రిజర్వ్ సైటు ప్రైవేటు వ్యక్తులు.. ప్రభుత్వ స్థలం కార్పొరేషన్‌ఆక్రమణ
- Prasad Satyam
- Dec 24, 2025
- 2 min read
లక్ష్మీనరసింహస్వామి ఆలయ మాన్యం అన్యాక్రాంతం
రిజర్వ్ సైట్‌లో ఆక్రమణలకు కప్పం కడుతున్న వ్యాపారులు
రోడ్డుపైనే డస్ట్‌బిన్లు, శానిటేషన్ పరికరాలు ఉంచుకుంటున్న మున్సిపాలిటీ

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఎక్కడైనా మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన స్థలం ఉంటే.. అందులో తమకు సంబంధించిన ఆస్తులు పెట్టుకుంటారు. అయితే మన మున్సిపల్ కార్పొరేషన్‌లో విచిత్రంగా రిజర్వ్ స్థలాన్ని ఆక్రమించుకోండంటూ ప్రైవేటు వ్యక్తులకు వదిలేసి రోడ్డు మీద కార్పొరేషన్ ఆక్రమణలకు పాల్పడుతోంది. అయితే ఇది ఇప్పటి కమిషనరో, ఇంతకు ముందున్నవారో మాత్రమే చేసిన తప్పిదం కాదు. ఈ తప్పును ఎప్పటికీ సరిచేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడమే కొసమెరుపు. వివరాల్లోకి వెళితే.. స్థానిక విశాఖ`బి కాలనీ చివరిలో వీరన్న షెడ్ అంటే తెలియనివారు శ్రీకాకుళంలో ఉండరు. సరిగ్గా ఈ షెడ్డుకు ఎదురుగా ఒక లేఅవుట్‌కు సంబంధించిన రిజర్వ్ స్థలం ఉంది. వాస్తవానికి రిజర్వ్ స్థలాలు మున్సిపల్ కార్పొరేషన్ ఆధీనంలోకి తీసుకోవాలి. ఆ విధంగా ఆమధ్య సుప్రీంకోర్టు తీర్పు మేరకు అన్యాక్రాంతమైపోతున్న రిజర్వ్ సైట్ల చుట్టూ ప్రహరీలు నిర్మించి సంరక్షించారు కూడా. అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న స్థలం ఆమధ్య కాలం వరకు పంచాయతీకి చెందినది కావడంతో మున్సిపాలిటీ దీని మీద దృష్టి సారించలేదు. ఇప్పుడు విలీన పంచాయతీలతో కలిపి మున్సిపల్ కార్పొరేషన్‌గా అవతరించినా కూడా ఈ రిజర్వ్ సైట్‌ను స్వాధీనం చేసుకోలేదు సరికదా, మరికొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఆక్రమిస్తున్నా యంత్రాంగం చోద్యం చూస్తోంది. అసలు ఇక్కడ రిజర్వ్ సైట్ ఉందని కార్పొరేషన్ యంత్రాంగానికి తెలుసో లేదో కూడా ఎవరికీ తెలియదు. ఎంచక్కా కార్పొరేషన్‌కు చెందిన స్థలాన్ని ఆక్రమించుకొని చాలామంది వ్యాపారాలు చేస్తుంటే, కార్పొరేషన్ అతి పెద్ద డస్ట్‌బిన్‌ను రోడ్డు మధ్యలో పెట్టి అంతకు మించి మరేం చేయగలం? స్థలం ఎక్కడుందనే సంకేతాలు పంపిస్తోంది. రిజర్వ్ సైట్‌లో ఆక్రమణలకు ఎటువంటి పత్రాలూ లేకపోయినా విద్యుత్ శాఖ అధికారులు మాత్రం సంబంధిత వ్యాపారుల పేరిట కరెంట్ మీటర్ల అమర్చేశారు. మనం ఇల్లు కట్టుకొని మీటరు కావాలని అప్లై చేస్తే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ దగ్గర నుంచి లింక్ డాక్యుమెంట్ల వరకు అన్నీ అడిగే ఏపీఈపీడీసీఎల్ సిబ్బంది అసలు ఈ స్థలం ఎవరిదని కరెంటు మీటరు ఇచ్చారో తేలాల్సివుంది. దీని వెనుక ఆ పంచాయతీ మాజీ సర్పంచ్ ఒకరి హస్తం ఉన్నట్లు బహిరంగంగానే చర్చ జరుగుతుంది. రిజర్వ్ సైట్‌ను ఆక్రమించుకోడానికి, కరెంటు మీటర్లు తెచ్చుకోడానికి అనుగుణంగా నో అబ్జక్షన్ సర్టిఫికెట్ ఇవ్వడానికి, ఇంకా వీలైతే విద్యుత్ శాఖ అధికారులతో లాబీయింగ్ చేయడానికి ఈ మాజీ సర్పంచ్‌కు ఇక్కడివారంతా కప్పం కడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఎవరికి ఎంత చెల్లిస్తున్నారనేది పక్కన పెడితే, ఏ లాలూచీ లేకుండా రిజర్వ్ సైట్‌లో ఆక్రమణలకు మీటర్లెలా వస్తాయి?
సరిగ్గా ఇదే రిజర్వ్ సైట్‌కు ఆనుకొని తుమ్మావీధి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి 21 సెంట్ల దేవుడి మాన్యం ఉంది. దీన్ని పూర్తిగా మొన్నటి వరకు తాత్కాలిక షెడ్లు వేసి చాలామంది ఆక్రమించుకున్నారు. ఇప్పుడు ఎవరికి ఎంత ముడుపులిచ్చారో తెలియదు గానీ, దేవుడి భూమిలో పక్కా భవనాలు నిర్మించడానికి పునాదులు, పిల్లర్లు కూడా వేసేశారు. ఈ కథనంతో పాటు ప్రచురిస్తున్న ఫొటోల్లో కనిపిస్తున్న కంకర ఈ దేవుడి మాన్యంలో కడుతున్న బిల్డింగ్‌కు సంబంధించినదే. నోరు లేని దేవుడు అడగడు. దేవుడి ప్రతినిధులుగా ఉన్నవారు పట్టించుకోరు. ఒక్క గజం లక్షల్లో పలుకుతున్న ఈ భూమి ఫక్తు కమర్షియల్. కోట్లాది రూపాయలు విలువ చేసే భూమి అన్యాక్రాంతమైపోతున్నా దేవదాయ శాఖకు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఒకసారి పర్మినెంట్ స్ట్రక్చర్ వేసేస్తే.. ఆ స్తంభం బద్దలుగొట్టుకొని స్వయంగా లక్ష్మీనరసింహస్వామి వచ్చి చెప్పినా వినేవాడు లేడు. ఇటు రిజర్వ్ స్థలం, అటు స్వామి మాన్యం కలిపితే ఎన్ని కోట్లు విలువ చేస్తుందో లెక్కకట్టడం అంత సులువు కాదు. అయినా రిజర్వ్ స్థలాలు ఆక్రమించడం నేరం.. దేవుడి మాన్యం సొంతం చేసుకోవడం పాపం.










Comments