రాత్రయితే వారు రబ్బరు బొమ్మలే!
- DV RAMANA

- Jan 9
- 2 min read
సూర్యుడు ఉన్నంత వరకే వారిలో చలనం
అస్తమించగానే ఆవరించనున్న నిస్తేజం
డాక్టర్లకు అంతుచిక్కని వింత రుగ్మత
ప్రపంచంలో ఒకే ఒక్క కేసు
బలూచిస్తాన్ అన్నదమ్ములిద్దరూ బాధితులే

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
సమస్త జీవరాశికి వెలుగును ప్రసాదించే సూర్యుడు ఉదయం ఉదయించి.. సాయంత్రం అస్తమించడం ఆయన కర్తవ్యం. అదే ప్రకృతి ధర్మం. ఉదయించి వెలుగులు ప్రసాదించినంత వరకు పగలు, అస్తమించాక చీకట్లు ముసురుకుంటే రాత్రి అని వ్యవహరిస్తాం. ఇదే మనుషుల విషయంలో జరిగితే ప్రకృతి విరుద్ధంగా చెప్పాల్సి ఉంటుంది. సూర్యుడి వెలుగుతోనే ప్రపంచం చైతన్యం సంతరించుకుని తన దైనందిన కార్యకలాపాల్లో నిమగ్నమవుతుంది. తిరిగి రాత్రి చీకట్లు ముసురుకోగానే రోజంతా శ్రమించిన ఆలసటతో నిద్రపోయి నిద్రావస్థలోకి జారుకుంటుంది. ఈ ప్రపంచంలో భాగమైన మానవళి జీవనక్రమం కూడా ఇదే. కానీ చిన్నవారైన ఆ అన్నదమ్ముల విషయంలో మాత్రం దీనికి భిన్నంగా జరుగుతోంది. అందరిలాగే వారు కూడా సూర్యుడి వెలుగు సోకిన వెంటనే చైతన్యం పుంజుకుంటారు. తోటి పిల్లల మాదిరిగానే తమ పనులు తాము చేసుకుని చదువుకుంటారు.. ఆట్లాడతారు.. అల్లరి చేస్తారు. కానీ సూర్యుడి వెలుగు తగ్గిపోతున్న కొద్దీ వారి తీరు మారిపోతుంది. శరీర స్పందన తగ్గిపోతుంటుంది. సూర్యుడు పూర్తిగా ఆస్తమించి చీకట్లు ముసురుకోగానే వారు కూడా చీకట్లో కూరుకుపోయినట్లే. ఎందుకంటే.. ఇక వారి శరీరాలు చలనం లేకుండా నిస్తేజంగా మారిపోతాయి. అంతవరకు చలాకీగా తిరిగినవారు నిస్సత్తువగా ఉన్నచోటే కూలబడిపోతారు. వారి అవసరాలన్నింటినీ కుటుంబ సభ్యులే గమనించి తీర్చాల్సి ఉంటుందే తప్ప.. వారు కనీసం వేలు కూడా కదపలేని నిస్సహాయులుగా.. ఒక విధంగా చెప్పాలంటే గాలి తీసిన బెలూన్ల మాదిరిగా తయారవుతారు. పాకిస్తాన్‌లోని బెలూచిస్తాన్ ప్రావిన్స్‌కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఈ వింత రుగ్మతతో ఇబ్బంది పడుతున్నారు.
సోలార్ కిడ్స్‌గా పేరు
