస్తూ విజయోత్సవాలు కూడా జరుపుకున్నారు. కానీ రాజ్యాంగ నిపుణులు, పార్లమెంటేరియన్ల వాదన ప్రకారం చట్టసభల్లో బిల్లులు ఆమోదించి చట్టాలు రూపొందించినంత మాత్రాన అవి శిలాశాసనాలుగా మారిపోవు. కాలగమనంలో మారుతున్న పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా చట్టాలు సవరణలు చేసుకునే వెసులుబాటు రాజ్యాంగపరంగా ఉంది. అంతెందుకు.. ప్రజాస్వామిక భారతదేశానికి భగవద్గీతగా భావించే రాజ్యాంగానికే మనం వందసార్లకుపైగా సవరణలు చేసుకున్నాం. భవిష్యత్తులో అమరావతికి చట్టబద్ధత కల్పించిన చట్టాన్ని కూడా ఇలా సవరించే అవకాశాన్ని ఎవరూ కాదనలేరు. అపార అనుభవం కలిగిన చంద్రబాబుకు ఈ విషయాలు తెలియనివి కావు. కానీ ఏదోరకంగా అమరావతి అంశం ప్రజల్లో నానేలా చేయడం, తద్వారా రాజకీయ ప్రయోజనం పొందడం ఆయన అజెండా కావచ్చు. అమరావతి విషయంలో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు గత పన్నెండేళ్లుగా తమ రాజకీయ మైలేజీనే చూసుకుంటూ రాష్ట్ర ప్రజలతో, అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులతో ఆటలాడుకుంటున్నాయి. ఏటా మూడు పంటలు పండే సారవంతమైన భూముల్లో రాజధానిలాంటి కాంక్రీట్ జంగిల్ నిర్మాణాన్ని చేపట్టవద్దని, నీటి వనరులు, లూజ్ సాయిల్ ఉన్న ఆ ప్రాంతంలో నిర్మాణం కూడా క్షేమదాయకం కాదని జస్టిస్ శ్రీకష్ణ కమిటీ తన నివేదికలో స్పష్టంగా పేర్కొన్నా.. అప్పటి టీడీపీ ప్రభుత్వం అక్కడే.. విజయవాడ`గంటూరు మధ్యే అమరావతి పేరుతో రాజధాని నిర్మాణ నిర్ణయం తీసుకుని హడావుడి చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం అమరావతి ప్రాధాన్యతను తగ్గిస్తూ మూడు రాజధానుల సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకొచ్చి అమరావతి నిర్మాణాలను పూర్తిగా పక్కన పెట్టేసింది. మూడు రాజధానుల ప్రతిపాదనకు న్యాయ, ఇతరత్రా సమస్యలు ఎదురుకావడంతో అది కూడా ముందడుగు వేయలేకపోయింది. అలా శాశ్వత రాజధాని సమకూరకుండా మరో ఐదేళ్లు గడిచిపోయాయి. రెండేళ్ల క్రితం అధికారం చేపట్టిన ఎన్డీయే కూటమి సర్కారు మళ్లీ అమరావతి రాజధానిని భుజానికెత్తుకుని ప్రమోట్ చేయడం ప్రారంభించింది. ఒకవైపు నిర్మాణాలు ముమ్మరం చేస్తూనే.. మరోవైపు భవిష్యత్తులోనూ అమరావతికి అడ్డంకులు ఏర్పడకూడదంటూ పార్లమెంటు ద్వారా చట్టసవరణ చేయించింది. టీడీపీ, మిత్రపక్షాల వాదనలకు భిన్నంగా రాజ్యాంగ నిపుణులు మాట్లాడుతున్నారు. చట్టసవరణ అనేది రక్షా కవచం కాదని స్పష్టం చేస్తున్నారు. వాటికితోడు ఇదే బిల్లుపై పార్లమెంటులో చర్చ జరుగుతున్న సమయంలోనే వైకాపా అధినేత వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ పెట్టి మరీ కొత్త ప్రతిపాదనలను ముందుకు తేవడం ద్వారా కొత్త ఆందోళనలకు తెరతీశారు. అమరావతి రాజధానికి తమ పార్టీ వ్యతిరేకం కాదంటూనే.. దానికి బదులు తాను ప్రతిపాదిస్తున్న ప్లాన్`బి అమలు చేయాలని సూచించారు. మావిగన్ అనే విచిత్రమైన పేరును తెరపైకి తెచ్చారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల మధ్య ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న 110 కి.మీ. ప్రాంతాన్ని రాజధాని ప్రాంతంగా(క్యాపిటల్ రీజియన్) నోటిఫై చేస్తే అది రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్‌గా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదన వెనుక జగన్ ఉద్దేశం అభివృద్ధి వికేంద్రీకరణ, నిర్మాణ ఖర్చులను భారీగా తగ్గించుకోవడమే అయినప్పటికీ సరిగ్గా పార్లమెంటులో చట్ట సవరణ చేస్తున్న సమయంలో కొత్త వాదన వినిపించడం అమరావతిని ఏదో విధంగా అడ్డుకోవాలన్న ఆయన ఆలోచన విధానం మారలేదన్న అభిప్రాయాలే చాలామందిలో కలుగుతున్నాయి. అటువంటి సూచనలు, ప్రతిపాదనలను ఇన్నేళ్లుగా ఎందుకు జనబాహుళ్యంతో పంచుకోలేదని, అసెంబ్లీలో ప్రస్తావించే అవకాశం ఉన్నా ఆ పని చేయకుండా.. తీరిగ్గా ఇప్పుడు ప్రతిపాదిస్తూ ఇప్పటికే జాప్యమైన రాజధాని నిర్మాణాన్ని మళ్లీ మొదలుపెట్టండి అన్నట్లు జగన్ ధోరణి ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా ప్రతిపాదనలు, సూచనలతోనే కాలం గడిచిపోతుంటే రాజధాని సాకారమయ్యేదెప్పుడన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనికితోడు చట్టం శిలాశాసనం కాదన్నది వెల్లడికావడంతో అమరావతి పరిస్థితి మళ్లీ మొదటికేనా అనిపిస్తోంది!

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page