top of page

రుతుక్రమ నిశ్శబ్దాన్ని బద్దలుకొడదాం!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 2 hours ago
  • 2 min read
  • ఆ సమయంలో మహిళల్లో మానసిక, శారీరక వేదన

  • కౌమారదశ బాలికలపై దానిపై అవగాహన శూన్యం

  • స్కూళ్లు, కళాశాలలు, పని ప్రదేశాల్లో ఏర్పాట్లు నిల్

  • ఫలితంగా చదవులకు, పనికి దూరమవుతున్న వైనం

  • అది అపవిత్రమన్న దురభిప్రాయాన్ని తొలగించాలి

  • సామాన్యుడే ‘శర’మెత్తితే`3

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

దేశం ఎంతగా అభివద్ధి చెందుతున్నా.. విజ్ఞానశాస్త్ర ఫలాలు అందుకుంటున్నా నేటికీ చాలా విషయాల్లో సంప్రదాయ ముసుగు, మూఢ నమ్మకాల కచ్చడాలు(సంకెళ్లు) తొలగడంలేదు. ముఖ్యంగా మహిళల విషయంలో సమాజం తీరు ఇప్పటికీ దారుణంగానే ఉంది. కుటుంబాలు, సమాజంతోపాటు ప్రభుత్వాలు కూడా ఇందులో పాత్రధారులనే చెప్పాలి. ముఖ్యంగా యుక్తవయసు బాలికల నుంచి నడివయసు మహిళల వరకు ఎదుర్కొనే శారీరక సమస్య రుతుక్రమం. నెలనెలా తప్పనిసరిగా జరిగా శారీరక ప్రక్రయ కారణంగా మహిళలు శారీరకంగానే నాలుగైదు రోజులు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇది చాలదన్నట్లు సమాజ కట్టబాట్లు, నమ్మకాలు వారిని ఆ రోజుల్లో వెలివేసినట్లు చూడటం మానసికంగా మరింత కుంగదీస్తున్నాయి. దీనిపై అవగాహన కల్పించి, మహిళలకు మానసిక స్వాంతన కలిగించాల్సిన ప్రభుత్వాలు ఆ పని చేయలేకపోతున్నాయి. పైగా ఈ సమయంలో వారు వినియోగించి శానిటరీ ప్యాడ్స్‌పైనా పన్నులు గుంజుకుంటున్నాయి. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా రాజ్యసభ వేదికగా వినిపిస్తున్న సామాన్యుడి గళంలో ఈ అంశం కూడా ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. ఒక ప్రజాప్రతినిధిగానే కాకుండా దేశంలోని సగం జనాభాగా ఉన్న కోట్లాది మహిళల తరఫున ఆయన ఈ అంశాలు ప్రస్తావించారు. రుతుక్రమాన్ని సామాజిక నిషిద్ధం నుంచి తప్పించి శాస్త్రీయ చర్చగా మార్చాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

