top of page

రా.. దిగి రా.. దివి నుంచి భువికి దిగిరా!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Sep 24
  • 3 min read
  • మూడురోజులైనా దిగిరాని నిత్యావసర వస్తువుల ధరలు

  • పాత స్టాకు అంటూ పాత రేట్లకే అమ్ముతున్నారన్న ఆరోపణలు

  • ఇటువంటి వారిపై ఫిర్యాదు చేయాలంటున్న కేంద్ర ప్రభుత్వం

  • పాత రేట్లతోనే మార్చి 31 వరకు అమ్ముకోవచ్చంటున్న రాష్ట్రం

  • అలాంటప్పుడు బంపర్‌ ఆఫర్‌ అంటూ ఆర్భాటాలు ఎందుకంటూ అసంతృప్తి

ree

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

వస్తుసేవల పన్ను(జీఎస్టీ) సవరణ రేట్లు అమల్లోకి వచ్చి మూడు రోజులైంది. కానీ వాటి ఫలితాలు ఇంకా సామాన్యులకు అందడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తగ్గింపు ధరలు అమల్లోకి వచ్చిన తర్వాత సూపర్‌ మార్కెట్లు, కిరాణా షాపులకు వెళ్లిన అనేకమంది అక్కడ పాత ధరలనే వసూలు చేస్తుండటం చూసి అవాక్కవుతున్నారు. అసంతృప్తితో సోషల్‌ మీడియాల్లో పోస్టులు పెడుతున్నారు. కార్లు, బైకులు, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ వంటి భారీ వస్తుసేవల తగ్గింపు రేట్లు కేంద్రం ప్రకటించిన 22నాటికే అమల్లోకి వచ్చినా.. సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యధికంగా మేలు చేసే నిత్యావసర వస్తువుల రేట్లు మాత్రం ఇంకా దిగిరాలేదు. అదేమిటని అడిగితే.. పాత స్టాకు అమ్ముతున్నామని, కొత్త స్టాకు వచ్చేవరకు ఇంతేనని వ్యాపారులు చెబుతున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. అందుకు తగినట్లు రాష్ట్ర ప్రభుత్వం కూడా పాత ఎమ్మార్పీ రేట్లు ఉన్న స్టాకును వచ్చే ఏడాది మార్చి 31 వరకు అదే రేట్లకు అమ్ముకోవచ్చని ఉదారంగా వెసులుబాటు కల్పించింది. ఆ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆదేశాల మేరకు వినియోగదారుల వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది కేంద్ర ప్రభుత్వ ప్రకటనలకు విరుద్ధంగా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై నిరాశ వ్యక్తం చేస్తున్న వినియోగదారులు ఈ మాత్రం దానికి ఏదో ఆకాశాన్ని నేలకు దించేసినట్లు ఆర్భాటం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

సంస్కరణలో అమల్లోకి వచ్చినా..

