రిమ్స్ పారిశుధ్య కాంట్రాక్టులో.. కోట్ల రూపాయల మాయాజాలO?
- BAGADI NARAYANARAO

- 12 hours ago
- 2 min read
తక్కువ వేతనాలు.. భారీ బిల్లులు..
ఉద్యోగాల కోసం లక్షల వసూళ్ల ఆరోపణలు
పారిశుధ్య కార్మికుల కన్నీటి వెనుక ఎవరి ఆశీర్వాదం?

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో పారిశుధ్య సేవల నిర్వహణ పేరుతో జరుగుతున్న వ్యవహారాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ప్రభుత్వ నిధులు క్రమం తప్పకుండా విడుదలవుతున్నప్పటికీ కార్మికులకు నెలల తరబడి వేతనాలు అందకపోవడం, ఒకే విధి నిర్వహిస్తున్న సిబ్బందికి వేర్వేరు వేతనాలు చెల్లించడం, ఉద్యోగాల కోసం లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ప్రభుత్వం చెల్లిస్తున్నది ఎంత.. కార్మికుడికి అందుతున్నది ఎంత..
రిమ్స్‌లో 950 పడకల ఆసుపత్రికి సుమారు 300 మంది పారిశుధ్య కార్మికులు అవసరం కాగా ప్రస్తుతం 250 మంది మాత్రమే పని చేస్తున్నారు. ప్రభుత్వ జీవో నం.134 ప్రకారం ఒక్కో కార్మికుడికి నెలకు రూ.18,600 వేతనంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. ఈ మేరకు ప్రతి నెల దాదాపు రూ.80 లక్షల వరకు నిధులు విడుదలవుతున్నట్లు సమాచారం. అయితే వాస్తవంగా చాలామంది కార్మికులకు రూ.14,500 మాత్రమే, మరికొందరికి రూ.8 వేలు, ఇంకొందరికి రూ.7 వేలు మాత్రమే చెల్లిస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. ఒకే పనికి ముగ్గురు వేర్వేరు వేతనాలు ఎందుకు? మిగిలిన సొమ్ము ఎక్కడికి వెళ్తోంది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
పీఎఫ్, ఈఎస్ఐలో వ్యత్యాసాలు
జీవో ప్రకారం ఒక్కో కార్మికుడి ఖాతాలో పీఎఫ్ కింద సుమారు రూ.3,800, ఈఎసఐ కింద రూ.650 జమ కావాల్సి ఉంది. కానీ కార్మికుల వాదన ప్రకారం పీఎఫ్‌గా కేవలం రూ.1,200, ఈఎసఐగా రూ.73 మాత్రమే జమ అవుతున్నాయి. ఈ వ్యత్యాసంపై కార్మిక శాఖ లేదా సంబంధిత అధికారులు ఎప్పుడైనా విచారణ చేపట్టారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఉద్యోగాల కోసం రూ.2.50 లక్షల వసూళ్లా
వేతనాల విషయంలో ప్రశ్నించినందుకే 23 మంది కార్మికులను అకస్మాత్తుగా తొలగించి, వారి స్థానాల్లో కొత్తవారిని నియమించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా కొత్తగా తీసుకున్న ఉద్యోగుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.2.50 లక్షల వరకు వసూలు చేసినట్లు కార్మికులు చెబుతున్నారు. ఇటీవల మరో 40 మందిని నియమించి వారి నుంచి కూడా భారీగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలు నిజమైతే ఉద్యోగాల పేరిట కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగినట్లే అవుతుంది.
ప్రధాన కాంట్రాక్టర్ ఎవరు? సబ్ కాంట్రాక్టర్ ఎవరు
జోన్-1 పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల పారిశుధ్య నిర్వహణ బాధ్యతలను ముంబైకి చెందిన క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ సంస్థ నిర్వహిస్తోంది. ఈ సంస్థ రిమ్స్ పనులను విజయనగరానికి చెందిన ఒక సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించింది. ప్రధాన సంస్థ కేవలం శాతం తీసుకుంటూ, వాస్తవ నిర్వహణ మొత్తం సబ్ కాంట్రాక్టర్ చేతుల్లోనే ఉండడం వల్ల పర్యవేక్షణలో లోపాలు చోటుచేసుకుంటున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
96 శాతం పనితీరు వెనుక అసలు కథ ఏమిటి
ప్రతి నెల రిమ్స్ అధికారులు పారిశుధ్య నిర్వహణ సంతృప్తి స్థాయి 96 శాతానికి పైగా ఉందని డీఎంఈ కార్యాలయానికి నివేదికలు పంపుతున్నట్లు సమాచారం. ఈ నివేదికల ఆధారంగానే కాంట్రాక్టర్‌కు బిల్లులు విడుదల అవుతున్నాయి. అయితే కార్మికుల సంఖ్య తక్కువగా ఉండడం, వేతనాలు ఆలస్యం కావడం, తరచూ సిబ్బంది మార్పులు జరుగుతున్నా పనితీరు ఎలా 96 శాతానికి చేరుకుంటోంది? ఈ గణాంకాల వెనుక వాస్తవ పరిస్థితి ఏమిటి? అన్నది విచారణకు అంశంగా మారింది.
రెండు నెలల వేతనాలు బకాయి..
ప్రభుత్వం నుంచి నిధులు సమయానికి విడుదలవుతున్నప్పటికీ కార్మికులకు రెండు నెలలుగా వేతనాలు అందలేదని బాధితులు చెబుతున్నారు. గతంలో బిల్లుల ప్రక్రియ రిమ్స్‌లోనే జరిగేదని, ప్రస్తుతం విజయవాడలోని డీఎంఈ కార్యాలయం నుంచి జరుగుతోందని తెలుస్తోంది. బిల్లులు క్లియర్ అవుతున్నా కార్మికులకు డబ్బులు ఎందుకు చేరడం లేదన్నది ప్రశ్న.
విచారణ అవసరO
ఉద్యోగాల కోసం లక్షల రూపాయల వసూళ్లు, వేతనాల్లో భారీ కోతలు, పీఎఫ్-ఈఎసఐ చెల్లింపుల్లో వ్యత్యాసాలు, ప్రశ్నించిన కార్మికుల తొలగింపులు, వేతన బకాయిలు, అధికారుల పాత్రపై వస్తున్న ఆరోపణలు... ఇవన్నీ కలిపి చూస్తే రిమ్స్ పారిశుధ్య కాంట్రాక్టులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయా అనే సందేహాలు బలపడుతున్నాయి. ఈ ఆరోపణలపై జిల్లా యంత్రాంగం, కార్మిక శాఖ, డీఎంఈ, అవినీతి నిరోధక సంస్థలు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలికితీయాల్సిన అవసరం ఉందని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.






Comments