రాజరాజేశ్వరీ.. ఊపిరాపుకో..!
- SATYAM DAILY
- May 17
- 1 min read
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

పక్కన ఉన్న డస్ట్‌బిన్లు చూశారుగా.. ఒకటి రోడ్డుకు పక్కన ఉంటే, మరోటి రోడ్డు మధ్యలో ఉంది. ఇది కత్తెరవీధి రాజరాజేశ్వరి పీఠం దరిలోని డస్ట్‌బిన్ల పరిస్థితి. గతంలో ఈ డస్ట్‌బిన్లు ఇక్కడి ట్రాన్స్‌ఫారమ్‌కు దూరంగా కొంచెం లోపలికే ఉండేవి. అయితే వాటికి ఎదురుగా ఒక వైద్యుడు భారీ భవంతి కడుతున్న నేపధ్యంలో ఇవి ఇలా ఇక్కడకు చేరాయి. ఆ ఇంటి యజమాని కార్పొరేషన్‌నే మేనేజ్ చేశారో, లేదా పారిశుధ్య సిబ్బందికి చెప్పారో తెలియదు గానీ ఇప్పుడు ఈ డస్ట్‌బిన్లు ఇలా అమ్మవారి పీఠానికి దగ్గరగా రోడ్డుకు మధ్యగా చేరాయి. ఒకవైపు రోడ్డుపై భవన బిల్డింగ్ మెటీరియల్, మరోవైపు డస్ట్‌బిన్లు. ఈ రోడ్డులో ఉదయం, సాయంత్రం గేదెల మందను తీసుకువెళ్లే క్రమంలో ఇక్కడ పలుమార్లు వాహనాలు స్కిడ్ అవడం, అలాగే డస్ట్‌బిన్‌లను గుద్దుకున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనికి తోడు కనీస అవగాహన లేని స్థానికులు ఇంటిలోని చెత్తను వీధుల్లోకి వచ్చే చెత్తవాహనాలకు అప్పగించకుండా ఇక్కడి బిన్స్‌లో కొందరు వేస్తుండగా, ఇంకొందరు నిర్లక్ష్యంగా బయటే పడేసి పోతుంటారు. ఇక ఇక్కడే ఉన్న ఒక ఫంక్షన్ హాల్‌లో ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా ఎంగిలాకులు డస్ట్‌బిన్ల బయట పడేసి వెళ్తుండటంతో దుర్గంధం ఏర్పడి అమ్మవారే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఇక ఈ పీఠానికి వచ్చే భక్తులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా డస్ట్‌బిన్లను ట్రాన్స్‌ఫారమ్‌కు కొంచెం దూరంగా రోడ్డుకు పక్కగా పెట్టే ఏర్పాటు చేయాలని ఈ మార్గంలో ప్రయాణించేవారు కోరుతున్నారు.

Kommentare