రెడ్డిగారూ.. మీరు సూపర్ ‘బాస్’!
- BAGADI NARAYANARAO

- Jul 22, 2025
- 3 min read
ఒత్తిడితో కేసు నీరుగార్చేశారని ఆరోపణలు
అంతలోనే అమ్మినాయుడు అరెస్ట్
నాయకులు చెప్పినా కుదరదన్న ఎస్పీ
సత్తారు గోపీ హత్యకేసులో కనబడిన రాజకీయ కోణం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఫరీద్‌పేటలో హత్యకు గురైన వైకాపా నాయకులు సత్తారు గోపి కేసులో పోలీసులు ప్రభుత్వ ఒత్తిడికి లొంగిపోయారని, అందుకే అసలు నిందితులను వదిలేసి వెనుక వరుసలో ఉన్నవారిని అరెస్ట్ చేశారని నాలుగు రోజుల క్రితం పోలీసులు పెట్టిన ప్రెస్‌మీట్ తర్వాత జిల్లాలో వినిపించిన వ్యాఖ్యలు ఇవి. నిజమే.. ఒక రాజకీయ పార్టీ నాయకుడు హత్యకు గురైనప్పుడు, అది కూడా ప్రతిపక్షానికి చెందిన నేత అయితే కచ్చితంగా అధికార పార్టీ ఒత్తిడి ఉంటుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా దీనికి మినహాయింపు ఉండదు. కాకపోతే పోలీసులు మాత్రం ఎవరు ఏమనుకున్నా తమ పని తాము పూర్తిచేశామని నిరూపించారు. అలా అని వారి మీద ఒత్తిళ్లు లేవా అంటే.. ఉన్నాయి. కాకపోతే ఒకసారి కఠినంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా ఉంటాయన్నదే ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి ఆలోచన.
కూటమి పాలనలో హత్యా రాజకీయాలు ఎక్కువయ్యాయని ప్రతిపక్షం నిత్యం ఆరోపిస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ నాయకుడ్ని అరెస్టు చేయడం చిన్న విషయం కాదు. గత ఏడాది జరిగిన కూన ప్రసాద్ హత్యకేసు మాదిరిగా గోపి హత్య కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు వినిపించాయి. ప్రభుత్వ పెద్దలు, రాజకీయ ఒత్తిడిని సైతం లెక్క చేయకుండా నిజాయితీగా వ్యవహరించి గోపి హత్యకేసుతో సంబంధం ఉన్నవారిని అరెస్టు చేయడంతో పోలీసులపై స్థానికులకు నమ్మకం పెరిగింది. అందులో భాగంగానే గోపీ హత్య కేసులో కీలక నిందితుడుగా అనుమానిస్తున్న టీడీపీ నాయకుడు కొత్తకోట అమ్మినాయుడును పోలీసులు అరెస్టు చేసి సోమవారం రాత్రి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో పోలీసులు జైలుకు తరలించారు. కుటుంబ కలహాల నేపధ్యంలో హత్య జరిగిందని చెబుతూ వచ్చిన పోలీసులు అమ్మినాయుడు అరెస్టుతో ఇందులో రాజకీయ కోణం ఉందని చెప్పకనే చెప్పారు. ఈ కేసులో మొదట 12 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అందులో గోపి హత్యతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న 8 మందిని అరెస్టు చేశారు. హత్యతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్నవారు ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో విచారణ జరుపుతున్నట్టు 8 మందిని అరెస్టు చేసిన సమయంలోనే పోలీసులు వెల్లడిరచారు. అందులో భాగంగానే సాంకేతిక ఆధారాలు, కాల్‌డేటా ఆధారంగా పోలీసులు అమ్మినాయుడి ప్రమేయంపై పూర్తి ఆధారాలు సేకరించినట్టు తెలిసింది. దీంతో సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో మూడు వాహనాల్లో సీఐ, ముగ్గ్గురు ఎస్‌ఐలు, సిబ్బందితో కలిసి ఫరీద్‌పేటలోని ఆయన నివాసంలోనే అమ్మినాయుడిని అదుపులోకి తీసుకొని న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.
