రాజధానిపై వైకాపా తీరు ప్రశ్నార్థకం
- DV RAMANA

- Sep 15, 2025
- 2 min read

రాష్ట్ర రాజధాని విషయంలో ప్రతిపక్ష వైకాపా వైఖరి మరోమారు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేని అవశేష రాష్ట్రంగా మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్‌కు 2014లో ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వం నిపుణుల నివేదికలకు విరుద్ధంగా అమరావతిని రాజధానిగా నిర్ణయించింది. అప్పట్లో దీన్ని కొంతవరకు సమర్థించిన వైకాపా.. దానికోసం భారీగా భూములు సేకరించడం, విపరీతంగా నిధులు డంప్ చేయడం.. అన్నింటికీ మించి వరద ముప్పు ఉన్న ప్రాంతమన్న కోణంలో అమరావతి నిర్మాణాన్ని వ్యతిరేకించినా స్థూలంగా అమరావతికి మాత్రం మద్దతు తెలిపింది. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అదే వైకాపా మాట మార్చింది. రాజకీయ కోణంలో రాత్రికి రాత్రి మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను తెరపైకి తీసుకొచ్చింది. ఏకైక రాజధానిగా ఉండాల్సిన అమరావతిని కేవలం శాసన రాజధానిగానే కొనసాగిస్తూ.. విశాఖను పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తామని ప్రతిపాదించింది. అయితే న్యాయపరమైన అడ్డంకులు, ఇతరత్రా కారణాలతో ఈ నిర్ణయాలు అమలుకు నోచుకోలేదు. ఈ పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో వైకాపాను ఓడిరచి మళ్లి అధికారం చేపట్టిన చంద్రబాబు సర్కారు మూడు రాజధానులను మడతెట్టేసి.. అమరావతే ఏకైక రాజధాని అన్న తమ నినాదాన్ని మళ్లీ ఎత్తుకోవడమే కాకుండా నిర్మాణాలకు యుద్ధప్రాదికన చర్యలు చేపట్టారు. అయినా వైకాపా నేతలు, సోషల్ మీడియా విభాగం ఇటీవలి వరకు అమరావతికి వ్యతిరేకంగానే మాట్లాడుతూ వచ్చారు. కానీ ఏమైందో గానీ.. ఈమధ్య ఆ పార్టీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి రాజధానికి అనుకూలంగా మాట్లాడటం విస్మయం కలిగించింది. వైకాపా నిజంగానే తన నిర్ణయం మార్చుకుందా? దీనిపైనే నిలబడుతుందా లేక మళ్లీ మళ్లీ తన స్టాండ్ మార్చుకుంటుందా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సజ్జల తన మాటల్లో అమరావతికి ఓకే అంటూనే కొన్ని కొర్రీలు వేయడం ఈ అనుమానాలకు తావిస్తోంది. మళ్లీ అధికారంలోకి వస్తే జగన్ అమరావతి నుంచే పరిపాలన సాగిస్తారని చెప్పిన సజ్జలవారు మరో చిన్న ట్విస్ట్ ఇచ్చారు. ప్రభుత్వంపై భారం లేకుండా నిర్మాణ ఖర్చు తగ్గించి గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని మహానగర నిర్మాణానికి కృషి చేస్తామని కొత్త పల్లవి అందుకోవడం విశేషం. మూడు రాజధానులను ప్రజలు వద్దన్నందునే తమ స్టాండ్ మార్చుకోవాల్సి వచ్చిందని, అయితే లక్షల కోట్ల అప్పులు చేసి అమరావతి నిర్మాణానికి తాము వ్యతిరేకమని చెప్పుకొచ్చారు. దానికి బదులు విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని నిర్మిస్తే ఆ రెండు నగరాలు కూడా బాగా అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు. రాజధాని అంశమే గత ఎన్నికల్లో వైకాపా ఓటమికి కారణమన్న వాదనలు ఉన్న తరుణంలో ఆ పార్టీ తన దృక్పథాన్ని మార్చుకోవడం మంచిదే. పార్టీ అధినేత వైఎస్‌జగన్ కూడా ఆ మధ్య మీడియాతో మాట్లాడుతూ అమరావతి రాజధానికి ఎక్కువ ఖర్చు చేస్తున్నారని విమర్శించారే తప్ప రాజధాని నిర్మాణాన్ని మాత్రం ప్రశ్నించలేదు. సజ్జల కామెంట్స్ జగన్ వ్యాఖ్యలకు దగ్గరగానే ఉన్నాయి. ఈ వాదనంతా ఓకే .. కానీ ఇప్పటికీ అమరావతి ప్రాంత రైతులు, ప్రజలు వైకాపా మాటలను పూర్తిగా విశ్వసించడం లేదా? అంటే అవననే చెప్పక తప్పదు. సజ్జల వ్యాఖ్యలపైనే ఆ వర్గాల నుంచి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుండటమే వారు వైకాపా మాటలను విశ్వసించడం లేదనడానికి నిదర్శనం. అమరావతి రాజధాని ప్రతిపాదన వచ్చినప్పటి నుంచీ వైకాపా తీరు తడవకోలా ఉండటమే స్థానికుల్లో ఆ పార్టీపై అపనమ్మకాన్ని పెంచింది. ఆ పార్టీ పెద్దలు మళ్లీ రేపేదైన రాజకీయ పరిణామాలు సంభవిస్తే తమ స్టాండ్ మార్చుకోరన్న గ్యారెంటీ ఏమిటని సామాజిక మాధ్యమాల్లో నిలదీతలు ఎదురవుతున్నాయి. నిజంగానే వైకాపా అమరావతి జై కొట్టిందని అనుకుందామంటే.. నిన్నమొన్నటి వరకు దానిపై ఆ పార్టీ సోషల్ మీడియా ఎందుకు వ్యంగ్యాస్త్రాలు సంధించినట్లు? ఇటీవలి వర్షాలకు రాజధాని ప్రాంతం నీట మునిగిపోయిందని గ్రాఫిక్స్‌తో ఎందుకు ట్రోలింగ్ చేసినట్లు?? అని వైకాపా వ్యతిరేక, అమరావతి అనుకూల సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా నిలదీస్తున్నారు. అదీగాక ఇంత భారీ ఖర్చు, భారీ నిర్మాణాలు ఎందుకని అంటున్నారంటే.. వైకాపా మళ్లీ అధికారంలోకి వస్తే ఇప్పుడే చేపడుతున్న నిర్మాణాలను ఆపేస్తారేమోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వైకాపా రాజకీయంగా ఇంకా నష్టపోకూడదంటే ఈ కన్‌ఫ్యూజన్‌కు తెరదించాల్సిందే.










Comments