దేశవ్యాప్తంగా ఏకపన్ను విధానంలో భాగంగా తీసుకొచ్చిన వస్తుసేవల పన్ను(జీఎస్టీ) వ్యవస్థలో నాలుగు పన్ను శ్లాబులు ఉండేవి. అనేక నిత్యావసర వస్తువులు, సేవలను అధిక పన్ను శ్లాబుల్లో చేర్చడం వల్ల సామాన్య ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారని చాలా కాలంగా ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞాపనలు వెళ్లాయి. వీటిపై ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ప్రధానమంత్రి మోదీ కూడా స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో ప్రజలకు ఉపశమనం కలిగేలా త్వరలోనే జీఎస్టీ సంస్కరణలు తెస్తామని ప్రకటించారు. ఆ మేరకు గత నెలలో సమావేశమైన జీఎస్టీ కౌన్సిల్‌ జీఎస్టీ నాలుగు శ్లాబులను రెండుకు కుదించింది. పలు నిత్యావసర వస్తువులు, కొన్ని సేవలను 12 శాతం నుంచి 5 శాతం శ్లాబులోకి, 5 శ్లాబులో ఉన్న వాటిలో కొన్నింటికి పన్ను లేకుండా నిర్ణయం తీసుకుంది. ఈ సంస్కరణలు సెప్టెంబర్‌ 22 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం అప్పుడే ప్రకటించింది. ఆ ప్రకారం ఈ నెల 22 నుంచి వాహనాల ధరలు, ఇన్సూరెన్స్‌ ప్రీమియం ధరలు తగ్గినా.. అసలైన నిత్యావసర వస్తువులు మాత్రం దిగిరాలేదు. మెజారిటీ సూపర్‌మార్కెట్లు, షాపుల్లో తగ్గింపు ధరలను అమలు చేయడంలేదు. కొత్త రేట్ల బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. దీనికితోడు తాజాగా రాష్ట్ర పరిధిలోని వినియోగదారుల వ్యవహారాల శాఖ జారీ చేసిన సర్క్యులర్‌ వ్యాపారుల వాదనకు వత్తాసు పలికేలా ఉంది. కొత్త రేట్లు అమల్లోకి వచ్చిన సెప్టెంబర్‌ 22కు ముందు ప్యాక్‌ చేసిన, తయారైన సరుకులు, వస్తువులపై ఉన్న ఎమ్మార్పీ రేటును తొలగించాల్సిన పని లేదని, అలాగే కొత్త ఎమ్మార్పీ స్టిక్కర్‌ కూడా వేయాల్సిన అవసరం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆదేశించినట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ పేర్కొంది. అయితే తగ్గిన ధరల వివరాలను వినియోగదారులకు తెలిసేలా బోర్డు ప్రదర్శించాలని సూచించింది. వ్యాపారులు నష్టపోకూడదన్న ఆలోచనతోనే ఈ అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే పాత ఎమ్మార్పీ రేట్లకే విక్రయాలు జరుపుతున్న వ్యాపారులు ఇదే అదనుగా కొత్త రేట్లను మార్చి 31 వరకు అమలు చేయకుండా పాత స్టాకు అన్న సాకులు చెప్పే వెసులుబాటు కల్పించినట్లయ్యింది. జీఎస్టీ సంస్కరణలను ప్రకటించి వాటి అమలుకు నెల రోజులకుపైగానే సమయం ఇచ్చినప్పుడు.. ఇంకా పాత స్టాకు నెపం చెబుతూ తగ్గింపు రేట్లు అమలు చేయకపోవడం తగదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

అంతన్నారు.. ఇంతన్నారు!

సాక్షాత్తు ప్రధానమంత్రి త్వరలో జీఎస్టీ సంస్కరణలు అంటూ స్వాతంత్య్ర దినోత్సవంనాడే ఊరించారు. పన్నుల తగ్గింపును ప్రకటిస్తున్న సందర్భంలో ప్రజలకు అదో పెద్ద వరంగా ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రకటించారు. ఆ తర్వాత జాతినుద్దేశించి మాట్లాడిన ప్రధాఇ మోదీ కూడా దసరా, దీపావళి పండుగలకు బంపర్‌ బొనాంజా అని ఊదరగొట్టారు. ఇక రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో ఉన్న ఎన్డీయే కూటమి సర్కారు అయితే జీఎస్టీ సంస్కరణలను ఆకాశానికెత్తేస్తూ, ఆహా.. ఓహో అని స్తుతిస్తూ ఏకంగా అసెంబ్లీలోనే తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. కానీ చివరికొచ్చేసరికి నిత్యావసరాల విషయంలో జెల్ల కొట్టేశారని వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాత స్టాకు అమ్ముకోవడానికి తగిన సమయం ఇచ్చారని.. మరికొంత సమయం ఇచ్చిన ఫర్వాలేదు గానీ..ఏకంగా మరో ఆరు నెలలు పాత స్టాకు పేరుతో పాత ఎమ్మార్పీ రేట్లకు సరుకులు అమ్ముకునే అవకాశం కల్పించడం ఏమాత్రం సమంజసం కాదని పలువురు విమర్శిస్తున్నారు. అలాంటప్పుడు భారీ తగ్గింపు, బంపర్‌ ఆఫర్‌ అంటూ ఊదరగొట్టి ఊరించకుండా.. తగ్గింపు రేట్ల అమలును కూడా ఆరు నెలలు వాయిదా వేయవచ్చు కదా! అని కొందరు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.