బాలికల్లో అవగాహన శూన్యం

దేశంలో మహిళా విద్య, ఆరోగ్యం పట్ల దశాబ్దాలుగా నిర్లక్ష్యం కొనసాగుతున్నది. ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నా అవి ఏమాత్రం సరిపోని పరిస్థితి. దేశంలో ప్రస్తుతం 35 కోట్ల మందికిపైగా మహిళలు రుతుక్రమం వయసులో ఉన్నారని అంచనా. వీరిలో సుమారు 12 కోట్ల మంది కౌమార దశ బాలిÅ£లే. వీరంతా సరైన సౌకర్యాలకు నోచుకోకపోవడంతోపాటు రుతుక్రమంపై ఏమాత్రం అవగాహన లేనివారే కావడం గమనార్హం. పర్యావసానంగా దేశంలో ఏటా 2.3 కోట్ల మంది బాలికలు చదువులు మానేస్తున్నారని అంచనా. శానిటరీ ఉత్పత్తుల లభ్యత లేకపోవడం, పాఠశాలల్లో కనీస వసతులు లేకపోవడం వల్ల ఆడబిడ్డలు చదువుకు దూరమవుతుండటం అత్యంత ఆందోళనకరం. దీనివల్ల సగటున ఒక బాలిక ఏడాదికి 60 రోజులు పాఠశాలను, ఉద్యోగినులు నెలకు రెండు నుంచి ఐదు రోజులు పని కోల్పోతున్నారు. షాపుల్లో మద్యం, సిగరెట్లు బహిరంగంగా అమ్ముతారు గానీ.. శానిటరీ ప్యాడ్లను మాత్రం ఏదో నిషేధిత, అక్రమ వస్తువు మాదిరిగా రహస్యంగా పేపర్‌లో చుట్టి ఇస్తుంటారు. రుతుక్రమం అనేది ఒక సహజ జీవక్రియ. కానీ దాన్ని సమాజం ఒక అపవిత్రమైన విషయంగా.. రహస్యంగా ఉంచాల్సిన అంశంగా మార్చేసింది. అదే దుస్థితి ఇప్పటికీ కొనసాగుతున్నది. ఒక సర్వే ప్రకారం 33 శాతం మహిళలకు తమకు మొదటిసారి పీరియడ్స్ వచ్చే వరకు దాని గురించి ఎటువంటి అవగాహన లేదు. సరైన సమాచారం, అవగాహన లేకపోవడం వల్ల 91.7 శాతం మంది మహిళలు వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. ముఖ్యంగా రీప్రొడక్టిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్లు, సర్వైకల్ క్యాన్సర్ రిస్క్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు. కానీ సామాజిక భయం, చెప్పుకోలేని బిడియం వల్ల చాలామంది వైద్యుల వద్దకు వెళ్లలేకపోతున్నారు. బడులు, కళాశాలల్లో బాలికలకు టాయిలెట్లు లేకపోవడం ఒక సమస్య అయితే.. ఉన్నవి కూడా అపరిశుభత్రతో వాడకానికి వీలుగా లేకపోవడం మరింత సమస్యగా మారింది. నీటి సౌకర్యం, గోప్యత, ప్యాడ్లను పారవేసే డస్ట్ బిన్లు లేని టాయిలెట్లు ఉపయోగపడకుండా పోతున్నాయి. దేశంలోని 25 శాతం పాఠశాలల్లో ప్రాథమిక పారిశుద్ధ్య సేవలు లేవని, 46 శాతం పాఠశాలల్లో కనీసం చేతులు కడుక్కోవడానికి సోపులు కూడా ఉండటం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

పాఠ్యాంశాల్లో చేర్చాలి

శానిటరీ ప్యాడ్లపై జీఎస్టీని ప్రభుత్వం తొలగించినప్పటికీ, వాటిని తయారు చేసే ముడిసరకులపై మాత్రం కొనసాగిస్తున్నది. ఫలితంగా ఉత్పత్తుల ధరలు సామాన్యులకు అందబాటులో ఉండటం లేదు. దేశంలో ఒక మహిళ పీరియడ్స్ సమయంలో పరిశుభ్రత కోసం నెలకు సగటున రూ.300 నుంచి రూ.500 ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది మన దేశంలోని కనీస రోజువారి వేతన కంటే రెండు రెట్లు ఎక్కువ. అందుకే కేవలం 36 శాతం మంది మహిళలు మాత్రమే మార్కెట్‌లో దొరికే శానిటరీ ప్యాడ్స్ వినియోగించగలుగుతున్నారు. మిగతావారు అవి లేకుండానే నెట్టుకొస్తున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి రాఘవ్ చద్దా ఆరు ప్రధాన డిమాండ్లను రాజ్యసభ ద్వారా ప్రభుత్వం ముందు పెట్టారు. దేశంలోని పాఠశాలలు, కాలేజీలు, పని ప్రదేశాల్లో ఉచితంగా శానిటరీ ప్యాడ్లు, వినియోగించదగిన టాయిలెట్లు అందుబాటులో ఉంచాలి. అంగన్‌వాడీలు, ఆశా వర్కర్ల ద్వారా నేరుగా ఇళ్లకు నాణ్యమైన ఉత్పత్తులను సరఫరా చేయాలి. ముడి సరకులపై ఉన్న జీఎస్టీ పూర్తిగా రద్దు చేయాలి. రుతుక్రమ ఆరోగ్యం గురించి కేవలం బాలికలే కాకుండా బాలురకు కూడా పాఠశాల పాఠ్యాంశాల రూపంలో అవగాహన కల్పించాలి. అప్పుడు సమాజంలో ఉన్న నిశ్శబ్దం బద్దలవుతుంది. ప్యాడ్లను పారవేయడానికి పర్యావరణహితమైన జాతీయ స్థాయి వ్యవస్థను ఏర్పాటు చేయాలి. జిల్లాస్థాయిలో ప్రతి ఏటా మౌలిక సదుపాయాలను తనిఖీ చేసి పబ్లిక్ రిపోర్టులు విడుదల చేయాలి. ఈ అంశాన్ని మహిళల సమస్యగానే చూడకుండా పబ్లిక్ హెల్త్ అంశంగా పరిగణించి చట్టబద్ధమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page