రెండు కాళ్లూ లేని రిమ్స్..!
- BAGADI NARAYANARAO

- Oct 23, 2025
- 2 min read
స్ట్రచర్ ఎక్కిన వీల్‌చైర్
కుక్కలు రాకుండా అడ్డుపెట్టిన స్ట్రచర్‌లు
రోగులు వార్డుకు చేరాలంటే బౌన్సర్లు తప్పనిసరి
ఆవైపు దృష్టిసారించాలంటున్న పౌరసమాజం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
‘‘మనింటికి కష్టం వచ్చినట్టే.. ఒక ఊరికి వరదొచ్చింది. ఆ ఇంటి యజమాని భార్య, కూతుర్ని పట్టుకొని, కొడుకును భుజాన వేసుకొని ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు బయల్దేరాడు. కొంతదూరం వెళ్లేసరికి వరద ఉధృతికి భార్యను వదిలేశాడు. మరికొంత దూరానికి కూతుర్ని విడిచేశాడు. వరద పెరగడంతో భుజం మీద ఉన్న కొడుకును కూడా దించేసి మొత్తానికి ఒడ్డుకు చేరుకున్నాడు. ఆ తర్వాత జీవితాంతం ఒంటరిగా ఏడ్చాడు.’’ ఇది అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కల్యాణ్ ముఖేష్ రుషికి చెప్పిన కథ.
సాధారణంగా మనం నడవలేక ఆస్పత్రికి వెళితే వీల్‌చైర్ మీద వార్డులోకి తీసుకెళ్తారు. ఆ వీల్‌చైరే బాగులేకపోతే ఏం చేయాలి? మనం వార్డు వరకు వెళ్లే చతనం లేకపోతే స్ట్రెచర్ మీద తీసుకెళ్తారు. ఆ స్ట్రెచరే మనల్ని మోయలేనని మొరాయిస్తే ఏం చేస్తాం?
అప్పుడప్పుడూ తానున్నానని చెప్పడం కోసం వినాయకుడు పాలు తాగుతుంటాడు. మన రాజకీయ నాయకులు కూడా తాము పని చేస్తున్నామని చెప్పుకోవడం కోసం ప్రభుత్వ సంస్థలను తనిఖీ చేస్తుంటారు. అలాగే మొన్న మంత్రి అచ్చెన్నాయుడు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (రిమ్స్)ను ఆకస్మిక తనిఖీ చేశారు. మినిట్స్ బుక్ ఎక్కడ, అటెండెన్స్ ఎక్కడ అని అడిగారు తప్ప. అసలు రోగులకు అందుతున్న సౌకర్యాలెక్కడ అని మాత్రం ఆరా తీయలేదు. అపరిశుభ్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. కానీ అందుకు కారణాలేమిటో ఆయన తెలుసుకోలేదు. పొరపాటున కాలో, చెయ్యో విరిగి రిమ్స్‌లో చేరితో మనల్ని ముందుగా పరామర్శించేది మనలాగే కాలు, చెయ్యి లాంటి అంగాన్ని విరగ్గొట్టుకొని ఎదురుగా వస్తున్న వీల్‌చైరే. మనమెక్కి వార్డుకు చేరుదామనుకుంటే.. మనకు ఎదురుగా అది వెక్కిరిస్తూ కనిపిస్తుంది. రిమ్స్ జనరల్ ఆసుపత్రిలో ఎన్ని వీల్‌చైర్‌లు ఉన్నాయో తెలీదు గాని, ఆసుపత్రి ఎమర్జెన్సీలో మాత్రం వీల్‌చైర్‌లన్నీ మూలకు చేరిపోయాయి. దీంతో బరువైన బౌన్సర్ ఉంటేగాని మనం డాక్టర్ దగ్గరకు చేరుకోలేం. మనల్ని మోసుకెళ్లాల్సిన స్ట్రెచర్ వీల్‌చైర్లను మోసుకెళ్తోంది. ఈ సమస్య ఎవరికీ పట్టదు. ఎందుకంటే.. ఇక్కడ కూడా ఆరోగ్యశ్రీ నిధులు రావాలి. వీటిని కొనుగోలు చేయాలి. అవి రావు.. ఇవి కొనరు. ఉన్న ఒకటీ అరాకొరా బారికేడ్ల లాగ ఆసుపత్రి సిబ్బంది వాడుకుంటున్నారు. కుక్కలు, పందులు అంత సులువుగా వార్డుల్లోకి రాకుండా వీటిని అడ్డు పెడుతున్నారు. స్ట్రెచర్ దేనికి వాడాలి, వీల్‌చైర్‌లు ఎవరికి వాడాలి అనేది ఎవరికి చెప్పినా అర్థంకాదు. శ్రీకాకుళం వచ్చామా, ఫేస్ రికగ్నైజేషన్ యాప్‌లో కళ్లు కొట్టామా, సాయంత్రం ఎంచక్కా వైజాగ్ చేరిపోయామా.. అనుకున్నవారే గానీ నాబొందో అంటూ వీటిపై దృష్టి సారించిన నాధుడు ఇక్కడ కనిపించరు. అలాగని వైద్యసేవలకు లోటు లేదు. బాధ్యతగా వ్యవహరించకపోవడం ఒక్కటే లోటు. ఇప్పుడు ముందుగా మనం వీల్‌చైర్‌ను వదిలేశాం.. ఆ తర్వాత స్ట్రచర్‌ను మోయలేక పడేశాం.. ఆ తర్వాత పేషెంట్ పోతే తీరిగ్గా కూర్చుని ఏడుద్దాం.. అదీ చాలకపోతే ప్రభుత్వ ఆసుపత్రికి మరి రాలేమని ప్రజలు తీర్మానించుకున్నాక అందరూ ఒకేసారి కట్టకట్టుకొని మునిగేద్దాం.










Comments