కేంద్ర, రాష్ట్ర సర్క్యూలర్ల మధ్య వైరుధ్యం

దుకాణదారులు తగ్గిన ధరలకు వస్తువులు అందించడం లేదనే వస్తున్న ఆరోపణలను, వార్తలను వస్తున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలతో సర్క్యులర్‌ జారీ చేసింది. జీఎస్టీ సంస్కరణలను అమలు చేయని వ్యాపారులపై ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంటూ, అందుకు టోల్‌ ఫ్రీ నంబర్‌ 1915కు కాల్‌ చేయడం లేదా 8800001915 నెంబరుకు వాట్సప్‌/ఎస్‌ఎంఎస్‌ రూపంలో వివరాలు పంపించాలని పేర్కొంది. నేషనల్‌ కన్స్యూమర్‌ హెల్ప్‌లైన్‌ లేదా ఉమంగ్‌ యాప్‌ ద్వారా కూడా ఫిర్యాదులు చేసే అవకాశం కల్పించింది. వస్తువుల వాస్తవ ధరలను వినియోగదారులు తెలుసుకునేలా పాత స్టాక్‌పై కొత్త రేట్లతో స్టిక్కర్లు అతికించాలని స్పష్టంగా పేర్కొంది. అలాగే పాత ఎమ్మార్పీ స్టిక్కర్‌ను తొలగించకుండా అలాగే ఉంచాలని సూచించింది. వినియోగదారులు ఆ రెండు స్టిక్కర్లను చూసి ధరల్లో తేడా గమనించి తగ్గింపు రేటునే చెల్లించాల్సి ఉంటుంది. కొత్త, పాత ఎమ్మార్పీ స్టిక్కర్లు లేకపోతే ఫిర్యాదు చేయవచ్చు. కానీ ఇది చాలావరకు అమలుకావడంలేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. కాగా పాత, కొత్త రేట్ల స్టిక్కర్లు తప్పనిసరిగా ఉండాలని కేంద్రం స్పష్టం చేస్తుంటే.. కొత్త రేట్ల స్టిక్కర్‌ అవసరం లేదని, పాత స్టిక్కర్‌ మాత్రం ఉండాలని రాష్ట్ర మంత్రి చెప్పడం కేంద్ర విధానానికి విరుద్ధంగా కనిపిస్తోంది.

ఎక్కడ.. ఎలా ఫిర్యాదు చేయాలి?

జీఎస్టీ తగ్గింపు ఉన్నప్పటికీ ఒక దుకాణదారుడు వస్తువులను తప్పుడు ధరకు అమ్మేవారిపై ప్రభుత్వ వెబ్‌సైట్‌ షశీఅంబఎవతీష్ట్రవశ్రీజూశ్రీఱఅవ.స్త్రశీఙ.ఱఅ లో ఫిర్యాదు చేయవచ్చు. ముందుగా ఈ వెబ్‌సైట్‌లో మీ పేరు, ఫోన్‌ నెంబర్‌ నమోదు చేసుకోవాలి.. తర్వాత ఓటీపీతో లాగిన్‌ అయి ఫిర్యాదు పూర్తి వివరాలు పేర్కొనాలి. తర్వాత బిల్లులు, కొన్న వస్తువుల ఫోటోలు వంటి సంబంధిత పత్రాలను అప్‌లోడ్‌ చేయాలి. వెబ్‌సైట్‌ ఉపయోగించడంలో ఇబ్బంది ఉంటే పైన పేర్కొన్న టోల్‌ఫ్రీ నంబర్లకు కాల్‌ చేసి లేదా మెసేజ్‌ల రూపంలో ఫిర్యాదు చేయవచ్చు. ఏ వస్తువుల ధరలు ఎంత మేరకు తగ్గాయన్నది వినియోగదారులు తెలుసుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ంaఙఱఅస్త్రషఱ్‌ష్ట్రస్త్రర్‌.ఱఅ అనే ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించింది. ఇన్ని ఏర్పాట్లు చేసినా కూడా నిత్యావసర వస్తువుల ధరల తగ్గింపు ప్రయోజనం ఇంకా వినియోగదారులకు చేరడం లేదన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page