పపంచంలో అనేక రకాల వ్యాధులు ఉన్నాయి. కొన్ని సాధారణమైనవి, కొన్ని అరుదైనవి అయితే.. ఇంకొన్ని అసలు నమ్మశక్యం కానివి. బలూచిస్తాన్ సోదరులను పీడిస్తున్న రుగ్మత ఆ కోవకు చెందినదే. సాధారణంగా మనందరం రాత్రి వరకు దైనందిన పనులు చేసుకుని అలసిపోతాం. ఆ అలసట తీరి.. శరీరానికి విశ్రాంతి ఇచ్చేందుకు వీలుగా రాత్రిపూట నిద్రపోతాం. కానీ ఆ సోదరులు నిద్రపోవడం కాకుండా తమంతట తాము ఏమీ చేసుకోలేని నిస్సహాయులైపోతారు. ఇంకోలా చెప్పాలంటే రాత్రంతా వారు జీవచ్ఛవాలతో సమానం. వారి శరీరం పూర్తిగా నిష్క్రియంగా మారిపోతుంది. ఇలా జరగడం సాధ్యమేనా అన్న సందేహం కలగకమానదు. ఆ దుస్థితిని స్వయంగా ఎదుర్కొంటున్న అన్నదమ్ములే దానికి నిదర్శనం. వారి అనారోగ్యాన్ని చూసి వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. భూమిపై ఇలాంటి వ్యాధి మరెవరికీ లేదంటున్నారు. అందుకే వైద్యులు వారికి సోలార్ కిడ్స్ అని వ్యవహరిస్తున్నారు. బలూచిస్తాన్‌లోని ఒక చిన్న గ్రామంలో నివసించే ఈ పిల్లలు పగటి వెలుతురులో సాధారణ పిల్లల్లాగే ప్రవర్తిస్తుంటారు. కానీ సూర్యాస్తమయం కాగానే ఒక్కసారిగా తమలో శక్తిని ఎవరో లాగేసుకున్నట్లు నిస్తేజంగా, నిస్సత్తువగా మారి ఉన్నచోటే పడిపోతారు. వారి కాళ్లూచేతులు వదులైపోతాయి. నడక ఆగిపోతుంది, మాటలు నిలిచిపోతాయి. వారి శరీరానికి చెందిన స్విచ్‌ను ఆఫ్ చేసినట్లుగా ఉంటుంది పరిస్థితి. రాత్రంతా వారి భారం తల్లిదండ్రులదే.
కారణం ఏమై ఉంటుందబ్బా!
సూర్యుడి శక్తితోనే పని చేస్తున్నట్లు వారి శరీరాలు ప్రవర్తిస్తుంటాయి. సూర్యరశ్మి తగ్గుతున్న కొద్దీ వారి శక్తి హరిస్తుంటుంది. అయితే ఈ పరిస్థితికి కాంతి మాత్రమే కారణం కాకపోవచ్చని, శరీరంలో బయటపడకుండా ఉన్న ఏదో వ్యాధి ప్రభావం కూడా ఉండవచ్చని వైద్యులు విశ్లేషిస్తున్నారు. కానీ ఆదేమిటో ఇంతవరకు కనుగొనలేకపోయారు. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇలాంటి కేసు ప్రపంచంలో మరెక్కడా లేదు. ఈ వ్యాధి ఏదో జన్యుపరమైన మార్పులతో ముడిపడి ఉండవచ్చు. శరీరంలో శక్తిని ఉత్పత్తి చేసే వ్యవస్థలో తీవ్రమైన లోపం కారణంగా నాడీ వ్యవస్థలో ఈ సమస్య వచ్చి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. బాధితుల రక్త నమూనాలు, వారి ఇంటి పరిసరాల మట్టి, గాలి నమూనాలను పరీక్షంచినా లోపం ఏమిటో తేలలేదు. అయితే తాత్కాలిక చికిత్సగా వైద్యులు ఈ రుగ్మతకు డోపమైన్ ఔషధాన్ని సూచించారు. ఆ మందు వాడటం ద్వారా రాత్రిపూట కూడా ఆ సోదరులను క్రియాశీలంగా ఉంచగలిగారు. దాని ప్రభావంతో రాత్రిపూట వారు స్వయంగా నడవగలుగుతున్నట్లు గుర్తించారు. అయితే అసలు రుగ్మత ఏమిటి? ఎందుకు సంభవిస్తుంది?? దానికి చికిత్స ఏమిటి??? అన్నది ఇప్పటికీ తేల్చలేకపోతున్నారు.










Comments