గోపీని హత్య చేసినవారంతా అమ్మినాయుడు ఫాలోవర్లు కావడంతో మొదటి నుంచి ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. 8 మందిని అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులకు అమ్మినాయుడు ప్రోత్సాహంతోనే హత్య చేసినట్టు నిందితులంతా ఒప్పుకున్నారన్న చర్చ సాగుతుంది. అయితే ఈ హత్య కేసులో కొందరిని తప్పించేందుకు అధికార పార్టీ పెద్దలు ప్రయత్నాలు చేసినట్టు జోరుగా ప్రచారం సాగుతుంది. అయితే పోలీసు బాస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఫరీద్‌పేటలో రాజకీయ, వర్గ విభేదాలు, ఆధిపత్యం కారణంగా మరో హత్య జరగడానికి అవకాశం ఇవ్వనని కఠినంగా వ్యవహరించినట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో రాజకీయ ఒత్తిడి పనిచేయలేదని పోలీసు శాఖలోనే చర్చ సాగుతోంది. గత ఏడాది కూన ప్రసాద్ హత్య సమయంలో ఇదే మాదిరిగా అధికారులు వ్యవహరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయం గ్రామంలో వ్యక్తమవుతుంది. ప్రసాద్ హత్య కేసులో ప్రత్యక్షంగా సంబంధం ఉన్నవారిని రాజకీయ ఒత్తిడితో తప్పించడం వల్లనే గోపి హత్యకు బీజం పడిరదని అభిప్రాయం స్థానికుల్లో ఉంది. హతుడు గోపిపై ఎనిమిది క్రిమినల్ కేసులు ఉన్నాయని, హత్య చేసిన వారందరూ గోపీ బాధితులే అని పోలీసులు ఇంతకు ముందే ప్రకటించారు. హైకాపా హయాంలో గోపీపై నిఘా ఉంచి ప్రాథమిక దశలోనే చెక్ పెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని గ్రామంలో కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఉన్నా ఇప్పటికీ ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఫరీద్‌పేటకు చెందిన భార్యాభర్తలు జి.ఉమామహేశ్వరరావు, భవాని మొదటి నుంచి ఎంపీపీ మొదలవలస చిరంజీవికి అనుచరులుగా కొనసాగుతూ వచ్చారు. ఆ సందర్భంలోనే భవానీకి వైకాపా హయాంలో సీఎఫ్‌గా నియమించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎఫ్ నుంచి భవానీని అమ్మినాయుడు తప్పించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆర్ధిక ఇబ్బందులు కారణంగా భార్యాభర్తలు ఉమా, భవానీ ఇద్దరూ గొడవలు పడడం, చిరంజీవి వీరి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. అయితే చిరంజీవి పంచాయితీ నచ్చకపోవడంతో అమ్మినాయుడును భవానీ ఆశ్రయించింది. దీన్ని అవకాశంగా తీసుకొని భవానీతో పోలీస్‌స్టేషన్‌లో భర్త ఉమాపై ఫిర్యాదు చేయించినట్టు తెలిసింది. గృహ హింస కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని పోలీసులపై ఒత్తిడి పెంచారని తెలిసింది. పోలీసులు మాత్రం కౌన్సిలింగ్ నిర్వహించాలని ప్రయత్నాలు చేసినా భర్త ఉమా సహకరించలేదు. దీంతో భర్త ఉమాను కాదని భార్య భవానీ ఇంటిలో సామాన్లు తీసుకోవడానికి అమ్మినాయుడు పంపించిన 8 మంది అనుచరులతో వెళ్లి తలుపులు పగలగొట్టి తన సామాన్లతో కొయిరాల జంక్షన్‌కు వచ్చింది. ఆ సందర్భంగా అక్కడకు వచ్చిన గోపిపై 8 మంది దాడి చేసి హత్య చేశారు. అందుకే దీన్ని పోలీసులు కుటుంబ కలహమన్నారు. వాస్తవానికి ఇక్కడ ఆధిపత్యం కోసం రెండు గ్రూపులు ఉండటం వల్ల మాత్రమే ఒకే ఇంటిలో ఉండే భార్యాభర్తలు తమ సమస్యను రెండు గ్రూపుల వద్ద పంచాయితీకి తీసుకువెళ్లారు. ఎప్పట్నుంచో ఇక్కడ రెండు పార్టీలు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునే గతం ఉండటం వల్ల గోపీని మట్టుబెట్టడానికి భార్యాభర్తల గొడవ అవకాశంగా మారింది. వాస్తవానికి ఇక్కడ కొత్తకోట అమ్మినాయుడును ఇప్పుడు అరెస్ట్ చేయడం వల్ల ఫ్యాక్షన్ ఆగిపోదు. ఎందుకంటే.. వైకాపా హయాంలో అధికారం చెలాయించిన నాయకులు టీడీపీ నేతలను, ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మినాయుడుతో సహా అందరికీ తొక్కిపెట్టి నార తీశారు. మిగతా ప్రాంతాల్లో ప్రభుత్వం మారితే ప్రతిపక్షంలో ఉన్నవారికి కాంట్రాక్ట్ పనులు దక్కకపోవడమో, చేసిన పనులకు బిల్లులు ఇవ్వకపోవడమో, చిరుద్యోగులకైతే బదిలీ చేయడమో చేస్తుంటారు. కానీ ఇక్కడ వైకాపా అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఆ ఊరిలో ఉండటానికి కూడా టీడీపీ నేతలకు అవకాశం ఇవ్వలేదు. అసలు హత్యా రాజకీయాలకు మొదట తెర లేపిందెవరు? ఎవరు ఇప్పటికీ కాఫ్ పంచాయితీలు నిర్వహిస్తున్నారు? దందాలు చేస్తున్నదెవరు? వంటి ప్రాథమిక సమాచారం తెచ్చుకుంటే అసలు ఫరీద్‌పేటలో ఏం చేస్తే హత్యా రాజకీయాలు రూపుమాపుతాయో అర్థమవుతుంది.










Comments